సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్‌ను కొనసాగుతున్నందున రంజాన్ పండుగ నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెలవంక సమయాన్ని బట్టి ఈ నెల 13 లేదా 14వ తేదీల్లో నిర్వహించుకునే రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాలు, బహిరంగ ప్రదేశాల్లో ఈద్ ఉల్ ఫిత్రా, సామూహిక నమాజ్‌లను పూర్తిగా నిషేధించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. రంజాన్ ప్రార్థనల సందర్భంగా పాటించాల్సిన మార్గదర్శకాలను మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ మహమ్మద్ ఇలియాస్ రిజ్వీ విడుదల చేశారు. ఇదిలావుండగా.. కరోనా కట్టడికి సామాజిక బాధ్యతగా ముస్లింలు రంజాన్ ప్రార్థనలను ఇళ్లల్లోనే చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా పిలుపునిచ్చారు.
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలివీ..
► రంజాన్ రోజున మసీదుల్లో జరిగే ప్రార్థనల్లో 50 మందికి మించి పాల్గొనకూడదు.
► ప్రార్థనల్లో పాల్గొనే వారు మాస్క్ ధరించి కనీసం ఆరు అడుగుల చొప్పున భౌతిక దూరం పాటించాలి.
► ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య రెండు విడతల్లో 50 మంది చొప్పున ప్రార్థనలు చేసుకోవచ్చు.
► మాస్క్ లేని ఏ ఒక్కరినీ మసీదుల్లోకి అనుమతించకూడదు. ప్రార్థనలకు ముందు నిర్వహించే వాదును ఇళ్ల వద్దే పూర్తి చేసుకోవాలి. నేలపై కూర్చునేందుకు మేట్‌లను ఇంటినుంచి తెచ్చుకోవాలి.
► మసీదు ప్రవేశ ద్వారం వద్ద తగిన సంఖ్యలో శానిటైజర్స్‌ను అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరి చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలి.
► వృద్ధులు, పిల్లలతో పాటు దగ్గు, జలుబు, జ్వరం, మధుమేహం, హై బీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకోవాలి.
► ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకునేందుకు చేతులు కలపడం, ఆలింగనం చేసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలి.
ఇళ్లల్లోనే రంజాన్ జరుపుకోండి
Published Wed, May 12 2021 3:52 AM | Last Updated on Wed, May 12 2021 3:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment