సాక్షి, అమరావతి: బీసీలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలతో వారికి అత్యధికంగా ప్రయోజనం చేకూర్చి ముఖ్యమంత్రి జగన్ బడుగుల బంధువుగా నిలిచారు. నాలుగున్నరేళ్లలో బలహీన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా నవరత్నాల ద్వారా బీసీ లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేశారు. జనాభాలో అత్యధిక శాతం బీసీలే ఉన్నా గత ప్రభుత్వాలు ఆ మేరకు లబ్ధి చేకూర్చలేదు. దీన్ని సరిదిద్దుతూ ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేశారు. నవరత్నాల లబ్ధిదారుల్లో బీసీలే అత్యధికంగా ఉండటం దీనికి నిదర్శనం.
సింహభాగం లబ్ధి
బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు... బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ అంటూ పాద యాత్రతో పాటు ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సులో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్ తు.చ. తప్పకుండా దీన్ని ఆచరించారు. బీసీలకు అన్ని రంగాల్లో తగిన వాటా కల్పించారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.1.65 లక్షల కోట్ల మేర బీసీలకు ప్రయోజనం చేకూర్చారు. నేరుగా నగదు బదిలీ ద్వారా 4.07 కోట్ల ప్రయోజనాల కింద రూ.1.15 లక్షల కోట్లు బీసీల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
నగదేతర బదిలీ ద్వారా 1.23 కోట్ల ప్రయోజనాలతో రూ.50,321.88 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీలే ఉండటం విశేషం. ఇందులో 10.35 లక్షల మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా ఇప్పటికే రూ.5,972.50 కోట్లు బిల్లుల రూపంలో నేరుగా చెల్లింపులు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద 25.64 లక్షల మంది బీసీ రైతులకు రూ.15,000 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 30.36 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేతి వృత్తిదారులైన బీసీ వర్గాలకు రూ.39,845 కోట్లు సాయం అందించారు.
ప్రతి అడుగులో..
ఇన్నాళ్లకు బీసీలకు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో మెజార్టీ వాటా లభించింది. ఏ పథకాన్ని తెచ్చినా, ఏ నియామకాలు చేపట్టినా వారికే గరిష్టంగా మేలు జరిగేలా చర్యలు తీసుకుంది. రాజ్యాధికారంలోనూ వారికి సీఎం జగన్ పెద్ద పీట వేశారు. మంత్రివర్గంలోనే కాకుండా బీసీల్లోని వివిధ వర్గాలకు జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు.
గత ప్రభుత్వంలో బీసీలకు సబ్సిడీ పథకాలపై బ్యాంకు రుణాలు మాత్రమే అందేవి. అదికూడా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తేనే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా నవరత్నాల ద్వారా బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ఆర్ధిక, సామాజిక ప్రయోజనాన్ని చేకూర్చింది.
రాజకీయ సిఫార్సులతో పని లేకుండా వైఎస్సార్ నవశకం ద్వారా నవరత్నాల అర్హులను ప్రభుత్వం గుర్తించింది. అర్హత ఉండి కూడా ఎవరికైనా పొరపాటున లబ్ధి చేకూరకుంటే వారికి ఏడాదిలో రెండు సార్లు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి మరీ పథకాల ప్రయోజనాలను అందిస్తున్నారు.
సామాజిక మహా విప్లవానికి నాంది
దశాబ్దాలుగా వెనుకబడిన వర్గాలుగా మిగిలిపోయిన వారిని వెన్నుముక వర్గాలుగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది. సామాజిక మహా విప్లవానికి నాంది పలికారు. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక చరిత్ర. బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నారు.
నవరత్నాలతో పారదర్శకంగా మేలు చేస్తున్నారు. ఏటా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి పక్కాగా అమలు చేస్తున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని ఉద్యమాలు జరిగినా కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. సీఎం జగన్ బీసీల న్యాయమైన కోర్కెను తీర్చేందుకు సంకల్పించడం శుభ పరిణామం.
–మోర్ల మహీంధర్, వర్కింగ్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ప్రైవేట్ బిల్లు ఘనత వైఎస్సార్‌సీపీదే..
అట్టడుగు వర్గాలను ఆదుకుంటూ బడుగులకు అన్ని విధాలుగా గొడుగై నిలిచి సీఎం జగన్ కొత్త ఒరవడి సృష్టించారు. అంబేడ్కర్ ఆలోచనలు, జ్యోతిబా పూలే ఆశయాలను ఆచరించి చూపిస్తున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. దేశంలో బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో సైతం బలహీన వర్గాలకు జరగనంత మేలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది.
రాజకీయంగా, సామాజికంగానూ బీసీలకు సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్‌సీపీకే దక్కుతుంది. కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖతోపాటు నిధుల కేటాయింపుపై సీఎం జగన్ పార్టీ ఎంపీల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవటాన్ని స్వాగతిస్తున్నాం. – చింతపల్లి గురుప్రసాద్, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల సమాఖ్య
Comments
Please login to add a commentAdd a comment