ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధం   | AP Secretariat Employees Union President Venkatramireddy urged government | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధం  

Published Fri, Jan 21 2022 3:54 AM | Last Updated on Fri, Jan 21 2022 3:54 AM

AP Secretariat Employees Union President Venkatramireddy urged government - Sakshi

నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

సాక్షి, అమరావతి: పీఆర్సీ జీవోలతో ఉద్యోగులకు జరిగే అన్యాయాన్ని సరిదిద్దాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సచివాలయంలో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ర్యాలీ చేశారు. అనంతరం వెంకట్రామిరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. రెండు నెలలుగా ఉద్యోగుల సమావేశంలో చెప్పిన వాటినే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీడియాకు చెప్పి అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. ‘సీఎస్‌ మీడియా సమావేశం ఉద్యోగులను రెచ్చగొట్టినట్టయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులకు ఎక్కడ నష్టం జరుగుతోంది? వారు ఎందుకు ఆందోళన చేస్తున్నారో ఆలోచించాలి.

మేము ఎక్కువ కోర్కెలు కోరట్లేదు. మేము అనేక అంశాల్లో వెనక్కి తగ్గాం. జీతం తగ్గితే ప్రొటెక్షన్‌ ఇస్తామన్నారు. కానీ జీవోలో 2019 నుంచి ఇచ్చిన ఐఆర్‌ను రికవరీ చేస్తామంటున్నారు. అసలు మాకు చెప్పిందేమిటి.. చేస్తోందేమిటి? కొందరు అధికారులకు ఉద్యోగులను రెచ్చగొట్టడం తప్ప వేరే ఉద్దేశం లేనట్టుంద’ని మండిపడ్డారు. పీఆర్సీలో డీఏలు కలిపి జీతం పెరిగిందనే మాట చెప్పొద్దన్నారు. ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ 4 శాతం తక్కువ ఇచ్చి, హెచ్‌ఆర్‌ఏలో 14 శాతం కోత వేసి.. జీతం పెరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు.

పీఆర్సీ అమలు సమయంలో ఉద్యోగుల నుంచి ఐచ్చికాలు తీసుకోకుండా అధికారులు అత్యుత్సాహంతో ఎలాగైనా అమలు చేసేందుకు తాపత్రయ పడుతున్నారన్నారు. ఉద్యోగుల్లోని ఆందోళన, ఆవేదన గుర్తించి ప్రభుత్వం చర్చలు జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారికి మినిమం పే స్కేల్‌ను వర్తింపజేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి ఏటా వారికి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే సోమవారం మరోసారి ఉద్యోగుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.  

ఉమ్మడి కార్యాచరణతో ముందుకు..  
న్యాయమైన పీఆర్సీ కోసం ఒకే కార్యచరణ, ఒకే వాదనతో అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. గురువారం సచివాలయంలో ఉద్యోగుల నిరసన కార్యక్రమం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పరస్పర అంగీకారంతో ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తామన్నారు. ప్రతి ఉద్యోగి ఇదే కోరుకుంటున్నారని చెప్పారు.

విభజన దగ్గర నుంచి కరోనా వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొంత ప్రభావం ఉందనేది వాస్తవమేనని, అది ఉద్యోగుల జీతాలు తగ్గించాల్సినంతగా లేదన్నారు. ఉద్యోగులకు ప్రస్తుతం వస్తున్నదాని కంటే తగ్గకుండా జీతాలు ఉండాలని సీఎం సూచించినట్టు అధికారులు అనేకసార్లు చెప్పారన్నారు. అయితే ముఖ్యమంత్రి చెప్పిన దానికి.. ప్రభుత్వం విడుదల చేసిన జీవోల మధ్య చాలా వైరుధ్యం ఉందని తెలిపారు. ప్రతి ఉద్యోగి తన జీతంలో తగ్గుదలను గ్రహించి ఆందోళనకు దిగారన్నారు. ఎటువంటి భేషజాలకు పోకుండా అంతిమంగా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటం కోసం నాయకులందరూ కలిసి పోరాటం చేస్తున్నట్టు వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement