నకిలీ హోంగార్డుల కేసు ఏసీబీకి.. | Case of fake home guards to ACB | Sakshi
Sakshi News home page

నకిలీ హోంగార్డుల కేసు ఏసీబీకి..

Published Fri, Mar 10 2023 3:53 AM | Last Updated on Fri, Mar 10 2023 10:52 AM

Case of fake home guards to ACB - Sakshi

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో వెలుగుచూసిన నకిలీ హోంగార్డుల నియామకం కుంభకోణం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి బదిలీ అయింది. కేసును పోలీసుశాఖ నుంచి ఏసీబీకి బదిలీచేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.

ఇప్పటివరకు కేవలం ఏడుగురు నిందితులుగా ఉన్న ఈ కేసులో ఇప్పుడు మరో 86 మందిని చేర్చారు. మొత్తం నిందితులు 93 మందిలో.. నకిలీ హోంగార్డులు 90 మంది, విధుల నుంచి తొలగించిన హోంగార్డులు ఇద్దరు, ఒక కానిస్టేబుల్‌ ఉన్నారు.  

అక్రమాలకు పాల్పడినవారిలో వణుకు  
ఈ కేసు దర్యాప్తును ఏసీబీ చేపట్టడంతో అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు, పోలీసుల్లో వణుకు మొదలైంది. నకిలీ హోంగార్డుల నుంచి టీడీపీ నేతలు వసూలు చేసిన రూ.5 కోట్లలో చిత్తూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత సింహభాగాన్ని చినబాబుకు ముట్టచెప్పినట్లు ఆరోపణలున్నాయి.

ఈ కుంభకోణంలో డీఎస్పీలు, జిల్లా పోలీసుశాఖకార్యాలయంలో పనిచేసే ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు, నాటి ఓ పోలీసు ఉన్నతాధికారి ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో సాక్ష్యాలు సేకరించి నిందితులకు ఉచ్చు బిగించడంపై న్యాయసలహాలు తీసుకుంటున్నారు.   

దొడ్డిదారిన నియమించిన అధికారులు 
2014 నుంచి 2019 వరకు విడతలవారీగా చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో 90 మంది హోంగార్డులను చేర్చారు. పోలీసుశాఖ నుంచి నోటిఫికేషన్‌ లేకుండా, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించకుండా కొందరు పోలీసు అధికారులు, తెలుగుదేశం నేతలు కలిసి వీరిని చేర్పించేశారు. ఈ దొడ్డిదారి నియామకాల్లో నాటి టీడీపీ ప్రభుత్వ మంత్రి నుంచి జిల్లాకు చెందిన టీడీపీ తమ్ముళ్లు ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.

టీడీపీ నేతలు చెప్పిందే చాలు అన్నట్టు.. పోలీసుశాఖలోని పెద్ద హోదాల్లో పనిచేసిన అధికారులు ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ హోంగార్డులను ఆన్‌–పేమెంట్‌ కింద టీటీడీ, అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖ, విద్యుత్‌శాఖ, రవాణాశాఖ, లా అండ్‌ ఆర్డర్‌ విభాగాల్లో చొప్పించేశారు. దొడ్డిదారిన, తప్పుడు డ్యూటీ ఆర్డర్‌ (డీవో)లతో పోస్టులు పొందిన నకిలీ హోంగార్డులకు ప్రభుత్వం రూ.12 కోట్లకుపైగా వేతనాలు కూడా చెల్లించింది.

ఈ బాగోతాన్ని గుర్తించిన చిత్తూరు జిల్లా పోలీసుశాఖ గతేడాది జూలై 16వ తేదీన ఏఆర్‌ఐ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు డిసెంబర్‌ 11న ఏడుగురిని (నకిలీ హోంగార్డులు నలుగురు, విధుల నుంచి తొలగించిన హోంగార్డులు ఇద్దరు, ఒక కానిస్టేబుల్‌ను) అరెస్టు చేశారు. రూ.కోట్లు చేతులు మారడం, పోలీసుశాఖలోని ఉద్యోగుల ప్రమేయం ఉండటంతో డీజీపీ ఈ కేసును ఏసీబీకి బదిలీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement