
తాడికొండ: ఓట్ల కోసం తోక పార్టీలతో కలిసి కులవాదులు డ్రామాలాడుతున్నారని బహుజన పరిరక్షణ సమితి నేతలు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 832వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో శనివారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. పేదలకు ఇంగ్లిషు మీడియం విద్య అందకుండా కోర్టుల్లో కేసులు వేయడంతో పాటు, వికేంద్రీకరణ జరగనీయకుండా అడ్డుకుంటున్న చంద్రబాబును జనం తరిమికొట్టడం ఖాయమన్నారు. మామ దగ్గర సైకిల్‌ను దొంగిలించి.. సైకో రాజకీయాలు చేస్తూ జనంలో తిరుగుతున్న సిసలైన సైకో చంద్రబాబేనని ధ్వజమెత్తారు.
కందుకూరు, గుంటూరు ఘటనల్లో ప్రజలు చనిపోతే కనీసం చలించకుండా ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ కుప్పంలో పర్యటనలు చేయడమంటే ప్రజలను రెచ్చగొట్టడం కాదా.. అని ప్రశ్నించారు. బహుజనులను బలిచేస్తున్న దొంగ సభలను రద్దుచేయకుంటే ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. ప్రచారార్భాటాల కోసం చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అధికారమే పరమావధిగా బాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరనేది గుర్తుంచుకుంటే మంచిదని, ఇకనైనా కళ్లు తెరిచి పేదల పక్షాన నిలువకపోతే ఆయనను ప్రజల్లో తిరగకుండా అడ్డకుంటామని హెచ్చరించారు.
కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నేతలు మాదిగాని గురునాథం, బొలిమేర శామ్యూల్, పెరికే వరప్రసాద్, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం, కారుమూరి పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కందుకూరు, గుంటూరు ఘటనలపై విచారణ కమిషన్
Comments
Please login to add a commentAdd a comment