సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.
రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. ముడిచమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడంతోపాటు హరిత ఇంధన వినియోగం పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా 2025–26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్‌లో 20 శాతం బయో ఇథనాల్ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రస్తుతం లీటరు పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం సగటున 8.41 శాతంగా ఉంది. కోటిలీటర్ల ఇథనాల్‌ను వినియోగించడం ద్వారా 20 వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతున్నట్లు అనేక పరిశీలనల్లో వెల్లడైంది. ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించడంతో అనేక సంస్థలు ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి.
భూ కేటాయింపుల దగ్గర నుంచి అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ చూపిందని, ఈ పెట్టుబడుల ద్వారా హరిత పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని అస్సాగో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశీష్ గుర్నానీ తెలిపారు. భవిష్యత్‌లో ప్రత్యామ్నాయ ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ యూనిట్ ద్వారా 500 మందికి ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ప్రయోజనం లభిస్తుందని చెప్పారు. పాడైపోయిన ఆహారధాన్యాలు, నూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగించి ఇథనాల్‌ను తయారు చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు.
సీఎం జగన్ పర్యటన ఇలా..
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. 10.30 గంటలకు గుమ్మళ్ళదొడ్డి చేరుకుంటారు. 10.45 గంటల నుంచి 11.40 గంటల వరకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుగుప్రయాణం అవుతారు.
బయో ఇథనాల్‌లో రూ.2,017 కోట్ల పెట్టుబడులు
రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి.అస్సాగోతో పాటు క్రిభ్‌కో, ఇండియన్ ఆ యిల్ కార్పొరేషన్, ఎకో స్టీల్, సెంటిని, డాల్వకో ట్, ఈఐడీ ప్యారీ వంటి సంస్థలు కలిపి సుమారు రూ.2,017 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి.
హరిత ఇంధనానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా బయో ఇథనాల్ పాలసీని రూపొందిస్తోంది. ఇప్పటికే ముసాయిదా పాలసీ తయారుచేసిన రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్య కంపెనీల సూచనలు, సలహాలు తీసుకుని త్వరలోనే పాలసీని విడుదల చేయనుంది. దీనిద్వారా బయో ఇథనాల్ తయారీలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తుందన్న ఆశాభావం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment