చికిత్స పొందుతున్న రోగితో మాట్లాడుతున్న గవర్నర్ విశ్వభూషణ్, మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున తదితరులు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఎంతో గొప్పదని.. ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానించారు. ఆదివారం గుంటూరులోని సాయిభాస్కర్ ఆస్పత్రిలో ‘న్యూ రివిజన్ నీ రీప్లేస్‌మెంట్ బ్లాక్’ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఈహెచ్‌ఎస్ లబ్ధిదారులతో సంభాషించారు. అనంతర ఆయన మాట్లాడుతూ.. వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం ధైర్యాన్ని ఇస్తోందన్నారు. రూ.25 లక్షల విలువైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలలో ఉపయోగించే ఇంప్లాంట్‌లను ప్రభుత్వానికి విరాళంగా అందించడమే కాకుండా, ఉన్నతి ఫౌండేషన్ ద్వారా డాక్టర్ నరేంద్రరెడ్డి అందిస్తున్న సేవలను అభినందించారు.
గుంటూరు సర్వజన వైద్యశాలలో డాక్టర్ నరేంద్రరెడ్డి 100 ఉచిత మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ ఆరిఫ్‌హఫీజ్, జేసీ రాజకుమారి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు ఎస్‌ఎం జియావుద్దీన్, హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment