కృత్రిమ మేధ.. లేదిక ‘కోతల’ బాధ!  | Artificial intelligence is giving good results in power sector | Sakshi
Sakshi News home page

కృత్రిమ మేధ.. లేదిక ‘కోతల’ బాధ! 

Published Tue, Mar 30 2021 5:11 AM | Last Updated on Tue, Mar 30 2021 5:11 AM

Artificial intelligence is giving good results in power sector - Sakshi

సాక్షి, అమరావతి:  విద్యుత్‌ శాఖ అందుబాటులోకి తెచ్చిన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)వ్యవస్థ వేసవి వేళ సత్ఫలితాలిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను ఇట్టే పసిగట్టడమే కాకుండా తక్షణమే అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వీలు కల్పిస్తోంది. ఇంటర్నెట్‌ ద్వారా అనుసంధానమైన ఈ వ్యవస్థ వల్ల వినియోగం అమాంతం పెరిగినా.. విద్యుత్‌ కోతలు లేకుండా చేయగలుగుతున్నామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ లోడ్, లోడ్‌ను బట్టి విద్యుత్‌ వినియోగం, ఏయే ప్రాంతాల్లో ఎంత వాడకం ఉంటుందనే అనేక అంశాలను ఎప్పటికప్పుడు గుర్తించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను విద్యుత్‌ శాఖ రూపొందించింది. పదేళ్ల విద్యుత్‌ డేటాను నెట్‌కు అనుసంధానించింది. ఫలితంగా ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా విద్యుత్‌ డిమాండ్‌ను ముందే అంచనా వేయగలుగుతున్నారు. అప్పటికప్పుడు అవసరమైన విద్యుత్‌ను మార్కెట్‌ నుంచి కొనుగోలు చేయడం సాధ్యమవుతోంది.  

లెక్క పక్కా: రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ ఈ నెల 27న 220.6 మిలియన్‌ యూనిట్లుగా రికార్డయింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అందించిన సమాచారం మేరకు మరో వారం రోజుల్లో ఇది రోజుకు 222 మిలియన్‌ యూనిట్లకు చేరొచ్చని భావిస్తున్నారు. ఉష్ణోగ్రతలు, వ్యవసాయ విద్యుత్‌ వినియోగాన్ని ఆధారంగా చేసుకుని ఈ తరహా అంచనాకు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. 2018లో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 185 మిలియన్‌ యూనిట్లు ఉండగా, 2020–21 నాటికి  218 మిలియన్‌ యూనిట్లకు చేరింది. గరిష్ట (పీక్‌) విద్యుత్‌ వినియోగం మార్చి 27, 2021 నాటికి 220.6 మిలియన్‌ యూనిట్లు. విద్యుత్‌ డిమాండ్‌ 11,193 మెగావాట్లకు చేరినట్టు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పక్కా లెక్క అందించింది. 

డిమాండ్‌ ఎంత పెరిగినా.. ‘కోత’లొద్దు 
తాజా పరిస్థితిపై విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. విద్యుత్‌ డిమాండ్‌ ఎంత పెరిగినా కోతలు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏపీ జెన్‌కో ద్వారా రోజుకు 100 మిలియన్‌ యూనిట్లు,  కేంద్ర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి 40–45 మిలియన్‌ యూనిట్లు, పునరుత్పాదక విద్యుత్‌ (విండ్, సోలార్‌) నుంచి 30–35 మిలియన్‌ యూనిట్లు, ఇతర వనరుల నుంచి మరో 10 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందుబాటులో ఉందని అధికారులు మంత్రికి తెలిపారు. ఈ పరిస్థితుల్లో 35–45 మిలియన్‌ యూనిట్లను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. మే నెలాఖరు వరకూ ఇదే పరిస్థితి ఉండొచ్చని వివరించారు. ఏప్రిల్‌ రెండో వారానికి రబీ సీజన్‌ ముగుస్తుందని, అయితే, గృహ విద్యుత్‌ వాడకం పెరుగుతుందని మంత్రికి నివేదించారు. ఈ వివరాలను విద్యుత్‌ శాఖ సోమవారం వెల్లడించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement