ఉద్యోగులకు మేలు.. సెలవు సిఫారసులు | Benefit to employees Holiday Recommendations | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు మేలు.. సెలవు సిఫారసులు

Published Tue, Dec 14 2021 5:15 AM | Last Updated on Tue, Dec 14 2021 10:56 AM

Benefit to employees Holiday Recommendations - Sakshi

రాష్ట్ర సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ

సాక్షి, అమరావతి: పదకొండో వేతన సంఘం ఉద్యోగుల సెలవులు, వైద్య సౌకర్యాలపై కొన్ని సిఫారసులు చేసింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర రాష్ట్రాల్లో అందిస్తున్న వైద్య సేవలను ఈహెచ్‌ఎస్‌ పథకానికి కూడా వర్తింపజేయాలని సూచించింది. పిల్లలను దత్తత తీసుకున్న వారికి సైతం దత్తత సెలవులు 180 రోజులు ఉండాలని, చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ కూడా ఇదే స్థాయిలో ఉండాలని, ఇది ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా అమలు చేయాలని సిఫారసు చేసింది. అంతేగాక ఈ విభాగంలో పితృత్వ సెలవులను సైతం సూచించింది. వికలాంగ ఉద్యోగులకు సైతం మేలు జరిగేలా మరికొన్ని సిఫారసులను నివేదికలో పొందుపరిచింది. ఈ సూచనలు మహిళా, వికలాంగ ఉద్యోగులకు మేలు చేసేవిగా ఉండడంతో కార్యదర్శుల కమిటీ ఓకే చెప్పింది.  

 లీవ్‌ బెనిఫిట్స్‌:11వ పీఆర్‌సీ సిఫారసు
► బోధన రంగంలో ఉన్న బోధనేతర మహిళా ఉద్యోగులకు సైతం అదనంగా ఐదు సాధారణ సెలవులు ఉండాలి 
► ఇద్దరు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగి ఏడాది లోపు వయసున్న పిల్లలను దత్తత తీసుకుంటే 180 రోజుల దత్తత సెలవులు ఇవ్వాలి, అలాగే ఒంటరి లేదా అవివాహిత పురుష ఉద్యోగులకు సైతం 15 రోజుల పితృత్వ సెలవులు కూడా ఉండాలి 
► చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ 180 రోజులకు పెంచాలి, ఇదే నిబంధన ఒంటరి లేదా అవివాహిత పురుష ఉద్యోగులకు వర్తించాలి 
► కృత్రిమ అవయవాల అవసరం ఉన్న ఆర్థోపెడిక్‌ వికలాంగ ఉద్యోగులకు ఏడాదికి ఏడు ప్రత్యేక సాధారణ సెలవులు. హైరిస్క్‌ వార్డులో పనిచేసే నర్సింగ్‌ ఉద్యోగులకు సైతం ఈ వర్తింపు ఉండాలి కార్యదర్శుల కమిటీ ప్రతిపాదనలు: మహిళలు, వికలాంగుల లీవ్‌ బెనిఫిట్స్‌కు కమిటీ ఆమోదం తెలిపింది 
 
మెడికల్‌ బెనిఫిట్స్‌: పీఆర్‌సీ సిఫారసు  
► ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌లో ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వ సహకారం పెరగాలి, నెట్‌వర్క్‌ ఆస్పత్రుల పెండింగ్‌ బిల్లుల చెల్లింపులకు ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు ఆదనపు నిధులను విడుదల చేయాలి 
► పెన్షన్‌ తీసుకునేవారు, వారి సహచరుల వార్షిక ఆరోగ్య పరీక్షల స్కీమ్‌ను పెంచాలి 
► డా. వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ ద్వారా వివిధ రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్‌ సేవలు కూడా అందించేందుకు ఆయా ఆస్పత్రులతో చర్చించాలి 
► సర్వీస్‌ పెన్షనర్‌ / ఫ్యామిలీ పెన్షనర్స్‌కు నెలకు రూ.500 మెడికల్‌ భృతి చెల్లించాలి 
కార్యదర్శుల కమిటీ: మెడికల్‌ బెనిఫిట్స్‌ సిఫారసులన్నింటినీ అంగీకరించింది 
 ప్రత్యేక చెల్లింపులు: 11వ పే కమిషన్‌ సిఫారసు 
► ప్రస్తుతమున్న ఉద్యోగుల్లో కొన్ని కేటగిరీలకు ప్రత్యేక చెల్లింపుల క్వాంటం/రేటు పెంపు, కొన్ని వర్గాల ఉద్యోగుల చెల్లింపులను నిలిపి వేయాలి 
కార్యదర్శుల కమిటీ సిఫారసు: ఉద్యోగులకు ప్రత్యేక వేతనాల మంజూరును సమీక్షించడానికి సీనియర్‌ సెక్రటరీలు, హెచ్‌ఆర్‌ నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు కట్టుబడి ఉంది. నిర్దిష్టమైన ప్రత్యేక వేతనాల రేట్ల పెంపునకు సిఫార్సు, ప్రత్యేక చెల్లింపుల సమస్యను, దీనిపై ప్రస్తుత మార్గదర్శకాల పరిశీలనకు అంగీకారం 
 ఇతర భత్యాలు: 
పే కమిషన్‌ సిఫారసులు 
► పెట్రోల్‌ అలవెన్సులను కిలోమీటర్‌కు రూ.15.50కి పెంచాలి. పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలకు కి.మీకి రూ.11.50, డీజిల్‌ వాహనానికి రూ.6.50 ఇవ్వాలి 
► రోజువారీ భత్యం, వసతి చార్జీలు 33 శాతం పెంపు. రాష్ట్రం లోపల పర్యటనలకు రోజుకు రూ. 300 నుంచి రూ. 600 వరకు, రాష్ట్రం వెలుపల పర్యటనలకు రూ.400 నుంచి రూ.800కు పెంచవచ్చు. రాష్ట్రం వెలుపల బస చేసినప్పుడు రోజువారీ లాడ్జింగ్‌ భత్యం రూ.1,700 చెల్లించాలి 
► కోర్టు మాస్టర్స్, హైకోర్టు న్యాయమూర్తుల వ్యక్తిగత కార్యదర్శుల రవాణా చార్జీలు రూ.5 వేలకు పెంచాలి, ప్రయాణ భత్యాన్ని నెలకు రూ.1,700 కు పెంచాలి 
► పిల్లల ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఏడాదికి రూ.2,500 పెంచాలి 
► మరణించిన ఉద్యోగి అంత్యక్రియల చార్జీలను రూ.20 వేలకు పెంచాలి 
► గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి నెలకు చెల్లించే ప్రత్యేక పరిహార భత్యాన్ని ప్రస్తుతమున్న రూ.500 నుంచి రూ.1,275కు,  రూ.700 నుంచి రూ.1800కు పెంచాలి 
► యూనిఫారం అలవెన్సులు, రిస్క్‌ అలవెన్సులు గణనీయంగా పెంచాలి 
► మెడికల్‌ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు ఎమర్జెన్సీ హెల్త్‌ అలవెన్సు, రూరల్‌ మెడికల్‌ అలవెన్సులు, పీజీ డిగ్రీ అలవెన్సులు పెంచాలి 
► విజువల్లీ చాలెంజ్డ్‌ ఉపాధ్యాయులు, లెక్చరర్ల రీడర్స్‌ అలవెన్సును 33 శాతం పెంచాలి 
► ఏపీ భవన్‌లో పనిచేసే వారికి ఢిల్లీ అలవెన్సు కింద బేసిక్‌ పేలో 15 శాతం లేదా నెలకు రూ.5 వేలు చెల్లించాలి. ఏపీ భవన్‌లో పనిచేసే డ్రైవర్లకు స్పెషల్‌ అలవెన్సు కింద గంటకు రూ.30 చొప్పున గరిష్టంగా నెలకు 100 గంటలకు చెల్లించాలి 
► ఫిజికల్లీ చాలెంజ్డ్‌ ఉద్యోగుల కన్వీనియన్స్‌ చెల్లింపుల కింద వారి బేసిక్‌ పేలో 10 శాతం పెంచాలి. ఇది రూ.2 వేలకు మించరాదు 
కార్యదర్శుల కమిటీ: పే కమిషన్‌ సిఫారసులు పూర్తిగా మహిళలు, వికలాంగ ఉద్యోగులకు మేలు జరిగేదిగా ఉంది కాబట్టి ఈ సిఫారసులను ఆమోదించవచ్చు  

సీఎం జగన్‌కి పీఆర్‌సీ నివేదిక అందజేసిన సీఎస్‌
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి 11వ వేతన సవరణ కమిషన్‌ (పీఆర్‌సీ) నివేదికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement