
నిడదవోలు: ఆయన ఆటో డ్రైవర్.. ఇప్పుడు నిడదవోలు పురపాలక సంఘం రెండో వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆటోడ్రైవర్ యలగాడ బాలరాజును వైస్ చైర్మన్‌గా ఎంపికచేయడంపై అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పురపాలక సంఘాల్లో ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్మన్లు ఉండాలనే నూతన ఒరవడికి సీఎం జగన్ శ్రీకారం చుట్టడంతో నిడదవోలు పట్టణంలో బాలరాజును పదవి వరించింది. యలగాడ వెంకన్న, రాములమ్మ ఆరుగురు సంతానంలో మూడో కుమారుడు బాలరాజు.
చిన్నతనం కష్టాలు ఎదుర్కొంటూ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. చిన్నతనంలో సైకిల్ మెకానిక్‌గా పని చేసి కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఆ తర్వాత సొంతంగా ఆటో కొనుక్కొని డ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆపదలో తోటివారికి సాయం చేస్తూ అందరి మన్ననలు పొందేవారు. 2008 నుంచి 2014 వరకు హరిజన యువజన సేవా సంఘం అధ్యక్షుడిగా.. 2015లో మదర్ థెరిస్సా ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. మొదట కాంగ్రెస్ పార్టీలో తిరిగిన అతను 2014లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌గా పోటీ చేసి 350 ఓట్లతో గెలుపొందారు. అప్పటి నుంచి వార్డులో ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ముందుండేవారు. ఆటో నడుపుతూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూనే మరోపక్క ప్రజాప్రతినిధినిగా తన బాధ్యతల్ని సమర్ధవంతంగా పోషించారు. బాలరాజు పార్టీకి చేస్తున్న సేవలు గుర్తించి రెండోసారి కౌన్సిలర్ సీటు ఇచ్చారు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో 13 వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి 385 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.