కళ్లకు గంతలతోనే దర్యాప్తు  | Arrested Ys Bhaskar Reddy, Suspicions About Cbi Enquiry On Ys Viveka Case | Sakshi
Sakshi News home page

సత్యదూరంగా  సీబీఐ రిమాండ్‌ రిపోర్ట్‌..  వాస్తవాలు, కుట్రకోణాలను విస్మరించిన సీబీఐ 

Published Mon, Apr 17 2023 2:16 AM | Last Updated on Mon, Apr 17 2023 2:43 PM

Arrested Ys Bhaskar Reddy, Suspicions About Cbi Enquiry On Ys Viveka Case - Sakshi

కుమారుడు, భార్య షమీమ్‌తో వివేకా (ఫైల్‌)

సాక్షి, అమరావతి: ఏనుగు కాళ్లు, తొండం, తోక పట్టుకుని నలుగురు అంధులు గనక ఆ ఏనుగెలా ఉందో ఊహిస్తూ చెబితే ఏమవుతుంది? వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ కూడా ఇలాగే చేస్తోంది. వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ... కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టు దీన్నే తలపిస్తోంది. కుట్రదారులెవరో నిగ్గుతేల్చే నిప్పు కణికల్లాంటి అంశాలను పూర్తిగా వదిలేసి దర్యాప్తు సాగిస్తుండటమే విస్మయం కలిగిస్తోంది. అవేంటంటే...

♦వైఎస్‌ వివేకానందరెడ్డి రెండో వివాహంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఆస్తి కోసం..రాజకీయ వారసత్వం కోసం ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

♦మెజార్టీ ఓట్లు ఉన్నప్పటికీ స్థానిక కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసిన వైఎస్‌ వివేకానంద రెడ్డి ఓడిపోయారు. టీడీపీ గెలిచింది.

♦వివేకా గుండెపోటుతో మరణించారని తొలిసారిగా చెప్పింది ఆయన పెద్ద బావమరిది శివ ప్రకాశ్‌ రెడ్డి. ఆయన తొలుత చెప్పింది టీడీపీ మంత్రి ఆది నారాయణరెడ్డికే.

♦వైఎస్‌ అవినాశ్‌ను ఎంపీగా గెలిపించేందుకు తన తండ్రి కృషి చేస్తున్నారన్న సునీత... మళ్లీ మాట మార్చి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకని?

♦స్వయంగా హత్య చేశాడంటున్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం సరైనదేనా?.. రూ.40 కోట్ల సుపారీ కట్టుకథలో అడుగడుగునా అవాస్తవాలే.

♦నార్కో పరీక్షల్లో ఏమీ చెప్పని రంగయ్య తరువాత ఏదో చెప్పారట..!

♦ఆధారాల ధ్వంసం అంటున్న సీబీఐ... ఆ మూడు వేలిముద్రలపై ఎందుకు మౌనంగా ఉంటోంది?

♦వివేకా హత్య కుట్రదారులు ఆయన అల్లుడు, పెద్ద బావమరిదే అంటున్న తులసమ్మ మాటలనెందుకు పట్టించుకోరు?
 

ఇవీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అంశాలు..  కానీ కళ్లకు గంతలు కట్టుకున్న రీతిలో సీబీఐ వాటినేమాత్రం పట్టించుకోవడం లేదు. ముందుగా నిర్ణయించుకున్నట్టుగా... ఎవరో ప్రభావితం చేస్తున్నారన్నట్టుగా ముందుకెళుతోంది. కుట్రదారులు ఎవరన్న కోణంలో కాకుండా...ముందే ఓ నిర్ణయానికి వచ్చేది ఆ దిశగా వెళుతోందనటానికి భాస్కర్‌రెడ్డి అరెస్టే తాజా తార్కాణం. తన చర్యను సమర్థించుకుంటూ సీబీఐ సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌ నిండా కల్పితాలు...ఊహాజనితాలు... అవాస్తవాలే!. ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ కేవలం గాలిమాటలు పోగేసి రిమాండ్‌ నివేదికను రూపొందించడం ఆశ్చర్యమే మరి. రిమాండ్‌ రిపోర్ట్‌లో సీబీఐ ప్రస్తావించిన అంశాలు ఒకసారి పరిశీలిస్తే...

వివేకాను కుట్రపూరితంగా ఓడించిందెవరు?
వైఎస్‌ వివేకానందరెడ్డి 2017 కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీ చేశారు. తగినంత బలం ఉంది కనక గెలుస్తారన్న ఉద్దేశంతో జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు టికెట్టిచ్చారు. కానీ ఓడిపోయారు. అందుకు వైఎస్‌ భాస్కర్‌ రెడ్డే కారణమని వివేకా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సీబీఐ తన రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. అందుకే వివేకాపై భాస్కర్‌రెడ్డి కక్ష పెంచుకున్నారన్నట్టుగా చెప్పింది. కానీ వాస్తవం ఏమిటంటే... ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించింది స్వయానా చంద్రబాబు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపికి పూర్తి మెజార్టీ ఉంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వివేకానందరెడ్డి గెలుపు నల్లేరుపై నడకే. కానీ చంద్రబాబు పన్నాగంలో భాగంగా అప్పటి టీడీపీ మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత బీటెక్‌ రవి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ  సభ్యులను ప్రలోభాలకు గురిచేశారు. కుట్ర పూరితంగా వివేకాను ఓడించారు. ఇది వైఎస్సార్‌ జిల్లాలో బహిరంగ రహస్యం. అంటే వైఎస్‌ వివేకానందరెడ్డి ఎవరిపై ఆగ్రహించాలి? వైఎస్సార్‌సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచినా.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ చేరి మంత్రి అయి తనను ఓడించిన ఆదినారాయణ రెడ్డిపై కదా? సీబీఐ మాత్రం భాస్కర్‌రెడ్డిపై ఆగ్రహించినట్టుగా కట్టు కథను అల్లడం విస్మయ పరిచేదే. 

ఇక వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఇప్పటికీ ఆదినారాయణ రెడ్డితో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. తన తండ్రిని ఓడించిన ఆయనతో వారికి సన్నిహిత సంబంధాలు ఎందకున్నాయి? వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం కూడా తన భార్య, కుమార్తె, అల్లుడి ఒత్తిడితోనే వివేకానందరెడ్డి మంత్రి అయ్యేందుకు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు. వారి ఒత్తిడితోనే ఏకంగా వైఎస్‌ విజయమ్మపై పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం తన చిన్నాన్నపై పూర్తి గౌరవంతో పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ వివేకానందరెడ్డికి రాజకీయ శత్రువులు టీడీపీ నేతలైన ఆదినారాయణ రెడ్డి, బీటెక్‌ రవిలేనని.. ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించింది కుమార్తె సునీ త, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డేనని స్పష్టమవుతోంది. మరి ఈ దిశగా సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నదే సందేహాలకు తావిస్తోంది.

ఎంపీ టికెట్‌ అవినాశ్‌ రెడ్డిదేనని అప్పటికే స్పష్టత
కడప సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న అవినాశ్‌రెడ్డికే 2019 ఎన్నికల్లో కూడా టికెట్‌ ఇస్తున్నట్లు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మౌఖికంగా ప్రకటించేశారు. దాంతో అవినాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఆయన ఎన్నికల ప్రచారానికి వైఎస్‌ వివేకానందరెడ్డే ఇన్‌చార్జి. ఆ విషయాన్ని వైఎస్‌ వివేకా హత్యకు గురైన తరువాత కూడా ఆయన కుమార్తె సునీత మీడియా ముఖంగా చెప్పారు. మరి కడప ఎంపీ టికెట్‌ కోసమే వైఎస్‌ వివేకాపై భాస్కర్‌రెడ్డి కుటుంబం కక్ష పెంచుకుందని టీడీపీ ఆరోపిస్తుండటం ఎంత నీచం!!.

గుండెపోటు కథ వివేకా పెద్ద బావమరిదిదే... 
వైఎస్‌ వివేకానందరెడ్డి గుండెపోటుతో నెత్తురు కక్కుకుని చనిపోయినట్టు భాస్కర్‌రెడ్డి ఇతర నిందితులతో కలసి ప్రచారం చేశారని సీబీఐ తన రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. వాస్తవానికి వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని వైఎస్‌ అవినాశ్‌రెడ్డిగానీ వైఎస్‌ భాస్కర్‌రెడ్డిగానీ ఎవరికీ చెప్పలేదు. ఆ విషయాన్ని  చెప్పింది వివేకానందరెడ్డి పెద్ద బావమరిది, అల్లుడికి సోదరుడు అయిన నర్రెడ్డి శివప్రకాశ్‌ రెడ్డి. అది కూడా వైఎస్‌ వివేకా రాజకీయ శత్రువు, అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డితోనే ఆయన తొలుత చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న శివ ప్రకాశ్‌ రెడ్డి స్వయంగా మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్‌ చేసి వైఎస్‌ వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. సిగరెట్లు ఎక్కువగా తాగుతారు కనక ఇలా జరిగి ఉండొచ్చని తాను చెప్పినట్లు ఆదినారాయణ రెడ్డి స్వయంగా మీడియాకు చెప్పారు. అంతేకాదు నర్రెడ్డి శివ ప్రకాశ్‌ రెడ్డే ఎంపీ అవినాశ్‌ రెడ్డికి ఫోన్‌ చేసి.. వివేకా చనిపోయిన విషయాన్ని చెప్పారు. అప్పటికే ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగు వెళుతున్న ఎంపీ అవినాశ్‌... వెనక్కి తిరిగి వైఎస్‌ వివేకా ఇంటికి వెళ్లారు. ఆ ఫోన్‌ రాకపోయి ఉంటే అవినాశ్‌రెడ్డి జమ్మలమడుగు వెళ్లేవారు. ఎన్నికల ప్రచారం చేసుకునేవారు. వైఎస్‌ వివేకా మృతిచెందారని అందరికీ చెప్పింది శివ ప్రకాశ్‌రెడ్డి. గుండెపోటుతో మరణించారని చెప్పింది కూడా ఆయనే. కానీ భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి చెప్పారంటూ సీబీఐ ఓ కల్పిత కథను రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించటం విస్మయం కలిగిస్తోంది.

వివేకా రాసిన లేఖను ఎందుకు దాచిపెట్టారు?
వైఎస్‌ వివేకా మరణించే సమయంలో లేఖ రాశారు. రక్తపు మరకలతో కూడిన లేఖ అది. డ్రైవర్‌ ప్రసాద్‌ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరచినట్టు ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను ఆ రోజు ఉదయం 6.10 గంటలలోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి... వెంటనే ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవరికి ఇవ్వకుండా దాచి ఉంచాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పీఏ కృష్ణారెడ్డితో చెప్పారు. సునీత, ఆమె భర్త మధ్యాహ్నం 1గంట సమయంలో పులివెందుల చేరుకున్నారు. వారికి ఆ లేఖ, సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి అందించారు. చివరకు సాయంత్రం 5గంటలకు వారంతా కలిసి లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. 

ఇక్కడే అత్యంత కీలకమైన అంశం దాగి ఉంది. ఆ లేఖను దాచి ఉంచమని సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పకపోయి ఉంటే కృష్ణారెడ్డి వాటిని వెంటనే బయటపెట్టేవారు. శివప్రకాశ్‌రెడ్డి చెప్పిన సమాచారంతో అక్కడికి వచ్చిన అవినాశ్‌కు గనక దాన్ని చూపించి ఉంటే... వివేకాది హత్యేనని అందరికీ వెంటనే స్పష్టత వచ్చేది. గుండెపోటో మరొకటో కాదని వెంటనే తెలిసిపోయేది. అసలు ఎవ్వరూ మృతదేహాన్ని ముట్టుకునేవారే కాదు. కానీ ఆ లేఖను దాచి ఉంచమని చెప్పడమే కాకుండా... వివేకా గుండెపోటుతో చనిపోయారని టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి చెప్పింది వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిదే. వాస్తవం ఇలా ఉంటే... గుండెపోటు కథను భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి ప్రచారంలోకి తీసుకువచ్చారని సీబీఐ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొనడమే దర్యాప్తు తీరుపై సందేహాలకు తావిస్తోంది.

ఆనాడు సునీత మాట్లాడింది మరచిపోయారా?
తన తండ్రి హత్య వెనుక అసలు దోషి ఆదినారాయణ రెడ్డేనని సునీత 2019 మార్చిలో చెప్పిన విషయాలను సీబీఐ పరిగణనలోకి తీసుకోవడమే లేదు. వివేకా హత్య తరువాత సునీత హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని పెట్టి... వైఎస్‌ కుటుంబంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తమ కుటుంబం గురించి చంద్రబాబుకు ఏం తెలుసని ప్రశ్నించారు. ఒకర్ని ఒకరు చంపుకునే చరిత్ర తమ కుటుంబానికి లేదన్నారు. కేవలం వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వ హననానికే టీడీపీ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని సునీత మండిపడ్డారు. చంద్రబాబు అసలు ఆదినారాయణ రెడ్డిని ఎందుకు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆమె సూటిగా ప్రశ్నించారు. ప్రజలు ఎవరూ చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఆనాడు అలా మాట్లాడిన సునీత ఇప్పుడెందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు?. ఎవరి ఒత్తిడి, ప్రలోభాలకు లొంగి సునీత మాట మార్చారు? ఆమె ఢిల్లీ వెళ్లినప్పుడల్లా వెనకుండి కథ నడిపిస్తున్నది ఎవరు? వ్యవస్థలను ప్రభావితం చేస్తూ దర్యాప్తును పక్కదారి పట్టిస్తోంది ఎవరు? వీటిని సీబీఐ ఎందుకు పరిగణలోకి తీసుకోవటం లేదు?

హంతకుడే అప్రూవరా...!? 
రిమాండ్‌ రిపోర్ట్‌లో సీబీఐ పేర్కొన్న మరో అంశం కూడా ఆ సంస్థ విశ్వసనీయతను శంకించేలా చేస్తోంది. వైఎస్‌ వివేకాను గొడ్డలితో స్వయంగా నరికినట్లు చెప్పిన నిందితుడు దస్తగిరిని సీబీఐ అప్రూవర్‌గా మార్చడం న్యాయ నిపుణులను విస్మయపరుస్తోంది. హత్య చేసిన వ్యక్తి జైల్లో కాక దర్జాగా బయట తిరుగుతున్నారు. అతని బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించలేదు. హంతకుడైన దస్తగిరి తో కల్పితాలు, అభూతకల్పనలు చెప్పించి... వాటి ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతుండటం వెనుక మర్మమేమిటి?

రూ.40కోట్ల సుపారీ కట్టుకథే..
దస్తగిరి అప్రూవర్‌ వాంగ్మూలం పేరిట సీబీఐ అల్లిన మరో కట్టుకథ రూ.40 కోట్ల సుపారీ స్టోరీ. వైఎస్‌ వివేకాను హత్య చేయడానికి రూ.40 కోట్లకు సుపారీ కుదిరిందని, అందులో రూ.5కోట్లు అడ్వాన్స్‌ వచ్చిందని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పి తనకు రూ.కోటి ఇచ్చారని దస్తగిరి వాంగ్మూలంలో చెప్పినట్టు సీబీఐ పేర్కొంది. మరి అదే సీబీఐ వెలికి తీసిన దస్తగిరి, సునీల్‌ యాదవ్‌ మధ్య వాట్సాప్‌ సందేశాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వివేకా హత్యకు రెండు రోజుల ముందు వరకు... ఆ తరువాత కూడా దస్తగిరి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ సునీల్‌ యాదవ్‌కు మెస్సేజులు చేశారు. కనీసం రూ.2 వేలు అయినా అప్పు ఇవ్వాలని... రూ.500 ఇచ్చినా ఆ పూట ఖర్చుకు సరిపోతాయని ప్రాథేయపడ్డారు. ఆ వివరాలన్నీ కూడా సీబీఐనే వెల్లడించింది. మరి దస్తగిరి రూ. కోటి అడ్వాన్స్‌గా తీసుకుని ఉంటే రూ.500 అప్పు ఎందుకడుగుతాడు? అంటే రూ.40కోట్ల
సుపారీ కట్టు కథే కదా?

అప్రూవర్‌గా మారగానే దస్తగిరికి డబ్బూదస్కం
ఇక అప్పటివరకు కటిక పేదరికంలో కొట్టుమిట్టాడి న  దస్తగిరి అప్రూవర్‌గా మారిపోగానే ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు. ఒక్కసారిగా కార్లతో తిరు గుతూ... ట్రాక్టర్లు కొనుగోలు చేసి... సెటిల్‌మెంట్లు మొదలు పెట్టాడు. అంటే అప్రూవర్‌గా మారి వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలకు వ్యతిరేకంగా వాంగ్మూలమిచ్చినందుకు అతనికి భారీగానే ముట్టిందన్నది తేటతెల్లమవుతోంది. మరి తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని దస్తగరిని ప్రలోభపెట్టింది ఎవరు? 

నార్కో టెస్టుల్లో ఏమీ చెప్పని రంగయ్య...!
అభిషేక్‌ మహంతి ఎస్పీగా ఉన్నప్పుడు ఈ కేసు దర్యాప్తులో భాగంగా వాచ్‌మేన్‌ రంగయ్యను విచారించారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన గుజరాత్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తీసుకువెళ్లి  అతనిపై నార్కో ఎనాలిసిస్‌ టెస్ట్, బ్రెయిన్‌ మ్యాపింగ్, లై డికెక్టర్‌ టెస్ట్‌లు నిర్వహించారు. నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించిన ఆ పరీక్షల్లో కూడా రంగయ్య ఏమీ చెప్పలేకపోయాడు. కానీ ఆ రోజు రాత్రి ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, సునీల్‌ యాదవ్‌లతోపాటు మరో వ్యక్తిని చూశానని రంగయ్య తమ దర్యాప్తులో చెప్పారని సీబీఐ అంటోంది. నార్కో పరీక్షల్లోనే ఏమీ చెప్పలేని రంగయ్య అన్ని నెలల తరువాత సీబీఐ అధికారులు మామూలుగా అడిగితే ఇవన్నీ చెప్పారట!. నమ్మశక్యమా?

తులసమ్మ పిటిషన్‌లోని అంశాలపై దర్యాప్తే లేదు
వివేకా హత్యకు కారణాలపై డి.శివ శంకర్‌ రెడ్డి భార్య తులసమ్మ పలు సందేహాలను లేవనెత్తుతూ పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో  తలెత్తిన విభేదాలు, రాజకీయ వారసత్వం, ఆస్తి పై హక్కుల కోసం కుమార్తె, అల్లుడితో విభేదాలు, నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం టీడీపీ నేత బీటెక్‌ రవి కక్షగట్టడం, ఆర్థిక విభేదాలతో కక్ష పెంచుకున్న అనుచరుడు కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డి టీడీపీ నేత బీటెక్‌ రవితో కలసి కుట్ర పన్నటం, రాజకీయ విభేదాలు ఉన్న తాడిపత్రి నేత రాజేశ్వరరెడ్డి, అతనికి సహకరించిన నీరుగట్టు ప్రసాద్‌ల ప్రమేయం...ఇలా తులసమ్మ లేవనెత్తిన కీలకమైన అంశాలను న్యాయస్థానం నమోదు చేసింది. కానీ సీబీఐ వీటిని దర్యాప్తులో కనీసం పరిగణలోకే తీసుకోవటం లేదు.

ఆ 3 వేలి ముద్రలపై మౌనం ఎందుకో...!
వివేకా హత్య స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారనేది భాస్కర్‌రెడ్డి మీద సీబీఐ చేసిన ప్రధాన అభియోగం. ఆ ఆరోపణ పూర్తిగా అహేతుకం. మరి అదే సమయంలో వివేకా హత్య ప్రదేశంలో లభించిన కీలకమైన ఆధారాలను సీబీఐ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు? మృతదేహం పడి ఉన్న బాత్‌రూమ్‌లో లభించిన వేలి ముద్రలను నిపుణులు పరిశీలించి పలువురి వేలిముద్రలతో సరిపోల్చారు. కానీ వాటిలో అయిదు వేలి ముద్రలు ఎవరితోనూ సరిపోల లేదు. వాటిలో మూడు వేలిముద్రలు పూర్తిగా ఉండగా... మరో రెండు పాక్షికంగా ఉన్నాయి. బాత్‌రూమ్‌ గోడలు, తలుపు వెనుక భాగంలో ఆ వేలి ముద్రలను గుర్తించారు. పూర్తిగా ఉన్న ఆ 3 వేలి ముద్రలు ఎవరివన్నది ఇప్పటివరకు తేలలేదు. సీబీఐ ఆ విషయాన్నే పట్టంచుకోలేదు. ఆ వేలి ముద్రలెవరివో గుర్తిస్తే అసలు దోషులెవరో తెలుస్తుంది కదా?

సీబీఐ వేధింపులపై ఫిర్యాదులు బుట్టదాఖలు
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి పేర్లు చెప్పాలని సీబీఐ తనను చిత్రహింసలకు గురి చేసిందని... ఇంకా వేధిస్తోందని కల్లూరు గంగాధర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా సీబీఐ స్పందించ లేదు. ఎంపీ అవినాశ్, భాస్కర్‌రెడ్డి పేర్లు చెప్పాలని సీబీఐ తనను వేధిస్తోందని ఉదయ్‌ కుమర్‌రెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా సీబీఐ తీరు మారలేదు. 

కొత్త బృందం...పాత కక్షే..: వివేకా హత్య కేసులో రామ్‌సింగ్‌ నేతృత్వంలోని సీబీఐ అధికారుల బృందం గతంలో ఎంత అసంబద్ధంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు. తాము చెప్పని విషయాలను కూడా చెప్పినట్టుగా వాంగ్మూలం రాసుకున్నారని పలువురు సాక్షులు వాపోయారు. తాము కోరుకున్నట్లు వాంగ్మూలమివ్వాలని చిత్రహింసలకు గురి చేస్తోందని మరికొందరు బాధితులు పోలీసులను కూడా ఆశ్రయించారు. దాంతో ఈ కేసులో నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ అధికారి రామ్‌సింగ్‌ను న్యాయస్థానం తొలగించి కొత్త బృందాన్ని నియమించాలని సీబీఐని ఆదేశించింది. కొత్త అధికారుల బృందం వస్తే కొత్త కోణంలో దర్యాప్తు చేసి కొత్త అంశాలను వెలికి తీస్తారని అంతా ఆశించారు. కానీ కొత్త బృందం వచ్చింది కానీ ఒక్క కొత్త ఆధారాన్ని కూడా కనుగొనలేదు. పైగా పాత బృందం అసంబద్ధంగా చేసిన దర్యాప్తునే ఆధారంగా చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ఏప్రిల్‌ 30లోగా కేసు దర్యాప్తును ముగించాలన్న ఉద్దేశంతో కక్షపూరితంగా కొందర్ని లక్షంగా చేసుకుని వ్యవహరిస్తోందన్నది తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఉదయ్‌కుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిల అరెస్టుకు గతంలో సీబీఐ బృందం చెప్పిన అహేతుక కారణాలనే కొత్త బృందం కూడా వల్లేవేయడం విస్మయపరుస్తోంది.  

వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు
సీబీఐ ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న మరో అంశం... వివేకానందరెడ్డి రెండో వివాహం...దాంతో ఆ కుటుంబంలో తలెత్తిన తీవ్ర విభేదాలు, ఆస్తి తగాదాలు. వీటిని సీబీఐ నామమాత్రంగానైనా దర్యాప్తు చేయకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందన్నది ప్రశ్నగా మారుతోంది. షమీమ్‌ అనే ముస్లిం మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారని..  వాళ్లిద్దరికీ ఒక కుమారుడు కూడా పుట్టాడని... ఆ కుమారుడికి ఆస్తిలో భాగంతో పాటు తన రాజకీయ వారసుడిగా చేస్తానని ప్రకటించారన్నది ఆ జిల్లాలో అందరికీ తెలిసిందే.

దాంతో వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి ఆయనతో తీవ్రంగా గొడవపడ్డారు. ఆయన్ని వదిలి కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. వివేకా ఒక్కరే పులివెందులలో ఉంటున్నారు. బెంగళూరులో ఓ భూమి సెటిల్‌మెంట్‌ ద్వారా వచ్చే రూ.2 కోట్లను తన రెండో భార్యకు ఇవ్వాలని వివేకా నిర్ణయించారు. దాంతో సునీత ఆయనతో గొడవపెట్టుకున్నారు. అంతేకాక సునీత, ఆమె భర్త నర్రెడ్డి, బావగారు శివ ప్రకాశ్‌రెడ్డి షమీమ్‌ ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగారు. వివేకాను విడిచిపెట్టకపోతే ఆమె కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. వివేకానందరెడ్డి అప్పటికే ఆమెకు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను బలవంతంగా తీసుకున్నారు. షమీమ్, వైఎస్‌ సునీత మధ్య వాట్సాప్‌లో వాదోపవాదాలు సాగాయి. ఒకర్ని ఒకరు దూషించుకున్న వాట్సాప్‌ మెస్సేజులను కూడా గతంలో సిట్‌ అధికారులు గుర్తించారు.

షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని... ఆమె కుమారుడికి హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చదివించాలని అనుకుంటున్నా... అవ్వడం లేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఈ వారసత్వ, ఆస్తి గొడవలే వివేకా హత్యకు ప్రధాన కారణమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వివేకానందరెడ్డి లేకపోతే ఆయన కుమార్తె, అల్లుడు, పెద్ద బామమరిదికే ఎక్కువ ప్రయోజనం. కానీ సీబీఐ మాత్రం ఈ కీలకాంశాలన్నిటినీ విస్మరిస్తూ ఏకపక్షంగా కక్షపూరితంగా దర్యాప్తు చేస్తోందనే విమర్శలున్నాయి. 

ఆనాడు చంద్రబాబు  రాజీనామా చేశారా...!
భాస్కర్‌రెడ్డి అరెస్టుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్‌ చేస్తుండటం విడ్డూరంగా ఉంది. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వైఎస్‌ వివేకా హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుక అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉందని సునీత అప్పట్లోనే ఆరోపించారు. మరి ఆ రోజు చంద్రబాబు తన పదవికి రాజీనామా చేశారా...! వైఎస్‌ వివేకా హత్యపై మొదటిసారి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేసింది

చంద్రబాబు ప్రభుత్వమే. మూడు నెలలు టీడీపీ అధికారంలో ఉంది. మరి ఆ 3 నెలల్లో వైఎస్‌ వివేకా హత్య వెనుక భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌ రెడ్డి ప్రమేయం ఉందని సిట్‌ ఎందుకు ఆధారాలు చూపించలేకపోయింది?. వైఎస్‌ కుటుంబంలోని వారి పాత్ర ఉందంటే చంద్రబాబు ఆ కేసును తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని ఉండేవారు కదా. మరి ఆనాడు సిట్‌ పోలీసులతోపాటు టీడీపీ నేతలు కూడా వైఎస్‌ వివేకా హత్య వెనుక భాస్కర్‌రెడ్డి కుట్ర ఉందని చెప్పనే లేదు కదా. అంటే ఆ హత్య వెనుక వారి ప్రమేయం లేనట్టే కదా.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఏనాడూ సిట్‌ దర్యాప్తును ప్రభావితం చేయలేదు. సీబీఐ దర్యాప్తునకు కూడా హైకోర్టు సాక్షిగా సమ్మతించారు. విచారణను తెలంగాణకు మారుస్తామన్నా కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తమ సమ్మతిని తెలిపింది తప్ప వ్యతిరేకించ లేదు కదా?. ఇది చాలదూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వ్యవస్థలను ఎంత గౌరవిస్తోందో చెప్పటానికి?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement