
సాక్షి, అమరావతి: ‘ఎన్నికల నిర్వహణ రాజ్యాంగబద్ధ ప్రక్రియ. అందులో భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరికీ లక్ష్మణ రేఖ ఉంటుంది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారితో సహా ఎవరూ కూడా ఆ రేఖను అతిక్రమించకూడదు. అందరూ తమ పరిధిని గుర్తెరిగి సమన్వయంతో పని చేయాలి’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హితవు చెప్పినట్టు సమాచారం. ‘ఎన్నికల నిర్వహణ అన్నది ఒక్కరితో సాధ్యం కాదని.. యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని విశ్వాసంలోకి తీసుకుని సమన్వయం, సంయమనంతో వ్యవహరించాలి’ అని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర అధికార యంత్రాంగం యావత్తూ సమాయత్తమవుతున్న తరుణంలో పంచాయతీరాజ్ ఉన్నతాధికారులపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మంగళవారం ఏకపక్షంగా చర్యలకు సిఫార్సు చేయడంతో తీవ్ర కలకలం రేగింది.
నిమ్మగడ్డ తన పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా వ్యవహరించారని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు నిబద్ధతతో పని చేస్తున్న ఉన్నతాధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. నిమ్మగడ్డ చర్యలు ఒక చెడు సంప్రదాయానికి తెరతీస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనను కలవాల్సిందిగా గవర్నర్ హరిచందన్.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ను ఆదేశించినట్టు సమాచారం. దాంతో నిమ్మగడ్డ బుధవారం రాజ్‌భవన్‌కు చేరుకుని దాదాపు 40 నిమిషాల పాటు గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న చర్యల గురించి గవర్నర్ ఆరా తీశారు. అనంతరం పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు ఇద్దరిపై ఎందుకు ‘సెన్సూ్యర్’ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని గవర్నర్ ప్రశ్నించినట్టు సమాచారం.
గవర్నర్ హరిచందన్‌తో సమావేశమైన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ
నేరుగా ఎలా చర్యలు తీసుకుంటారు?
► నేరుగా క్రమశిక్షణా చర్యలు చేపట్టే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేదు కదా అని గవర్నర్.. నిమ్మగడ్డకు గుర్తు చేసినట్టు తెలిసింది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుపై తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడాలన్న దృక్పథంతోనే ఉన్నతాధికారులు వ్యవహరించారని, అదేమీ తప్పుకాదని గవర్నర్ చెప్పినట్టు సమాచారం. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉన్నందున ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పంచాయతీ ఎన్నికల వాయిదా కోరాయి తప్ప, ఇతరత్రా కారణాలు లేవు కదా అని అన్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తం వ్యవహారంపై తనకూ సమాచారం ఉందని గవర్నర్ చెప్పడంతో నిమ్మగడ్డ మరేమీ మాట్లాడలేకపోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
► అయ్యిందేదో అయ్యింది.. ఇకనైనా భేషజాలు విడిచిపెట్టి అధికార యంత్రాంగాన్ని కలుపుకుని ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ సున్నితంగా అయినాసరే కచ్చితంగా చెప్పారని అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి.
గవర్నర్ మాటలతో ఒకింత మార్పు!
► గవర్నర్ మాటలు నిమ్మగడ్డ రమేష్‌పై బాగానే ప్రభావం చూపించాయనిపిస్తోంది. ఆయనతో భేటీ అనంతరం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన తీరే ఇందుకు నిదర్శనం. సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ సవాంగ్, పంచాయతీ రాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్‌లతో సహా ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ సందర్భంగా క్షేత్రస్థాయి అధికార యంత్రాంగంతో రోజువారీ సమీక్ష, సమన్వయ బాధ్యతలను పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ నిర్వర్తిస్తారని, ఆయన ఆదేశాలను పాటించాలని నిమ్మగడ్డ.. కలెక్టర్లకు స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
► సరైన సమయంలో గవర్నర్ జోక్యం చేసుకుని నిమ్మగడ్డ రమేష్‌కు తన పరిధి, పరిమితులను గుర్తు చేయడం ప్రభావం చూపింది. రాష్ట్రంలో ఉన్నతాధికారులతోపాటు యావత్ అధికార యంత్రాంగం మనోస్థైర్యం ఇనుమడించిందని అధికార వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.