శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న టోల్‌గేట్, డార్మెటరీలు తమ శాఖ పరిధిలోవి అంటున్న అటవీశాఖ
హద్దుల ఏర్పాటు కోసం వాటి సమీపంలో గుంతల తవ్వకాలు
పోలీస్‌స్టేషన్ చేరిన పంచాయితీ
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం, అటవీ శాఖ మధ్య సరిహద్దు చిచ్చు రేగింది. గతేడాది దేవస్థానం వారు ఎక్కడ ఏ పనులు చేపట్టినా అటవీ శాఖ వారు తమ పరిధి అని గొడవ పడుతుండటంతో ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టడానికి ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. అప్పుడు విజయవాడలో జరిగిన సమావేశంలో దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ, దేవదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ, అటవీ శాఖ సీసీఎఫ్ మధుసూదన్‌రెడ్డి తదితరులు సరిహద్దులను నిర్ణయిస్తూ ప్లాన్ రూపొందించారు. అందులో అధికారులందరూ సంతకాలు చేశారు.
శ్రీశైలానికి సంబంధించి 4,900 ఎకరాలు స్థలం ఉందని, అందులో 900 ఎకరాల డ్యామ్ నిర్మాణ సమయంలో మునిగిపోయి ఉందని గుర్తించారు. దీనితో పాటు ఎవరి హద్దులో వారు ఉండాలని, గొడవలకు పోవొద్దని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే అటవీ శాఖలో ఉన్న అధికారులు మరో ప్రాంతానికి బదిలీ కావడంతో కొత్తగా శ్రీశైలానికి బదిలీపై వచ్చిన ఎఫ్‌డీ, డీఎఫ్‌వో స్థానిక రేంజ్ ఆఫీసర్ ఉన్నత అధికారులను తప్పుదారి పట్టించారని ఆరోపణలున్నాయి. దీంతో కొత్తగా వచ్చిన ఎఫ్‌డీ, డీఎఫ్‌వోలు దేవస్థానానికి 100 ఎకరాలు మాత్రమే ఉందన్న కొత్త వాదన తెరపైకి తెచ్చారు. దీంతో దేవస్థానం–అటవీ శాఖ మధ్య విభేదాలు తలెత్తాయి.
కాగా దేవస్థానం పరిధిలో 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న టోల్‌గేట్ అటవీ శాఖ పరిధిలో ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు మధ్యలో గుంతలు తవ్వడం ప్రారంభించారు. అలాగే దేవస్థానం నిర్వహిస్తున్న డార్మెటరీ కూడా అటవీ శాఖ కిందికే వస్తుందని, అక్కడా తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఈవో పెద్దిరాజు, రెవెన్యూ ఏఈవో మల్లికార్జునరెడ్డి, పర్యవేక్షకులు శివప్రసాద్, దేవస్థానం సీఎస్‌వో అయ్యన్న, సంబంధిత సిబ్బందిని పంపించి ఎఫ్‌ఆర్‌వో నరసింహులు చేస్తున్న పనిని తాత్కాలికంగా నిలుపుదల చేయించారు.
శనివారం మధ్యాహ్నం తిరిగి టోల్‌గేట్ దాటాక పిల్లర్ల నిర్మాణానికి అటవీ శాఖ వారు గుంతలు తవ్వుతున్నారు.. అని తెలుసుకుని రెవెన్యూ అధికారులు, సీఎస్‌వో సిబ్బంది అక్కడికి చేరుకుని భక్తులకు ఇబ్బంది కలిగించేలా దేవస్థానం ఆస్తులను ధ్వంసం చేస్తూ గుంతలు తవ్వడంపై అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ నరసింహులును ప్రర్మింస్తూ, స్థానిక సీఐకి సమాచారం అందించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..
ప్రస్తుతం క్షేత్ర పరిధిలో నిర్మించిన డార్మెటరీ, దేవస్థానం టోల్‌గేట్ అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని, అందుకే ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు టోల్‌గేట్, నందీశ్వర డార్మెటరీల వద్ద సరిహద్దు నిర్మాణాల కోసం గుంతలను తవ్వి పిల్లర్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఎఫ్‌ఆర్‌వో నరసింహులు అన్నారు. డీఎఫ్‌వో సూచనల మేరకు నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని, అనంతరం దేవస్థానంపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేస్తామని చెప్పారు.
15 రోజుల్లో నిర్ణయించుకోండి..
సరిహద్దుల సమస్య ప్రభుత్వంలోని దేవదాయ–అటవీ శాఖకు సంబంధించి రెండు ప్రభుత్వ విభాగాలకు సంబంధించింది కాబట్టి 15 రోజుల్లోగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఐ ప్రసాదరావు.. దేవస్థానం సహాయ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ఏఈవోలకు సూచించారు.
దేవస్థానం వారికి నోటీసులు జారీ చేశామని ఎఫ్‌ఆర్‌వో చెబుతుండగా, తమకు నోటీసులు అందలేదని దేవస్థానం అధికారులు సీఐకు తెలిపారు. ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ ఉన్నందున అటు దేవస్థానం, ఇటు అటవీ శాఖ సంయమనం పాటించి ఒక నిర్ణయానికి రావాల్సిందిగా ఇరువర్గాలకు సూచించారు. లేకుంటే దేవస్థానం, అటవీ శాఖ నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment