కృష్ణా బోర్డుకు ఆ అధికారం లేదు | Brijesh Kumar Tribunal Only Settle The Godavari Diversion Water Calculations | Sakshi
Sakshi News home page

కృష్ణా బోర్డుకు ఆ అధికారం లేదు

Published Sat, Aug 28 2021 9:11 AM | Last Updated on Sat, Aug 28 2021 9:11 AM

Brijesh Kumar Tribunal Only Settle The Godavari Diversion Water Calculations - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాకు మళ్లించిన 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో అదనంగా కేటాయించిన 45 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే అధికారం బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ–2)కు మాత్రమే ఉందని న్యాయ, నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఈ నీటిని పంపిణీ చేసే అధికారం కృష్ణా బోర్డు పరిధిలో లేకున్నా తెలంగాణ సర్కార్‌ పదే పదే ఆ అంశాన్ని బోర్డు సమావేశాల్లో అజెండాగా చేర్చుతుండటాన్ని తప్పుపడుతున్నారు.

కృష్ణా బేసిన్‌కు గోదావరి జలాలను మళ్లిస్తే.. ఆ మేరకు కృష్ణా జలాల్లో అదనపు వాటాను కోరే వెసులుబాటును కృష్ణా బేసిన్‌ పరిధిలోని రాష్ట్రాలకు గోదావరి ట్రిబ్యునల్‌ కల్పించింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కార్‌ 211.065 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తోందని.. దీంతో ఆ మేర కృష్ణా జలాల్లో తమకు అదనపు వాటా కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌లో వాదిస్తుండటాన్ని నీటిపారుదలరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు.

1980 జూలై 7న గోదావరి ట్రిబ్యునల్‌ జారీచేసిన తీర్పు ప్రకారం.. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో మహారాష్ట్ర 14, కర్ణాటక 21, సాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 45 టీఎంసీలను అదనంగా వినియోగించుకునే హక్కును కల్పించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సాగర్‌కు ఎగువన కృష్ణా జలాల్లో అదనంగా 45 టీఎంసీలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, తెలంగాణ సర్కార్‌ ఆ 45 టీఎంసీలు తమకే దక్కుతాయని, ఆ మేరకు నీటి కేటాయింపులు చేయాలని కృష్ణా బోర్డును కోరుతోంది.

అదనపు వాటా కోసం ఏపీ పట్టు..
నిజానికి.. కృష్ణా బేసిన్‌లోని హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 6.43, ఎస్సారెస్పీ ద్వారా మున్నేరు, మూసీ సబ్‌ బేసిన్‌లకు 68.40, దేవాదుల ఎత్తిపోతల ద్వారా 24.650, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 83.190, ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా 28.395 వెరసి 211.065 టీఎంసీల గోదావరి జలా లను తెలంగాణ సర్కార్‌ తరలిస్తోంది. గోదావరి ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం.. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు ఏ రాష్ట్రం తరలించినా.. ఆ మేర కృష్ణా జలాల్లో అదనపు వాటాను కోరే వెసులుబాటు బేసిన్‌ పరిధిలోని మిగిలిన రాష్ట్రాల కు ఉంటుంది.

ఈ నిబంధన ప్రకారం.. తెలంగాణ తరలిస్తున్న 211.065 టీఎంసీల గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో తమకు అదనపు వాటా ఇవ్వాలని ఏపీ సర్కార్‌ ముందు నుంచీ కోరుతోంది. ఈ వివాదాన్ని పరిష్కరించాలని కృష్ణాబోర్డు కేంద్ర జల్‌శక్తి శాఖను కోరింది. దీంతో కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశాల మేరకు ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ ఏబీ మొహిలే అధ్యక్షతన కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2017లో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసినప్పటికీ ఇప్పటివరకూ  కేంద్రానికి నివేదిక ఇవ్వలేదు.

తేల్చాల్సింది బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునలే 
కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో అదనంగా కేటాయించిన 45 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే అధికారం బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కే ఉంది. కృష్ణా బోర్డు పరిధిలోకి ఆ అంశం రాదు. తెలంగాణ సర్కార్‌ కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న 211.065 టీఎంసీల గోదావరి జలాలకుగాను కృష్ణా జలాల్లో అదనపు వాటాను ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఈ అంశంపై బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతోంది. తెలంగాణ సర్కార్‌ ఈ అంశాన్ని ప్రస్తావించేం దుకు కృష్ణా బోర్డు అనుమతివ్వకూడదు.
– సి. నారాయణరెడ్డి, ఈఎన్‌సీ, జలవనరుల శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement