సాక్షి, అమరావతి: సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సన్నద్ధమైంది. భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సంక్రాంతి సీజన్‌లో ఏకంగా 6,970 ప్రత్యేక సర్వీసులు నిర్వహించనుంది. వాటిలో పండగ ముందు 4,145 ప్రత్యేక సర్వీసులు, పండగ తరువాత 2,825 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళికను ఆమోదించింది. గత ఏడాది కంటే 35 శాతం అధికంగా ఈ ఏడాది ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది.
సంక్రాంతి స్పెషల్ సర్వీసులు ఇలా..
సంక్రాంతికి ముందు అంటే జనవరి 8వ తేదీ నుంచి 14 వరకు 4,145 ప్రత్యేక బస్సులు నిర్వహిస్తుంది. వీటిలో 1,500 బస్ సర్వీసులు హైదరాబాద్‌కు కేటాయించారు. విశాఖపట్నానికి 650, విజయవాడకు 250, బెంగళూరుకు 100, చెన్నైకి 45 సర్వీసులు నిర్వహిస్తారు. మిగిలిన 1,600 సర్వీసులు అన్ని జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాలకు కేటాయించారు. గత ఏడాది సంక్రాంతి ముందు మొత్తం 2,982 ప్రత్యేక బస్సులే ఆర్టీసీ నడిపింది. ఈసారి 1,163 సర్వీసులను అధికంగా కేటాయించింది.
తిరుగు ప్రయాణానికీ ఇబ్బంది లేకుండా..
పండగ తరువాత తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం కూడా తగినన్ని ప్రత్యేక బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. జనవరి 15 నుంచి 17 వరకు 2,825 ప్రత్యేక బస్సులు నడపనుంది. వాటిలో హైదరాబాద్‌కు అత్యధికంగా వెయ్యి బస్సులను కేటాయించారు. విశాఖపట్నానికి 200, విజయవాడకు 350, బెంగళూరుకు 200, చెన్నైకు 75 బస్సులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులు నిర్వహిస్తారు. గతేడాది సంక్రాంతి తరువాత 2,151 ప్రత్యేక బస్సులు నిర్వహించారు. ఈ ఏడాది 674 బస్సులను అధికంగా కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment