సాక్షి, అమరావతి: మడ అడవుల విస్తీర్ణం రాష్ట్రంలో గణనీయంగా వృద్ధిచెందుతోంది. తీర ప్రాంతానికి రక్షణలో ఈ అడవులు కీలకపాత్ర వహిస్తాయి. తుపానులు వచ్చినప్పుడు రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. కోతను నివారిస్తాయి. గడచిన ఎనిమిదేళ్లలో 10శాతం మేర మడ అడవుల విస్తీర్ణం పెరిగినట్లు అటవీశాఖ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది.
2014నాటికి రాష్ట్రంలో 31,888 హెక్టార్లలో ఇవి విస్తరించగా, ప్రస్తుతం ఈ విస్తీర్ణం 40,500 హెక్టార్లకు పెరిగింది. పశ్చిమ బెంగాల్, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల తర్వాత మన రాష్ట్రంలోనే మడ అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉంది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 2,114 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండగా, గుజరాత్‌లో 1,175 చదరపు కిలోమీటర్లు, అండమాన్ నికోబార్ దీవుల్లో 616 చదరపు కిలోమీటర్లలో ఉన్నాయి.
మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో ఎక్కువ మడ అడవులు ఉన్నాయి. గోదావరి తీరంలో కాకినాడ, బీఆర్ అంబేద్కర్ జిల్లాలు, కృష్ణా తీరంలో కృష్ణా, బాపట్ల జిల్లాల్లో ఇవి విస్తరించాయి. ఇవి కాకుండా శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ కొద్దిమేర మడ అడవులు ఉన్నాయి.
ప్రధానంగా కాకినాడ జిల్లాలోని కోరింగ అభయారణ్యంలో ఉన్న మడ అడవులు ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ 187.81 చదరపు కిలోమీటర్ల మేర ఉండగా, ఆ తర్వాత కృష్ణా అభయారణ్యంలో 137.76 చదరపు కిలోమీటర్లలో ఈ అడవులు వ్యాపించి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మడ అడవులు తగ్గుతుండటంతో, రాష్ట్రంలో ఈ అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు అటవీశాఖ కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేసింది.
ఇందు కోసం ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటుచేసింది. అక్కడి నుంచి విత్తనాలు తీసుకెళ్లి సముద్ర ముఖద్వారాల్లో చల్లించింది. ఆయా ప్రాంతాలకు చెందిన స్థానికుల సహకారంతో సంరక్షణకు చర్యలు చేపట్టింది. ఈ మడ అడవుల ద్వారా తీర ప్రాంత రక్షణతోపాటు, అక్కడ నివసించే లక్షలాదిమంది జీవనోపాధి కూడా పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment