సాక్షి, విజయవాడ: పాలిసెట్ -2023 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కమ్‌లో చెక్ చేసుకోండి
శనివారం విజయవాడ బందర్ రోడ్డులోని ఫార్చ్యూన్ మురళీ పార్క్ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉదయం 10.45 గం.లకు నాగరాణి “పాలిసెట్ – 2023” ఫలితాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం 10 మే, 2023 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పాలీసెట్ - 2023 ప్రవేశ పరీక్షకు 1,60,332 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 1,43,625 మంది (89.56%) హాజరయ్యారని, అందులో 1,24,021 మంది విద్యార్థులు(86.35%) ఉత్తీర్ణత సాధించారని ఆమె వివరించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 49,388 మంది అమ్మాయిలు(89.90%) కాగా, 74,633 మంది అబ్బాయిలు (84.74%) అని వెల్లడించారు. 120 మార్కులకు గానూ 30 మార్కులు(25%) సాధించిన విద్యార్థులను అర్హులుగా పరిగణించామన్నారు.
కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకి చెందిన 15 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించారని వెల్లడించారు. అత్యధికంగా ఉత్తీర్ణులైన 10,516 మంది విద్యార్థినీ, విద్యార్థులు విశాఖపట్నం జిల్లాకు చెందిన వారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ఉత్తీర్ణతకు ఎలాంటి అర్హత మార్కులు లేకపోవడం వల్ల పరీక్షకు హాజరైన ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ అభ్యర్థి ఉత్తీర్ణులే అని స్పష్టం చేశారు. పాలిసెట్ పరీక్షలో ఒకే రకమైన మార్కులు పొందిన విద్యార్థులకు గణితం మార్కులను పరిగణలోకి తీసుకొని ర్యాంకుల వరుస క్రమాలను నిర్ణయించామన్నారు.
గణితంలోనూ ఒకే రకమైన మార్కులు వచ్చినప్పుడు భౌతిక శాస్త్రం మార్కులను, భౌతిక శాస్త్రంలో కూడా ఒకే రకమైన మార్కులు వస్తే పదో తరగతి మార్కులను, పదో తరగతిలో కూడా ఒకే రకమైన మార్కులు వచ్చినప్పుడు పుట్టిన తేదీ ఆధారంగా ప్రాధాన్యతను నిర్ణయించి ర్యాంకులను ప్రకటించామన్నారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://polycetap.nic.in/ వెబ్ సైట్ ను సందర్శించి ర్యాంకు కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.
25 మే, 2023న వెబ్ కౌన్సెలింగ్ తేదీల వివరాలు తెలుపుతూ పత్రికల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 29 మే, 2023 నుండి పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ లకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు ముందుగా వెబ్ అప్లికేషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రభుత్వం అదనంగా ఏర్పాటు చేసిన 4 హెల్ప్ లైన్ సెంటర్లతో కలిపి మొత్తం 39 హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 1 జులై, 2023 నుండి తరగతులు ప్రారంభించే యోచనలో ఉన్నామన్నారు.
2023-24 విద్యా సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభిస్తున్న నంద్యాల జిల్లా బేతంచెర్ల, వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో అదనంగా చేర్చిన 840 సీట్లతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 17,934 సీట్లు, ఒక ఎయిడెడ్ కాలేజీలో 125 సీట్లు, 177 ప్రైవైట్ కాలేజీల్లో 59,058 సీట్లు మొత్తంగా తొలి ఏడాది పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు 77,177 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయా కాలేజీల్లో 31 బ్రాంచుల్లో రెండేళ్లు, మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో కూడిన డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఇప్పటికే 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు. అందులో కొత్తగా 500 డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకాగా లెర్నింగ్ మేనేజ్ మెంట్ సిస్టమ్, మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పద్ధతుల్లో విద్యాబోధన జరుగుతుందన్నారు. 2023-24 సంవత్సరానికి గానూ గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్ డిప్లొమా కోర్సులు అదనంగా చేర్చామన్నారు. ఈ ఏడాది 5 కాలేజీలకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ లభించిదన్నారు. అదనంగా మరో రెండు కాలేజీలకు అక్రిడిటేషన్ వస్తుందన్నారు. లేబొరెటీస్, కంప్యూటర్ ల్యాబ్స్ ను మరింతగా అభివృద్ధి చేస్తూ మరో 49 పాలిటెక్నిక్ కాలేజీల్లో అక్రిడిటేషన్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు.. స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు అభ్యసించే విద్యార్థుల కోసం 33 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లలో కరికులమ్ కు అనుగుణంగా శిక్షణ ఇస్తున్నామన్నారు.
2022-23 సంవత్సరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల్లో చివరి సంవత్సరం అభ్యసిస్తున్న 4000 మందికి పైగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో 84,117 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న విద్యాదీవెన క్రింద రూ.44.37 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ లబ్ధి పొందారని, 79,768 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న వసతి దీవెన క్రింద రూ.57.44 కోట్ల ఆర్థిక సాయాన్ని పొందారని వెల్లడించారు. అదే విధంగా ఏఐసీటీఈ స్కాలర్ షిప్స్ లో భాగంగా ప్రగతి స్కాలర్ షిప్ క్రింద అమ్మాయిల రూ.50 వేలు, సాక్ష్యం స్కాలర్ షిప్ క్రింద వికలాంగులైన విద్యార్థులు రూ.50వేలు సాయం పొందారన్నారు.
పాలిసెట్-2023 ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు సెక్రటరీ కే.వి. రమణబాబు, జాయింట్ డైరెక్టర్ వి. పద్మారావు, సంబంధిత శాఖా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Fact Check: దగా చేసింది ఎవరో తెలియదా రామోజీ ?
Comments
Please login to add a commentAdd a comment