godavari river water
-
తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు (ఫొటోలు)
-
కృష్ణా బోర్డుకు ఆ అధికారం లేదు
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాకు మళ్లించిన 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో అదనంగా కేటాయించిన 45 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే అధికారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2)కు మాత్రమే ఉందని న్యాయ, నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఈ నీటిని పంపిణీ చేసే అధికారం కృష్ణా బోర్డు పరిధిలో లేకున్నా తెలంగాణ సర్కార్ పదే పదే ఆ అంశాన్ని బోర్డు సమావేశాల్లో అజెండాగా చేర్చుతుండటాన్ని తప్పుపడుతున్నారు. కృష్ణా బేసిన్‌కు గోదావరి జలాలను మళ్లిస్తే.. ఆ మేరకు కృష్ణా జలాల్లో అదనపు వాటాను కోరే వెసులుబాటును కృష్ణా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలకు గోదావరి ట్రిబ్యునల్ కల్పించింది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ సర్కార్ 211.065 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తోందని.. దీంతో ఆ మేర కృష్ణా జలాల్లో తమకు అదనపు వాటా కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో వాదిస్తుండటాన్ని నీటిపారుదలరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. 1980 జూలై 7న గోదావరి ట్రిబ్యునల్ జారీచేసిన తీర్పు ప్రకారం.. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో మహారాష్ట్ర 14, కర్ణాటక 21, సాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 45 టీఎంసీలను అదనంగా వినియోగించుకునే హక్కును కల్పించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సాగర్‌కు ఎగువన కృష్ణా జలాల్లో అదనంగా 45 టీఎంసీలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, తెలంగాణ సర్కార్ ఆ 45 టీఎంసీలు తమకే దక్కుతాయని, ఆ మేరకు నీటి కేటాయింపులు చేయాలని కృష్ణా బోర్డును కోరుతోంది. అదనపు వాటా కోసం ఏపీ పట్టు.. నిజానికి.. కృష్ణా బేసిన్‌లోని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 6.43, ఎస్సారెస్పీ ద్వారా మున్నేరు, మూసీ సబ్ బేసిన్లకు 68.40, దేవాదుల ఎత్తిపోతల ద్వారా 24.650, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 83.190, ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా 28.395 వెరసి 211.065 టీఎంసీల గోదావరి జలా లను తెలంగాణ సర్కార్ తరలిస్తోంది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం.. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు ఏ రాష్ట్రం తరలించినా.. ఆ మేర కృష్ణా జలాల్లో అదనపు వాటాను కోరే వెసులుబాటు బేసిన్ పరిధిలోని మిగిలిన రాష్ట్రాల కు ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం.. తెలంగాణ తరలిస్తున్న 211.065 టీఎంసీల గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో తమకు అదనపు వాటా ఇవ్వాలని ఏపీ సర్కార్ ముందు నుంచీ కోరుతోంది. ఈ వివాదాన్ని పరిష్కరించాలని కృష్ణాబోర్డు కేంద్ర జల్‌శక్తి శాఖను కోరింది. దీంతో కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశాల మేరకు ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ మొహిలే అధ్యక్షతన కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2017లో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసినప్పటికీ ఇప్పటివరకూ కేంద్రానికి నివేదిక ఇవ్వలేదు. తేల్చాల్సింది బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునలే కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల్లో అదనంగా కేటాయించిన 45 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే అధికారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే ఉంది. కృష్ణా బోర్డు పరిధిలోకి ఆ అంశం రాదు. తెలంగాణ సర్కార్ కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న 211.065 టీఎంసీల గోదావరి జలాలకుగాను కృష్ణా జలాల్లో అదనపు వాటాను ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఈ అంశంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతోంది. తెలంగాణ సర్కార్ ఈ అంశాన్ని ప్రస్తావించేం దుకు కృష్ణా బోర్డు అనుమతివ్వకూడదు. – సి. నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ -
ఎక్కడికక్కడే నీటి నిల్వ
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా బేసిన్ పరిధిలోని నదీ జలాలతోపాటు పరీవాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలతో లభించే ప్రతి నీటిచుక్కనూ ఒడిసిపట్టేలా ప్రభుత్వం పక్కా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా గరిష్ట స్థాయిలో కృష్ణా, గోదావరి నీటిని మళ్లిస్తున్న ప్రభుత్వం... వాటి నిర్మాణాలకు సమాంతరంగా రాష్ట్ర పరిధిలో కురిసే ప్రతి నీటి బొట్టునూ ఎక్కడికక్కడ కట్టడి చేసేలా భారీగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని నిర్ణయించింది. మహారాష్ట్ర మాదిరి చెక్‌డ్యామ్‌లు, తూముల నిర్మాణంతో నీటిని చెరువులకు మళ్లించడం ద్వారా నీటి నిల్వలను పెంచి గరిష్ట ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాగులకు అడ్డుకట్ట.. కృష్ణా బేసిన్లో తెలంగాణకు 299 టీఎంసీలు, గోదావరిలో 954 టీఎంసీల నీటి కేటాయింపులుండగా ఇందులో చిన్న నీటివనరుల కింద కృష్ణాలో 89 టీఎంసీలు, గోదావరిలో 165 టీఎంసీల మేర కేటాయింపులున్నాయి. కృష్ణా బేసిన్లో ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితే కానీ దిగువకు ప్రవాహాలులేని కారణంగా దిగువన తెలంగాణలో వాటా మేర నీటి వినియోగం జరగడం లేదు. దీనికితోడు కృష్ణానీటి కట్టడికి మహారాష్ట్ర ఏకంగా వందల సంఖ్యలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయడంతో దిగువకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఏటా కృష్ణా బేసిన్లో చిన్న నీటివనరుల కింద వినియోగం 40 టీఎంసీలు దాటడం లేదు. గోదావరిలోనూ 165 టీఎంసీల మేర కేటాయింపులున్నా అనుకున్న మేర నీరు చేరడం లేదు. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ధ్వంసం కావడంతో అనుకున్న మేర అవి నిండటం లేదు. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టిన ప్రభుత్వం... ఇప్పుడు వాటిని నీటితో కళకళలాడించే పనిలో పడింది. ఇందులో భాగంగా గోదావరి బేసిన్లో ప్రధాన నదీ ప్రవాహాలైన మంజీరా, మానేరు, తాలిపేరు, లెండి, పెనుగంగ, కిన్నెరసాని వంటి వాగులు, కృష్ణా బేసిన్లో మూసీ, ఊకచెట్టువాగు, పెద్దవాగు, డిండి వాగు, పాలేరు, తుంగపాడు వంటి వాగులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని నిర్ణయించింది. వాటి పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు అవకాశం ఉంటుందన్న దానిపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఇటీవల ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లాలవారీగా నిర్మాణానికి అనువయ్యే చెక్‌డ్యామ్‌ల ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. మొత్తంగా 1,200.. రూ. 4,825 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నదులు, ఉపనదులు, వాగులు, వంకలపై కలిపి మొత్తంగా 1,200 చెక్‌డ్యామ్‌లు నిర్మించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో గోదావరి బేసిన్ పరిధిలోనే 840 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయి. కృష్ణా పరిధిలో సుమారు 700 మేర ప్రతిపాదనలురాగా వాటిని 400కు కుదించే అవకాశం ఉంది. ఇక నీటి లభ్యత ఉన్న ప్రాంతాలు, ప్రాజెక్టుల సమీప కాల్వల నుంచి చెరువులకు నీటిని తరలించేలా తూముల నిర్మాణానికి సైతం ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా 400 తూములను నిర్మించే అవకాశం ఉందని ప్రాథమికంగా తేల్చారు. అన్ని నిర్మాణాలకు మొత్తంగా రూ. 4,825 కోట్లు ఖర్చు చేసేలా ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో తూముల నిర్మాణానికి రూ. 410 కోట్లు వెచ్చించనున్నారు. చెక్‌డ్యామ్‌లకు సంబంధించిన వ్యయ అంచనాలు పరిపాలనా అనుమతుల కోసం ఇప్పటికే రాష్ట్ర కార్యాలయానికి చేరుతున్నాయి. ఒక్కో చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ. 3 కోట్ల నుంచి రూ. 8 కోట్ల నుంచి వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పనులకు నిధుల కొరత లేకుండా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రుణాలు తీసుకొనేలా ప్రభుత్వం యోచిస్తోంది. -
మళ్లింపు జలాలపై నిపుణుల కమిటీ?
సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తూ చేపట్టిన ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటా అంశాన్ని తేల్చేందుకు మళ్లీ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి కమిటీయే మార్గమని తేల్చింది. ఇదివరకే ఏర్పాటు చేసిన ఏకే బజాజ్ కమిటీ ఏమీ తేల్చని నేపథ్యంలో కేంద్ర జల సంఘంలో పనిచేసిన రిటైర్డ్ ఇంజనీర్లు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన నిపుణులతో కమిటీని నియమించి దీనిపై నిర్దిష్ట సమయంలోనే నివేదిక ఇచ్చేలా చూడాలని నిర్ణయించినట్లు తెలిసింది. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతో గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు తరలిస్తున్న దృష్ట్యా, బచావత్ ట్రిబ్యునల్ అవార్డుల మేరకు కృష్ణాలో ఎగువన ఉన్న తెలంగాణ అదనపు నీటి వాటాను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. ఏకే బజాజ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ 2017 ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో పర్యటించిన కమిటీకి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ, పోలవరంల ద్వారా ఎగువ రాష్ట్రానికి దక్కే 90 టీఎంసీల వాటాలో గరిష్టంగా తెలంగాణకు 73 టీఎంసీలు దక్కేలా చూడాలని రాష్ట్రం కోరింది. మళ్లింపు జలాల అంశం తమ పరిధిలో లేదని, ఇది ట్రిబ్యునళ్లు తేల్చాల్సి ఉందని కమిటీ చేతులెత్తేసింది. ఈ సమయంలోనే కమిటీ గడువు ముగియడంతో మరో ఆరు నెలలు పొడిగించారు. ఈ వ్యవధిలో రాష్ట్రంలో ఒక్క పర్యటన కూడా కమిటీ చేయలేదు. ఈ నేపథ్యంలో కమిటీ రద్దయిపోయింది. అప్పటి నుంచి ఈ అంశం మరుగునపడింది. అయితే ఇటీవల మళ్లీ ఈ అంశాన్ని తెలంగాణ తెరపైకి తేవడంతో కేంద్రం దీనిపై చర్చించేందుకు బుధవారం కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లను ఢిల్లీకి పిలిపించింది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలోని శ్రమశక్తిభవన్లో జరిగిన ఈ భేటీకి కృష్ణాబోర్డు ఇన్చార్జి చైర్మన్, గోదావరి బోర్డు చైర్మన్ ఆర్కే జైన్, కృష్ణాబోర్డు సభ్యుడు హరికేశ్ మీనాలు హాజరయ్యారు. ఈ సమావేశంలో మళ్లింపు జలాలపై ఇరు రాష్ట్రాలు వెల్లడిస్తున్న అభిప్రాయాలపై చర్చించారు. దీనిపై తేల్చేందుకు నిపుణుల కమిటీని వేద్దామని కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ప్రతిపాదించగా, బోర్డు చైర్మన్ అంగీకరించినట్లు తెలిసింది. దీంతో పాటే కృష్ణా, గోదావరి బోర్డుల వర్కింగ్ మాన్యువల్‌ను ఓకే చేసేలా రెండు రాష్ట్రాలను ఒప్పించాలని కేంద్రం బోర్డులకు సూచించినట్లుగా తెలిసింది. దీన్ని అంగీకరించాకే రెండు రాష్ట్రాల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చే అంశమై చర్చిద్దామని తెలిపినట్లుగా సమాచారం. ఇక కృష్ణా బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. -
గోదావరి నీటిపై కొత్త పేచీ!
* తెలంగాణలో ప్రాణహిత, కంతనపల్లి ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు * నీటి లభ్యత లేని సమయాల్లో దిగువన పరిస్థితేంటని వాదన * గోదావరి బోర్డుకు నివేదించాలని నిర్ణయం.. 23న బోర్డు భేటీలో చర్చకు వచ్చే అవకాశం * గట్టి సమాధానం చెప్పాలని భావిస్తున్న తెలంగాణ సర్కారు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదం ముదిరే అవకాశం కనిపిస్తోంది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో గోదావరి నీటిని ఎగువన తెలంగాణ రాష్ర్టమే పూర్తిగా వాడేసుకుంటే దిగువన ఉన్న తమ రాష్ర్ట ప్రయోజనాలు దెబ్బతింటాయని ఏపీ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ముఖ్యంగా గోదావరిలో నీటి లోటు ఉండే సమయాల్లో లభ్యమయ్యే నీటినంతా ఎగువ రాష్ర్టమే వినియోగిస్తే.. దిగువ రాష్ర్ట అవసరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తోంది. సాధారణంగా ఖరీఫ్ ప్రారంభంలో నీటి లోటు అధికంగా ఉంటుందని, ఆ సమయంలో వచ్చే నీటిని తెలంగాణ ప్రాజెక్టుల నుంచి దిగువకు వదలకపోతే ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆ రాష్ర్ట ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో లోటు సమయాల్లో నీటి కేటాయింపులు ఎలాగన్న దానిపై ముందుగా తేల్చాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డును ఆశ్రయించేందుకు ఏపీ సిద్ధమవుతోంది. ఈ నెల 23న జరిగే గోదావరి బోర్డు సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. గోదావరి నదీ వివాదాల ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం నదిలో నికరంగా ఏటా 1,200 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంటుండగా 900 టీఎంసీల మేర తెలంగాణ, మరో 300 టీఎంసీలను ఏపీ వాడుకునే వెసులుబాటు ఉంది. ఈ మొత్తం నీటిలో ప్రాణహిత-చేవెళ్లకు 160 టీఎంసీల కేటాయింపులు ఉండగా, కంతనపల్లి ప్రాజెక్టుకు మరో 50 టీఎంసీలను కేటాయించారు. ప్రాణహితతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు తెలంగాణ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇక గోదావరి నికర, మిగులు జలాలు వాడుకునేందుకు వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి 22.5 టీఎంసీల నీటి నిల్వకు సంకల్పించారు. దీని ద్వారా తెలంగాణలోని మూడు జిల్లాల పరిధిలో 7.50 లక్షల ఆయకట్టును స్థిరీకరించే అవకాశముంది. అయితే గోదావరి నదీప్రవాహం ప్రాణహిత, కంతనపల్లిని దాటి దిగువన ఏపీ నిర్మిస్తున్న పోలవరానికి రావాల్సి ఉంది. కంతనపల్లికి ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఇంద్రావతిలో 300 టీఎం సీల మేర మిగులు జలాలు ఉండగా అవన్నీ కాళేశ్వరం వద్ద గోదావరిలోనే కలుస్తాయి. ఈ మిగులు జలాలను ఆధారం చేసుకొంటే.. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కంటే ఎక్కువే దక్కుతాయని ఏపీ వాది స్తోంది. ఎగువన ఉన్న తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ గోదావరి బోర్డుకు నివేదించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి గట్టి జవాబివ్వాలని తెలంగాణ నిర్ణయించింది. సీలేరు, శబరిల్లో భారీ ప్రవాహాలు ఉంటాయని, గోదావరిలో లభించే నీటితో పోలిస్తే దిగువనే ఎక్కువ నీరు లభిస్తుందని, ఈ దృష్ట్యా ఏపీకి నష్టమేమీ లేదని తెలంగాణ వాదిస్తోంది.