ఒంగోలు సబర్బన్: నగరంలోని శివారు ప్రాంతాల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలోని మూడో డివిజన్‌లో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బాలినేని నిర్వహించారు. తొలుత డివిజన్ ప్రారంభంలోని బలరాం కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మూడో డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, మధు దంపతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు బాలినేనికి గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం మిలటరీ కాలనీలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని స్థానికులను అడిగి బాలినేని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడో డివిజన్‌లో ఎక్కువ భాగం స్లమ్ ఏరియా ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మూడో డివిజన్లో రోడ్లు వేశామని ప్రగల్భాలు పలికారంటూ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై ధ్వజమెత్తారు.
నగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ, ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. మూడో డివిజన్‌లో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందన్నారు. ఈ డివిజన్‌లో ఎక్కువ అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు. డివిజన్‌లోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. వలంటీర్ల పనితీరు కూడా సంతృప్తికరంగా ఉందన్నారు.
ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మళ్లీ సీఎంగా వైఎస్ జగన్, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని గెలవాలని నినాదాలు చేశారు. మిలటరీ కాలనీలో ఒక మహిళ మంచినీటి ట్యాప్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇవ్వలేదని బాలినేని దృష్టికి తీసుకురాగా, ఎంఈ కే మాల్యాద్రిని పిలిచి బాలినేని ప్రశ్నించారు. మూడు రోజుల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తామని ఎంఈ తెలిపారు. ఓ ఇంటి వాకిటికి ఎదురుగా విద్యుత్ స్తంభం ఉండటాన్ని బాలినేని గమనించారు. అక్కడకు వెళ్లినప్పుడు ఆ ఇంటి మహిళ కూడా విద్యుత్ స్తంభం సమస్యను బాలినేని దృష్టికి తీసుకురావడంతో విద్యుత్ ఏఈని పిలిపించిన బాలినేని.. ఆ స్తంభాన్ని పక్కకు మార్చాలని, వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
కాలువల నిర్మాణానికి శంకుస్థాపన...
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మిలటరీ కాలనీలో కాలువ నిర్మాణానికి బాలినేని శంకుస్థాపన చేశారు. టెంకాయలు కొట్టి భూమి పూజ చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మిలటరీ కాలనీ, మసీదు కాలనీ, బాలినేని భరత్ కాలనీల్లో కాలువల నిర్మాణానికి ఇప్పటికే రూ.30 లక్షలు మంజూరు చేశామని, తొలుత మిలటరీ కాలనీలో కాలువ పనులు ప్రారంభించామని బాలినేని తెలిపారు.
కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షుడు ఎస్‌కే జాఫర్, కార్పొరేటర్లు ఎందేటి పద్మావతి రంగారావు, చల్లా తిరుమల రావు, తాడి కృష్ణలత, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వాకా బసివిరెడ్డి, ఇస్లాంపేట జిలానీ, బేతంశెట్టి శైలజ, యరజర్ల రమేష్, ఊసా మధుబాబు, డివిజన్ నాయకులు సుల్తాన్, రమీజా, కోటయ్య, చిన్నా, పేరిరెడ్డి, రాజేంద్ర, హబీబ్, వెంకట్, సుజాత, డానియేలు, అమర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment