
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ భాగస్వామ్యం కోసం ఆంధ్రప్రదేశ్ మౌలికవసతుల కల్పనాభివృద్ధి సంస్థ(ఏపీఐఐసీ) రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ టెండర్లను పిలిచింది. ఈ పార్కును కనీసం 2,000 ఎకరాల్లో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్(డీబీఎఫ్‌వో) విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా భాగస్వామ్య సంస్థలు, వ్యక్తిగత డెవలపర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ టెండర్లను ఆహ్వానించింది. ఔషధాల తయారీలో స్వయం సంవృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్‌ను కూడా కేటాయించింది. ఈ పార్కుల్లో ఒకటి రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి సంబంధించిన దరఖాస్తును సాధ్యమైనంత త్వరగా దాఖలు చేసేందుకు గానూ భాగస్వామి కోసం టెండర్లు పిలిచినట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 18 తేదీ సాయంత్రం 5లోగా టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. రూ.59,000 రుసుము చెల్లించడం ద్వారా తమ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు పొందవచ్చని ఏపీఐఐసీ పేర్కొంది.