రూ.20 వేల పెట్టుబడి సాయం చేయాలి
వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నకు ఏపీ కౌలు రైతు సంఘం వినతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూటికి 80 శాతం కౌలుదారులున్నారని, వాందరినీ గుర్తిస్తూ ప్రభుత్వం కౌలు కార్డులివ్వాలని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాధాకృష్ణ, ఎం.హరిబాబు డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలపై గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. పంటల నమోదులో కౌలురైతుల పేర్లతోనే నమోదు చేయాలన్నారు. భూమి లేని ఓసీ రైతులతో సహా కౌలుదారులందరికీ రూ.20వేల పెట్టుబడి సాయం అందించాలని కోరారు.
కౌలురైతులకు పంట రుణాలు, పంట నష్టపరిహారం, పంటల బీమా తదితర సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అయితే 2019లో తీసుకొచ్చిన పంట సాగుదారుల హక్కు చట్టంలో భూ యజమాని విధిగా కౌలు ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని లేదా వీఆర్వోకు ఫోన్ చేసి తన అంగీకారాన్ని తెలియజేయాల్సి ఉంటుందన్నారు. మెజార్టీ భూ యజమానులు అంగీకార పత్రంపై సంతకాలు చేయకపోవడం వలన కౌలుదారులు కౌలుకార్డులు పొందలేక, పంట రుణాలతో పాటు ప్రభుత్వ రాయితీలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అందువలన 2011లో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ అ«దీకృత రైతుల చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఈ చట్టం ప్రకారం భూ యజమానుల అంగీకారంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కౌలురైతులను గుర్తించి, గ్రామసభల్లో కౌలుకార్డులు ఇచ్చేదని గుర్తు చేశారు. భూ యజమానులు ఏమైనా అభ్యంతరాలు లేవనెత్తితే వాటిని అధికారులే పరిష్కరించేవారన్నారు. గ్రామాల వారీగా కౌలు రైతుల జాబితాలను బ్యాంకులకు పంపి పంట రుణాలు, ప్రభుత్వ రాయితీలు అందించేవారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment