కర్నూలులో గాంధీజీ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్న బీవై రామయ్య, ఎమ్మెల్యేలు కాటసాని, హఫీజ్‌ఖాన్ తదితరులు
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని, ఆయన తీరు సిగ్గుచేటని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. ఆయన స్వలాభం కోసం దేన్నైనా నాశనం చేస్తారని దుయ్యబట్టారు. మూడు రాజధానులను అడ్డుకుంటే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. బుధవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూలు కలెక్టరేట్ వద్దనున్న గాంధీజీ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీవై రామయ్యతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మూడు రాజధానులను ప్రకటించారన్నారు. భవిష్యత్‌లో ప్రాంతీయ అసమానతలు తలెత్తకుండా ఉండాలంటే మూడు రాజధానులే పరిష్కారమన్నారు.
శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించి కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసిన సీఎంకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానులను అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు పన్నడం శోచనీయమన్నారు. స్వలాభం కోసం అమరావతి రాజధానిగా ఉండాలని పట్టుబట్టడం దారుణమన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ పాలనా వికేంద్రీకరణను అడ్డుకోవడానికి చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. ఆయన ఎన్ని కుట్రలు పన్నినా త్వరలోనే మూడు రాజధానుల ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటయితే ఇక్కడి ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నాయకులు సీహెచ్ మద్దయ్య, రైల్వే ప్రసాద్, ఆదిమోహన్‌రెడ్డి, జమీల, రియల్ టైం నాగరాజు యాదవ్, సాంబశివారెడ్డి,దేవపూజ ధనుంజయాచారి, డీకే రాజశేఖర్, మంగమ్మ, రాజు,కృష్ణకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment