విద్యుత్ రంగంలో మునుపెన్నడూ లేని విప్లవాత్మక విధానాలు
ఐదేళ్లలో అనేక పాలసీలకు రూపకల్పన చేసిన రాష్ట్ర ప్రభుత్వం
పునరుత్పాదక ఇంధనాన్నిప్రోత్సహించేందుకు పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం–2020
పీక్ పవర్ డిమాండ్‌ను చేరుకోవడానికి ఏపీ పంప్డ్ స్టోరేజీ పవర్ పాలసీ– 2022
వాతావరణ కాలుష్యానికి విరుగుడుగా ఏపీ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ–2023
ఈ పాలసీలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ విధానాలపై కేంద్రం సైతం ఆసక్తి
భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్న పెట్టుబడిదారులు
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో మునుపెన్నడూ ఎరుగని విప్లవాత్మక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం–2020, ఏపీ పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ పాలసీ– 2022, ఏపీ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ– 2023లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర ప్రభుత్వ ఇంధన విధానాలపై ఆసక్తి చూపుతోంది. ప్రపంచ వేదికలపైనా ఏపీపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు పారిశ్రామిక దిగ్గజాలు సైతం విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నారు.
ఇప్పటికే పట్టాలెక్కిన పలు ప్రాజెక్టులు..
విద్యుత్ ఉత్పత్తి సంస్థ (డిస్కం)లపై భారం పడకుండా, ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను ఎగుమతి చేసేందుకు పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన ఎగుమతి పాలసీ–2020ని నోటిఫై చేసింది. ఏపీ పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ పాలసీ–2022, ఏపీ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ–2023లను తీసుకొచ్చింది. వీటి ఫలితంగా విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో, గ్రీన్ హైడ్రోజన్, బయోడీజిల్, కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్రాజెక్టుల పెట్టుబడి ప్రతిపాదనలపై పలు ఒప్పందాలు కుదిరాయి.
ఓవైపు ప్రభుత్వ ప్రోత్సాహం, మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగ పెట్టుబడులతో రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపన శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు పట్టాలెక్కగా, మరికొన్నిటికి ప్రాజెక్టు నివేదికలు సిద్ధమవుతున్నాయి. 11,225 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ ప్రాజెక్టు (8,025 మెగావాట్ల సౌర విద్యుత్, 3,200 మెగావాట్ల పవన విద్యుత్)లను ఇప్పటికే ప్రైవేట్‌కు కేటాయించారు. అలాగే ఏఎం గ్రీన్ ఎనర్జీ (ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్) 700 మెగావాట్ల సౌర విద్యుత్, 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయి.
మెరుగుపడుతున్న పంపిణీ సౌకర్యాలు
నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సౌర విద్యుత్, 250 మెగావాట్ల పవన విద్యుత్‌కు సంబంధించి గ్రీన్‌కో గ్రూప్ సైట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) మొదటి దశలో 4,500 మెగావాట్ల ఆర్‌ఈ పవర్, రెండో దశలో 9,000 మెగావాట్ల ఆర్‌ఈ పవర్‌ను తరలించడానికి నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం నందిపాడు వద్ద మౌలిక సదుపాయాలతో పాటు 765 కిలోవాట్స్(కేవీ) సబ్‌స్టేషన్‌ను నిర్మిస్తోంది.
అలాగే 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను తరలించడానికి అనంతపురం జిల్లాలోని గుంతకల్‌లో 400 కేవీ సబ్‌స్టేషన్‌ను నిరి్మంచాలని యోచిస్తోంది. 51 గిగావాట్ల ఆర్‌ఈ పవర్ (18 గిగావాట్ల పవన విద్యుత్, 33 గిగావాట్ల సౌర విద్యుత్)ను తరలించడానికి రాష్ట్రంలో పంపిణీ సౌకర్యాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచి్చంది.
పీక్ పవర్ డిమాండ్ కోసం పీఎస్‌పీలు
వేరియబుల్ రెన్యువబుల్ ఎనర్జీ (వీఆర్‌ఈ)ని సమతుల్యం చేయడానికి, పీక్ పవర్ డిమాండ్‌ను చేరుకోవడానికి ప్రభుత్వం పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టŠస్ (పీఎస్‌పీ)లను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే 32,400 మెగావాట్ల పీఎస్‌పీల ఏర్పాటుకు 29 సైట్‌ల కోసం టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (టీసీఎఫ్‌ఆర్)లను సిద్ధం చేసింది. మొత్తం 37 చోట్ల 42,270 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్‌పీల నిర్మాణానికి స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. దశలవారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), వివిధ అనుమతులను పొందడానికి మూడేళ్ల సమయం పడుతుంది.
కాగా 16,180 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్‌పీ ప్రాజెక్టులను డెవలపర్లకు కేటాయించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కరువు పీడిత ప్రాంతాల భూములను వాటి యజమానుల అంగీకారంతో స్థానిక రెవె న్యూ అధికారుల సహకారంలో సేకరించడానికి ఇప్పటికే చర్యలు మొదలయ్యాయి.
గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్
మరోవైపు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం (హబ్)గా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా, పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి విరుగుడుగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో రాష్ట్రం భాగమవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం దేశం మొత్తం మీద ఐదు రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేయగా వాటిలో మన రాష్ట్రం కూడా ఉంది. దీనికనుగుణంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా పాలసీ–2023ని రాష్ట్రం రూపొందించింది.
రాష్ట్రంలోని బళ్లారి–నెల్లూరు (కర్ణాటక–ఆంధ్రప్రదేశ్) మధ్య నేషనల్ గ్రీన్ స్టీల్, కెమికల్స్ కారిడార్‌గా తీర్చిదిద్దనున్నారు. ఈ కారిడార్‌లోని స్టీల్, కెమికల్ ప్లాంట్‌ల కోసం సంవత్సరానికి 5 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను 30 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు. విశాఖపట్నంలో నేషనల్ గ్రీన్ రిఫైనరీ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌ను సృష్టించి 20 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్‌తో సంవత్సరానికి 4 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment