‘దీన్ని తన్ని స్టేషన్‌లో వేయండి’ | AP Police overaction against women: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘దీన్ని తన్ని స్టేషన్‌లో వేయండి’

Mar 23 2026 6:09 AM | Updated on Mar 23 2026 8:08 AM

AP Police overaction against women: Andhra Pradesh

దళిత యువతిపై పేట్రేగిన పోలీసులు 

తన తండ్రిని పోలీసుస్టేషన్‌కు ఎందుకు తీసుకొచ్చారని అడిగినందుకు దాడి 

కృష్ణా జిల్లా పామర్రు ఎస్‌ఐ ఓవరాక్షన్‌ 

బూటుకాలితో తన్నుతూ.. జుట్టు పట్టుకుని లాగుతూ పోలీసుల దౌర్జన్యం 

స్పృహ కోల్పోయిన బాధితురాలు.. మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలింపు 

బాధితురాలిపైనే కేసు కట్టిన పోలీసులు

పామర్రు: తన తండ్రిని పోలీసులు ఎందుకు స్టేషన్‌కు పిలిపించారో తెలుసుకుందామని వెళ్లిన ఓ దళిత యువతి పట్ల అకారణంగా దుర్భాషలాడటమే కాక.. బూటుకాళ్లతో తన్నుతూ.. జుట్టు పట్టు­కుని లాగుతూ చిత్రహింసలకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్పృహ కోల్పోయిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కృష్ణాజిల్లా పామర్రు మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. మండలంలోని పసుమర్రు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు జుఝవరపు చిన్ని అదే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి కుమారుడు తేజ, కుమార్తె సుప్రియ ఉన్నారు. తేజ తండ్రితో పాటు పనులు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో చెట్లు నరికే పనులకు వెళ్తుంటాడు.

కుమార్తె సుప్రియ బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తోంది. మూణ్ణెళ్ల క్రితం గ్రామంలో ఓ చోట చెట్ల పొదల్లో కలి్టవేటర్‌ ఎంతోకాలంగా ఉందని గమనించిన తేజ, దాన్ని ఓ పాత ఇనుప సామాన్ల వ్యాపారికి రూ.3 వేలకు విక్రయించాడు. కొద్దిరోజుల తర్వాత ఓ వ్యక్తి వచ్చి కలి్టవేటర్‌ తనదని చెప్పడంతో తేజను తండ్రి మందలించి ఆ వ్యాపారికి రూ.3 వేలు చెల్లించి దానిని సంబంధిత వ్యక్తికి అప్పజెప్పారు. ఈ నేపథ్యంలో.. శనివారం ఉదయం పామర్రు పోలీస్‌స్టేషన్‌ నుంచి జుఝవరపు చిన్నికి పోలీసులు ఫోన్‌ చేసి స్టేషన్‌కు రావాలని చెప్పారు. పనులు ముగించుకుని చిన్ని సాయంత్రం స్టేషన్‌లో సీఐ సుభాకర్‌ వద్దకు వెళ్లాడు. సీఐ దుర్భాషలాడుతూ.. పసుమర్రులో ఓ రైతు గడ్డర్‌ పోయిందని.. దానిని తీశారా అంటూ ప్రశి్నంచారు. తమకు తెలీదని చిన్ని బదులిచ్చాడు.   

ఎవర్రా ఇది.. ఎక్కువ మాట్లాడుతోంది.. 
అదే సమయంలో విజయవాడ నుంచి వచ్చిన సుప్రియ.. తన తండ్రిని పోలీసులు పిలిపించారని తెలుసుకుని భయంతో సీఐ వద్దకు వెళ్లింది. పోలీసులు ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్కడే ఉన్న తేజను ‘ఏరా నువ్వు దొంగతనాలేనా.. మానభంగాలు కూడా చేస్తున్నావా?’ అంటూ  పామర్రు ఎస్‌ఐ ప్రశి్నంచారు. ‘సార్‌ కాస్త మర్యాదగా మాట్లాడండి. మేం చదువుకున్నాం.

మాకూ రూల్స్‌ తెలుసు’ అని సుప్రియ అనడంతో ఎస్‌ఐ కోపంతో.. ‘ఎవ్వర్రా ఇది? ఎక్కువగా మాట్లాడుతోంది. దీన్ని తన్ని స్టేషన్‌లో వేయండి’ అంటూ పోలీసులను ఆదేశించారు. వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక మహిళా హోంగార్డు సుప్రియను డాబాపై నుంచి బూటుకాళ్లతో తన్నుకుంటూ, జుట్టు పట్టుకుని లాక్కుంటూ కిందకు తీసుకొచ్చారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇది చూసి బాలిక తండ్రి చిన్ని 108కు ఫోన్‌చేయగా వారు వచ్చి రక్తపు గాయాలు లేనందున తాము ఆస్పత్రికి తీసుకెళ్లబోమని చెప్పి వెళ్లిపోయారు. ఇక చేసేదిలేక చిన్ని తన కుమార్తెను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. దీనిపై సీఐ సుభాకర్‌ను వివరణ కోరగా.. పోలీస్‌స్టేషన్‌లోని హోంగార్డునే ఆ యువతి కొట్టి గాయపర్చిందని, అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయని బదులిచ్చారు. ఆమెపైన కేసు నమోదు చేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement