
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక విభాగపు పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయించింది. దీనివల్ల అభ్యర్థులందరికీ మేలు జరుగుతోందని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సాంకేతిక, ప్రత్యేక అర్హతలతో కూడిన పోస్టుల నియామకాలకు ఏపీపీఎస్సీ ఇప్పటివరకు ఆంగ్లంలోనే పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది.
వీటిని తెలుగు మాధ్యమంలో కూడా నిర్వహించాలని గత కొంతకాలంగా గ్రామీణ, తెలుగు మాధ్యమం అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఈ పరీక్షలకు సంబంధించిన పేపర్–1ను ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. పేపర్–1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలుంటాయి. ఆంగ్లం ప్రశ్నలను తెలుగులో అనువదించి ఇస్తారు. అయితే ఈ రెండు మాధ్యమాల్లో ఆంగ్లంలోని ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇక పేపర్–2లో సబ్జెక్టు పేపర్లను మాత్రం ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించనున్నారు.
(చదవండి: డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్ అమ్మకం ధరలు తగ్గింపు!)
Comments
Please login to add a commentAdd a comment