పెద్దకోడూరులో కార్యకర్తలకు భోజనం వడ్డిస్తున్న హరీశ్‌రావు
మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: ‘కాంగ్రెస్, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసింది. బీజేపీ నల్ల చట్టాలను తీసుకువచ్చింది’అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కానీ కేసీఆర్ రైతు నేస్తం అని, ఆయన చెప్పినవి, చెప్పనవి కూడా చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ చెప్పినవే చేయడం లేదని, అందుకే ఆ పార్టీపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరులో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లా డుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, ఆ పార్టీని నమ్మి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. రూ.90 వేలకోట్ల ఖర్చుతో కేసీఆర్ విద్యుత్ వ్యవస్థను బాగు చేశారన్నారు. కేసీఆర్ పాలనలో పదేళ్లు కరువే లేదన్నారు. కాంగ్రెస్ అడుగుపెట్టింది.. మళ్లీ కరువొచ్చిందన్నారు. మళ్లీ బోర్లలో పూడిక తీసుడు.. కరెంటు మోటార్లు కాలుడు మొదలైందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లకు చురక పెడితేనే దారికొస్తారన్నారు. సమావేశం అనంతరం కార్యకర్తలకు హరీశ్‌రావు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment