సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దేశంలోనే అతి ఎత్తైన 125 అడుగుల డా. బీఆర్.అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, విజయవాడలోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు రూ.400 కోట్లతో స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.
అంబేద్కర్ విగ్రహాన్ని ఈక్వాలిటీ ఆఫ్ లిబర్టీగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని బడుగు, బలహీనవర్గాలవారు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విజయవాడకే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే అంబేద్కర్ విగ్రహాం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిఒక్కరూ కుల, మత, పార్టీలకతీతంగా స్వచ్ఛందంగా తరలిరావాలని ఆయన ఆకాంక్షించారు.
అంబేద్కర్ భావజాలంతో పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. అందరివాడైన అంబేద్కర్ స్మృతి వనాన్ని అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా డా.బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే మ్యూజియం, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్, స్కై లైటింగ్, ఫౌంటెన్లు, లైబ్రరీ వంటి వాటితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారన్నారు.
గత ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం నిర్మాణం విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమన్నారు. అటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, ప్రతి ఒక్కరూ పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రేపటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో పండగ వాతావరణంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వీటిలో రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment