ఏపీలో 50 లక్షలు దాటిన మొబైల్ కనెక్షన్లు
రాష్ట్రంలో 4,300 చోట్ల 4జీ సేవలు..
ఆపై ఆరు నెలల్లో 5జీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత సంచార నిగం లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ప్రైవేటు రంగ సంస్థలకు గట్టి పోటీనిస్తోంది. ఆకర్షణీయమైన రీచార్జి ప్యాకేజీలకు తోడు, మెరుగైన సర్వీసులు అందిస్తుండటంతో వినియోగదారులు క్రమేపీ బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గుతున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ దేశీంగా అభివృద్ధి చేసిన 4జీ సేవలను రాష్ట్రంలోకి అందుబాటులోకి తెస్తుండటంతో వినియోగదారులకు హైస్పీడ్ డేటాతో పాటు అంతరాయాలు లేకుండా కాల్స్ మాట్లాడుకునే వెసులుబాటు కలుగుతోంది. దీంతో ఇతర ప్రైవేటు మొబైల్ ఆపరేటర్ల నుంచి వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపునకు మారుతున్నారు.
తక్కువ టారిఫ్
రాష్ట్రంలో ఇప్పటికే విజయవాడలో 4జీ సేవలను అందుబాటులోకి రావడంతో గడిచిన 20 రోజుల్లోనే 600 మందికి పైగా ఇతర ఆపరేటర్ల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి మారినట్లు విజయవాడ బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం రమణ తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.229 రీచార్జికి 30 రోజులు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 2 జీబీ డేటా అందిస్తుంటే.. ఇవే ప్రయోజనాలు పొందాలంటే ప్రైవేటు సంస్థల్లో రూ.349 నుంచి రూ.379 వరకు చెల్లించాల్సి వస్తోంది.
తక్కువ రేటుకే బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ సరీ్వసులు అందిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ డేటా వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి మొబైల్ వినియోగదారుడు సగటున 24 జీబీ డేటాను వినియోగిస్తుంటే.. రాష్ట్రంలో గ్రామీణ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు మాత్రం 70 జీబీ పైనే వినియోగిస్తుండటం గమనార్హం.
త్వరలో 5జీ సేవలు
రాష్ట్రంలోని 4,500 ప్రాంతాల్లో 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని ఏపీ బీఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలం తెలిపారు. ఒక్కసారి 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాక ఆరు నెలల్లోనే సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా 5జీ సేవలు అందుబాటులోకొస్తాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ల సంఖ్య 1.50 లక్షలు దాటగా, మొబైల్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య 50 లక్షలు దాటినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదే సమయంలో ఏడీఎస్‌ఎల్ బ్రాడ్ బ్యాండ్ 25,000, ఫైబర్ టు హోమ్ కనెక్షన్ల సంఖ్య 1.9 లక్షలకు పైనే ఉన్నాయి. రాష్ట్రంలో బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ల సంఖ్య పెరుగుతుండటంతో ఈ మేరకు ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. 2022–23లో బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ సర్కిల్ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.700 కోట్లకు చేరుకోగా.. అది 2023–24లో రూ.1,000 కోట్ల మార్కుకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో వీఆర్‌ఎస్ ద్వారా ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంతో పాటు మిగులు స్థలాలను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 27 చోట్ల బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఉన్న అదనపు ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే విజయవాడ, తాడేపల్లిగూడెం, తుని, పాలకొల్లు, కొండపల్లిలో స్థలాలను విక్రయించడం ద్వారా రూ.80 కోట్ల నిధులను సమకూర్చుకుంది.
1.5లక్షలు ప్రస్తుతం రాష్ట్రంలో బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ల సంఖ్య
రూ.700కోట్లు 2022–23లో బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ సర్కిల్ ఆదాయం
50లక్షలు రాష్ట్రంలో బీఎస్‌ఎన్‌ఎల్ సెల్‌ఫోన్ కనెక్షన్ల సంఖ్య
రూ.1,000కోట్లు 2023–24లో బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ సర్కిల్ ఆదాయం(అంచనా)
Comments
Please login to add a commentAdd a comment