జూలై 28న గ్రూప్‌–2 మెయిన్స్‌ | appsc group 2 mains exam july 28th | Sakshi
Sakshi News home page

జూలై 28న గ్రూప్‌–2 మెయిన్స్‌

Published Tue, Jun 4 2024 5:19 AM | Last Updated on Tue, Jun 4 2024 5:19 AM

appsc group 2 mains exam july 28th

రేపటి నుంచి పరీక్ష సెంటర్, పోస్టు, జోనల్‌ ఆప్షన్స్‌ నమోదు 

899 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్‌ 7న నోటిఫికేషన్‌

ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్‌.. ఏప్రిల్‌ 10న ఫలితాల ప్రకటన 

1:100 చొప్పున అభ్యర్థులకు అవకాశం

మెయిన్స్‌కు 92,250మంది అర్హత

సాక్షి, అమరావతి: గ్రూప్‌–2 మెయిన్‌ పరీక్షలను జూలై 28వ తేదీన ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి అభ్యర్థులు ఈ నెల 5 నుంచి 18వ తేదీ వరకు పరీక్ష కేంద్రంతోపాటు తమ పోస్టు, జోనల్‌/జిల్లా ప్రాధాన్యతను సమర్పించాలని సర్వీస్‌ కమిషన్‌ సూచించింది. జూలై 28వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఆఫ్‌లైన్‌లో పరీక్ష ఉంటుందని ప్రకటించింది. ఈసారి మెయిన్స్‌ పరీక్షకు 92,250 మంది హాజరుకానున్నారు. ఏపీపీఎస్సీ 899 గ్రూప్‌–2 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్‌ 7న నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.

పరీక్ష నిర్వహించిన 45 రోజుల రికార్డు వ్యవధిలో ఏప్రిల్‌ 10న ప్రిలిమ్స్‌ ఫలితాలను కూడా వెల్లడించింది. గతానికి భిన్నంగా ఎక్కువ మంది నిరుద్యోగులకు మేలు చేసేందుకు మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. చివరిగా 2018లో నిర్వహించిన గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ రాసినవారి నుంచి 1:12 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. అయితే, నిరుద్యోగుల నుంచి ఏపీపీఎస్సీకి అందిన విజ్ఞప్తుల మేరకు ఎక్కువ మందికి మెయిన్స్‌ రాసేందుకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఒక పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక చేశారు. గ్రూప్‌ పరీక్షలకు 1:100 విధానంలో ఎంపిక చేయడం సర్వీస్‌ కమిషన్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో 899 పోస్టులకు గాను 92,250 మంది మెయిన్స్‌ రాయనున్నారు.

ఇవీ పోస్టుల వివరాలు... 
ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్‌–2 నోటిఫికేషన్‌లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, గ్రేడ్‌–3 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టులు 4, గ్రేడ్‌–2 సబ్‌ రిజిస్ట్రార్‌ 16, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ 28 పోస్టులతోపాటు 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు ఉండగా, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఏవో), సీనియర్‌ ఆడిటర్, ఆడిటర్‌ ఇన్‌ పే అండ్‌ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 566 ఉన్నాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే మెయిన్స్‌ పరీక్షలో పేపర్‌–1, పేపర్‌–2లకు 150 మార్కులకు 150 చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు తమ పరీక్ష సెంటర్, ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్యత, జోనల్‌/జిల్లా ప్రాధాన్యతలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ http:// www.psc.ap.gov.in లో బుధవారం నుంచి నమోదు చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement