రైల్వే, ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళిక | Artificial intelligence for accident prevention | Sakshi
Sakshi News home page

రైల్వే, ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళిక

Mar 28 2026 2:30 AM | Updated on Mar 28 2026 2:30 AM

Artificial intelligence for accident prevention

ప్రమాదాల నివారణకు కృత్రిమ మేధ    

ట్రాక్‌లపై లోపాలు గుర్తింపు

బోగీలు పట్టాలు తప్పకముందే అప్రమత్తత   

జాతీయ రహదారులపై గుంతలు, పగుళ్ల ట్రేస్‌

సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాల నివారణకు కేంద్ర రైల్వేశాఖ, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) శాఖ­లు ప్రత్యేక కార్యాచరణకు సన్నద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌­(ఏఐ) పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ కార్యాచరణను రూపొందించాయి. 

రైల్వే ట్రాక్‌లపై లోపాలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించగా... జాతీయ రహదారులపై 30 రకాల లోపాలను గుర్తించి సరిచేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) సన్నద్ధమవుతోంది. ఆ మేరకు ఆ రెండు శాఖల కార్యాచరణ ఇలా ఉంది.. 

పట్టాలు తప్పకముందే అప్రమత్తం చేసే సీబీఎం 
రైలు బోగీలు పట్టాలు తప్పకుండా ముందుగానే గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు కేంద్ర రైల్వే శాఖ ఏఐ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.  ‘కండీషన్‌ బేస్డ్‌ మానిటరింగ్‌(సీబీఎం) సిస్టం’ పేరుతో ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది.  దక్షిణ కొరియాకు చెందిన గ్లోబిజ్‌ ఈ ఏఐ పరిజ్ఞానాన్ని రూపొందించింది.  ముందుగా హైస్పీడ్‌ రైళ్లలో ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అనంతరం దశల వారీగా ఇతర రైళ్లలో కూడా ప్రవేశపెట్టనుంది. ఏఐ ఆధారిత సెన్సార్లను రైళ్లలో ఏర్పాటు చేస్తారు. 

రైలు చక్రాలు, బోగీలు, తలుపులు, ఎలెక్ట్రికల్‌ సిస్టంలలో ఏర్పాటు చేస్తారు. రైలు ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే వైబ్రేషన్లు, రైలు మెకానికల్‌ బిహేవియర్‌ను ఈ సెన్సార్లు రికార్డు చేస్తాయి. రైలులోనే పొందుపరిచే ఎడ్జ్‌ సర్వర్లు వాటిని వెనువెంటనే విశ్లేషిస్తాయి. రైలు పట్టాలపై ఎక్కడైనా లోపాలు ఉంటే రైలు వైబ్రేషన్లు, మెకానికల్‌ బిహేవియర్‌లో వ్యత్యాసం తెలుస్తుంది. అంటే కొంత దూరంలో ఎక్కడో ట్రాక్‌పై లోపాలు ఉన్నాయని గుర్తించి అప్రమత్తం చేస్తుంది. దాంతో వెంటనే లోకో పైలట్‌ ట్రైన్‌ వేగాన్ని తగ్గించడంతోపాటు అవసరమైతే నిలిపివేస్తారు. 

అనంతరం రైల్వే సాంకేతిక బృందాలు ట్రాక్‌ వెంబడి పరిశీలించి లోపాలను సరిచేస్తాయి. తద్వారా ముందుగానే అప్రమత్తమై రైలు పట్టాలు తప్పడం వంటి ప్రమాదాలను నివారించవచ్చు. అందుకోసం రూపొందించిన సీబీఎం విధానాన్ని దేశంలో అన్ని రైళ్లలో  దశల వారీగా ప్రవేశపెట్టాలన్నదే లక్ష్యమని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి.

జాతీయ రహదారులపై డాష్‌కామ్‌ చెక్‌
జాతీయ రహదారులపై గుంతలతోపాటు ఇతర లోపాలు గుర్తించేందుకు ‘డాష్‌కామ్‌ అనలిటిక్స్‌ సర్విసెస్‌’ పేరిట ఎన్‌హెచ్‌ఏఐ సరికొత్త కార్యాచరణను చేపట్టింది. అందుకోసం అత్యధిక రిజల్యూషన్‌ ఉన్న స్మార్ట్‌ కెమెరా  సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. జాతీయ రహదారులపై రూట్‌ పెట్రోలింగ్‌ వాహనాలు(ఆర్‌పీవీ)లకు ఈ స్మార్ట్‌ కెమెరాలను అమరుస్తారు. పెట్రోలింగ్‌ చేస్తుంటే ఆటోమేటిగ్గా రహదారులను స్కాన్‌ చేస్తూ ఫొటోలు తీస్తాయి. 

30 రకాల అంశాలను ఈ ఫొటోల ద్వారా గుర్తించవచ్చు. రహదారులపై చిన్న పగుళ్లు, గుంతలు, బారియర్లు లేకపోవడం, రాంగ్‌రూట్లో వాహనదారులు రోడ్లపైకి వచ్చేందుకు రోడ్లను కట్‌ చేయడం వంటివాటి ఫొటోలు నేరుగా ‘సెంట్రల్‌ డేటా లేక్‌’పేరుతో ఏర్పాటు చేసే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరుతాయి. ఆ ఫొటోల ద్వారా గుర్తించిన లోపాలను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సరిదిద్దుతారు. 

జీపీఎస్‌ విధానం ద్వారా లోపాలు ఉన్న ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించి మరమ్మతులు చేపడతారు. ఎన్‌హెచ్‌ఏఐ దేశంలో 40వేల కి.మీ. జాతీయ రహదారులను ఐదు జోన్లుగా విభజించి డ్యాష్‌కామ్‌  సిస్టం పరిధిలోకి తీసుకురానుంది. తద్వారా జాతీయ రహదారులపై ప్రమాదాలను తగ్గించాలన్నది ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యం.

Advertisement
 
Advertisement
Advertisement