
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల ముసుగులో కొందరు రాజకీయాలు చేస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. సచివాలయ ప్రాంగణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల్లో లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నిజానికి.. పీఆర్సీ జాప్యంపై ఉద్యోగుల్లో కొంతవరకు అసంతృప్తి ఉన్నా, వారు ప్రభుత్వానికి ఎక్కడా వ్యతిరేకంగా లేరని ఆయన స్పష్టంచేశారు. కానీ, కొన్ని సంఘాల నాయకులు పదేపదే ఉద్యోగులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, అది తగదని హితవు పలికారు. సీఎం హామీ మేరకు పది రోజుల్లో పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందన్న విశ్వాసం తమకుందన్నారు.
అందుకే ఏపీ ప్రభుత్వోద్యోగుల ఫెడరేషన్‌లోని 92 సంఘాలు నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉన్నాయని.. రెండు సంఘాలు మాత్రమే తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటించుకున్నాయన్నారు. ఆందోళన చేస్తున్న వారు గతంలో సీఎంను మూడుసార్లు కలిసినప్పుడు తమ మాజీ అధ్యక్షుడికి పదవి ఇవ్వమని అడిగారే తప్ప పీఆర్సీ గురించి ప్రస్తావించలేదని వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సీఎం జగన్‌కు మద్దతిచ్చారేమో గానీ సదరు నాయకులు కాదన్నారు. వీరు గతంలో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రచారంచేసి, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కొమ్ముకాశారని ఆరోపించారు. సీఎం చెప్పిన సమయం వరకూ వేచి చూడాల్సిన కనీస ధర్మం ఉద్యోగులుగా తమపై ఉందన్నారు. అప్పటికీ జాప్యం జరిగితే తమ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment