గుండెలో 4 బ్లాక్‌లు.. బైపాస్‌కు మాత్రం భయపడలేదు | navratna beneficiaries navaratnalu schemes: andhra pradesh | Sakshi
Sakshi News home page

గుండెలో 4 బ్లాక్‌లు.. బైపాస్‌కు మాత్రం భయపడలేదు

Published Mon, Nov 27 2023 4:21 AM | Last Updated on Fri, Dec 15 2023 1:01 PM

navratna beneficiaries navaratnalu schemes: andhra pradesh - Sakshi

ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 2019లో ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోను.. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే మనసా వాచా ఆచరణలోకి తీసుకురావటం మొదలుపెట్టారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆడిన మాట తప్పలేదు. ఆరంభించిన ఏ పథకాన్నీ ఆపలేదు. ఫలితంగా రాష్ట్రంలో కోట్లాది మందికి నవరత్న పథకాలు అండగా నిలిచాయి. చిన్నారులు మొదలు పండు ముదుసలి వరకు అందరూ ఆనందంగా జీవించేలా వనరులు సమకూరుతున్నాయి.

కనీస అవసరాలైన కూడు, గూడు, ఆరోగ్యానికి ఢోకా లేదనే విషయం ఊరూరా కళ్లకు కడుతోంది. పేదల జీవితకాల కల అయిన ‘సొంతిల్లు’ సాకారం కావడంతో కొత్తగా ఊళ్లకు ఊళ్లే వెలుస్తుండటం కనిపిస్తోంది. అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలబడేలా చేయూత, ఆసరా అండగా నిలుస్తోంది. పేదింటి పిల్లలకు పెద్ద చదువులు.. విదేశీ విశ్వవిద్యాలయాల్లో సైతం చదివేందుకు రాచబాట సిద్ధమైపోయింది. అన్నదాతకు వ్యవసాయం పండుగగా మారింది. వెరసి నవరత్నాల వెలుగులు ప్రతి ఊళ్లోనూ ప్రసరిస్తున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ తపన, తాపత్రయం, ఆకాంక్ష ఫలించిన తీరు లబ్ధిదారుల మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.

ఆ సంజీవని నా ప్రాణం నిలిపింది 
మాది కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామం. నాకు తరచుగా ఛాతీ నొప్పి వచ్చేది. మెడికల్‌ దుకాణంలో బాధను చెబితే ఏదో మాత్ర ఇచ్చేవారు. దాన్ని వేసుకొని కూలీ పనులకు వెళ్లిపోయేవాడిని. ఆ మాత్ర వేసుకుంటే నొప్పి తగ్గేది. మళ్లీ రెండు, మూడు రోజులు తర్వాత అదే బాధ. ఓ రోజు ఛాతీ నొప్పి తీవ్రంగా రావడంతో ఆసుపత్రికి వెళ్లాను. గుండెకు సంబంధించిన పరీక్షలు చేశారు. వెంటనే బైపాస్‌ సర్జరీ చేయాలన్నారు.  రోజువారీ కూలీకి వెళితే గానీ పూట గడవని పరిస్థితుల్లో ఉన్న మా కుటుంబాన్ని ఆ పిడుగులాంటి వార్త కంగారు పెట్టింది. ఆరోగ్య శ్రీతో ఆపరేషన్‌ ఉచితంగా అయి­పోతుందని చెప్పారు.

అన్నట్లుగానే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ అనే సంజీవని నా ప్రాణాన్ని నిలబెట్టింది. కాకినాడలోని సూర్య గ్లోబల్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్‌ అండ్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఈ నెల 4వ తేదీన గుండె శస్త్ర చికిత్స చేశారు. ఇందుకు అయిన ఖర్చు రూ.లక్షకు పైగా అంతా ప్రభుత్వమే చెల్లించింది. అనంతరం వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా రూ.9,500 నా అకౌంట్‌లో జమ అయింది. డిశ్చార్జ్‌ అనంతరం పనులు చేయలేక ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కుటుంబ సభ్యులకు ఆర్థిక భారం కాకుండా కూడా సాయం చేయ­డం అన్నది గొప్ప విషయం. ఇలా సాయం చే­యాలనే ఆలోచన ఎంత మంది నాయకులకు వస్తుంది? ఇప్పటి వరకు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే వచ్చింది.  ఇంటికి వచ్చాక స్థానిక వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తుండటం ఆనందం కలిగిస్తోంది.  – రావు వెంకటరమణ, ముక్కొల్లు, కాకినాడ జిల్లా (శరకనం కృష్ణ, విలేకరి, కిర్లంపూడి)

వ్యవసాయం పండుగైంది 
నాకు మా గ్రామంలో మూడెకరాల సొంత పొలం ఉంది. మొక్కజొన్న, కూరగాయల పంటలను సాగు చేస్తున్నాను. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచి్చనప్పటి నుంచి రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నారు. ఇప్పటి వరకు 4 విడతలుగా రూ.54 వేలు ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరింది. ఏటా ప్రభుత్వం సకాలంలో రైతు భరోసా సొమ్మును అందించడం మూలంగా పెట్టుబడి ఖర్చులకు ఆ సొమ్ము ఉపయోగిస్తున్నాం.

ప్రాథమికంగా వ్యవసాయ పనులు ఆరంభంలో విత్తనాలు కొనుగోలు, భూమి దున్నుకోవడానికి ఆ డబ్బు­లు ఉపయోగపడుతున్నాయి. సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లన్నీ మా గ్రామంలోనే రైతు భరోసా కేంద్రంలో అందుబాటులోకి వచ్చాయి. గత టీడీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ ద్వారా ఏ అవసరం వచి్చనా మండల కేంద్రాలకు పరుగు పెట్టాల్సి వచ్చేది.

ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి రైతులు పంట నష్టపోతే ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందన్న నమ్మకం ఏర్పడింది. పంటల బీమాకి రైతు చెల్లించాల్సిన ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించడం హర్షించదగిన విషయం. ఉచితంగా వ్యవ­సాయ విద్యుత్‌ సరఫరాలో ఏవిధమైన ఇబ్బందుల్లేవు. రైతులకు అవసరమైన అన్ని సేవలు గ్రామ స్థాయిలో ఆర్‌బీకేల్లో లభిస్తు­న్నాయి. వ్యవసాయం నిజంగా పండుగైంది. – పెండ్యాల శ్రీనివాసరావు, పంగిడిగూడెం, ఏలూరు జిల్లా  (యండమూరి నాగ వెంకట శ్రీనివాస్, విలేకరి, ద్వారకా తిరుమల)

ఉపాధికి ఊతం 
మాది నిరుపేద కుటుంబం. మా ఆయన తాపీ పని చేస్తుంటాడు. ఒకరోజు పని ఉంటే ఒకరోజు ఉండదు. నేను టైలరింగ్‌ చేస్తూ అరకొరగా వచ్చే ఆదాయయంతో కుటుంబానికి సాయంగా నిలుస్తున్నా. ఇద్దరి సంపాదనతో అతికష్టం మీద కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక మాలాంటి చిన్న చేతివృత్తుల వారికి ఏటా పది వేల రూపాయలు జగనన్న చేదోడు పేరుతో అందిస్తున్నారు. ఆ మొత్తం నా టైలరింగ్‌ వృత్తికి ఎంతగానో ఉపయోగపడుతోంది.

ఈ పథకం ద్వారా ఏటా అందుతున్న నగదుతో టైలరింగ్‌ మెటీరియల్‌ కొనుగోలు చేసి మరింతగా పనిచేసి స్వయం ఉపాధి పొందుతున్నాను. తద్వారా కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నానన్న సంతోషం కలుగుతోంది. ప్రభుత్వం కల్పిస్తున్న అమ్మ ఒడి పథకం సాయంతో రెండో బాబును చదివిస్తున్నాం. పెద్దవాడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇంజినీరింగ్‌ చేస్తున్నాడు. ఇప్పుడు మా కుటుంబానికి ఎలాంటి సమస్యలూ లేవు. ప్రభుత్వ పథకాలు మా లాంటి వారికి ఎంతగానో అండగా నిలుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.  – నేమాని కుమారి, గుంకలాం గ్రామం, విజయనగరం జిల్లా (కందివలస అప్పారావు, విలేకరి, విజయనగరం రూరల్‌) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement