సాక్షి, అమరావతి: ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అంత సులభం కాదని.. రాష్ట్ర బీజేపీని సోము వీర్రాజు మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా బీజేపీ ఎదగాలన్నారు. ‘‘రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రం అడ్డుకోలేదు. రాజధాని అంశంపై కేంద్రం ఏనాడు జోక్యం చేసుకోలేదు. కేంద్రం తన పరిధిలోనే వ్యవహరించిందని’’ రామ్‌మాధవ్ పేర్కొన్నారు. (జగన్ దృఢసంకల్పంతో పనిచేస్తున్నారు)
రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది. ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలన్నారు. ‘‘మోదీ భుజాలపై తుపాకీ పెట్టి యుద్ధం చేయాలని చంద్రబాబు చూశారు. హైదరాబాద్‌లో ఉండి 5 లేదా 10 ఏళ్లలో రాజధాని కట్టుకోమని చెప్పాం. ఆయన హైదరాబాద్‌ను వదిలి ఎందుకు వచ్చారో అందరికీ తెలుసు. చంద్రబాబు హయాంలో అమరావతిలో అవినీతి జరిగిందని’’ రామ్‌మాధవ్ విమర్శించారు.
రాజధాని వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోదు: సోము వీర్రాజు
రాజధాని వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం, పార్టీ వేర్వేరు అని తెలిపారు. రాజధాని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కాంగ్రెస్, సీపీఐ రామకృష్ణ ఎవరు రాసి ఇచ్చిన స్క్రిప్టు చదువుతున్నారో అందరికి తెలిసిందేనన్నారు. అధ్యక్షుడిగా తన మీద మరింత బాధ్యత పెరిగిందన్నారు. పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ వ్యవహారిస్తుందని సోము వీర్రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment