నిలువెల్లా.. నిస్తేజం.. దినదిన గండంగా టీడీపీ పరిస్థితి.. ఇలా ఎలా బాబూ! | Chandrababu believed in yellow media and social media | Sakshi
Sakshi News home page

నిలువెల్లా.. నిస్తేజం.. దినదిన గండంగా టీడీపీ పరిస్థితి.. ఇలా ఎలా బాబూ!

Published Sun, Feb 19 2023 3:49 AM | Last Updated on Sun, Feb 19 2023 8:34 AM

Chandrababu believed in yellow media and social media - Sakshi

టీడీపీ పరిస్థితి దినదిన గండంగా మారింది. వరుస ఎన్నికల్లో దారుణ పరాజయాలతో నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టా­డుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన 23 మందిలో నలుగురు ఎప్పుడో పార్టీని వీడారు. మిగిలిన వారిలో నలుగురైదుగురు మినహా అంతా నిస్తేజంలో ఉన్నారు. అత్యధిక నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాథుడే కరువయ్యాడు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే పార్టీ అధ్యక్షుడు ఏనాడూ సొంతంగా పోటీ చేసే ధైర్యం లేక ఇతర పార్టీలతో పొత్తుల కోసం వెంపర్లా­డుతున్నారు. సభలు, సమావేశాలకు జనం రారనే భయంతో ఇరుకు రోడ్లపై సభలతో ఉనికి చాటుకునే దీన స్థితికి దిగజారారు. ఒక్క మాటలో చెప్పాలంటే గల్లీ లీడర్‌ అవతారమెత్తారు.

సాక్షి, అమరావతి: నాలుగు దశా­బ్దాల చరిత్ర కలిగిన టీడీపీ మనుగడ కోసం పడరాని పాట్లు పడుతోంది. ఎల్లో మీడియా, సోషల్‌ మీడియాను నమ్ముకుని రాజకీయం చేస్తోంది. క్షేత్ర స్థాయిలో జనాదరణ కరువ­వ్వడంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబా­బుకు నిద్ర కరువైంది. ఓ వైపు తనకు వయో భారం.. మరో వైపు చేతికి అందివచ్చిన కొడుకు పార్టీ పగ్గాలు అందుకోలేకపోతున్నాడని దిగులు. మరెవరికైనా నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు మనసొప్పని నైజం.

ఈ పరిస్థితిలో ఫొటోలు, వీడియోల కోసం మీడియా సమావేశాలు, చిన్నపాటి సభలు నిర్వహించడం మినహా ఎలాంటి కార్యకలాపాలు లేవు. చంద్రబాబు ఎన్ని పిలుపులు ఇచ్చినా పార్టీ యంత్రాంగం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. బాదుడే బాదుడు కార్యక్రమం జనం లేక ప్లాప్‌ అయింది. దీంతో పేరు మార్చి ‘ఇదేం ఖర్మ’ అంటూ కొత్త కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చినా స్పందన లేకపోవడంతో ఇరుకు రోడ్లు, కానుకల పంపిణీ వ్యూహాన్ని ఎంచుకున్నారు.

ఇరుకు సందుల్లో సభలు పెట్టి వచ్చిన కొద్దిపాటి జనాన్ని ప్రభంజనంగా చూపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి కందుకూరు సభలో 8 మంది, గుంటూరు చంద్రన్న కానుకల పంపిణీలో ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితుల్లో నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆరంభం నుంచే వెలవెలబోతోంది.

చిత్తూరు జిల్లా పాదయాత్రలో ఇటీవల ఓ రోజు జనం లేక లోకేశ్‌ చాలాసేపు బస్సులోనే గడిపారు. దీంతో చంద్రబాబు స్థానిక నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి జన సమీకరణ ఎందుకు చేయలేకపోయారని మండిపడ్డారు. యాత్ర ఆసాంతం పేలవంగా సాగుతుండడంతో టీడీపీ నేతలకు పాలు పోవడం లేదు. అనుకూల మీడియాలో హడావుడి మినహా పాదయాత్రలో విషయం లేదని స్పష్టమైంది.

ఉత్తరాంధ్రలో అగమ్య గోచరం
► ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఒకవైపు జనం పట్టించుకోక పార్టీ బలహీనంగా మారినా ముఖ్య నాయకులు మాత్రం పార్టీలో ఆధిపత్యం కోసం కుమ్ములాడుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి పడక తెర వెనుక వారికి వారే గోతులు తవ్వుకుంటున్నారు. 

► శ్రీకాకుళం జిల్లాలో వర్గాలుగా విడిపోయి రాజకీయాలు నడుపుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మరో నేత కళా వెంకట్రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా పరిస్థితి ఉంది. జిల్లాలో తెలుగుదేశం పార్టీ అచ్చెన్న గ్రూపు, కళా గ్రూపుగా విడిపోయి ఉంది. 

► అచ్చెన్నను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి మరో బీసీకి అవకాశం ఇవ్వాలని కళా వెంకట్రావు పొలిట్‌బ్యూరో సమావేశంలో చంద్రబాబు సమక్షంలోనే విరుచుకుపడ్డారు. నారా లోకేశ్‌ అచ్చెన్నాయుడిని వ్యతిరేకిస్తూ కళా గ్రూపును ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు మద్ధతుతో అచ్చెన్న జిల్లాలో తన వర్గంతో రాజకీయాలు చేస్తున్నారు. శ్రీకాకుళం, ఎచ్చర్ల, పాతపట్నం నియోజకవర్గాల్లో కళా, అచ్చెన్న గ్రూపులకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. 

బాబాయ్, అబ్బాయ్‌ మధ్యా విభేదాలు
► అచ్చెన్నాయుడికి కళా వెంకట్రావుతోనే కాకుండా తన అన్న కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్‌నాయుడితోనూ విభేదాలున్నాయి. లోకేశ్‌ అచ్చెన్నాయుడిని పక్కనపెట్టి రామ్మోహన్‌నాయుడికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించి అచ్చెన్నకు చెక్‌ పెట్టాలని లోకేశ్‌ భావిస్తున్నారు. రామ్మోహన్‌ కూడా అదే దిశగా బాబాయ్‌ స్థానంలో తాను కీలక నేతగా ఎదగడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గాల్లో తన వర్గాన్ని ప్రత్యేకంగా పెంచి పోషిస్తున్నారు.

► నర్సన్నపేట నియోజకవర్గంలో అచ్చెన్న, రామ్మోహన్‌ వర్గాలు ఎవరికి వారే యమునా తీరే చందంగా వ్యవహరిస్తున్నారు. అచ్చెన్నకు ఒకవైపు కళా వెంకట్రావు, మరోవైపు రామ్మోహన్‌లు మెహరించడంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలోని నేతల మధ్య అచ్చెన్న సయోధ్య కుదర్చలేకపోయారు.

► లోకేశ్‌ అండతో శ్రీకాకుళం జిల్లా టీడీపీ రాజకీయాల్లో పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్న కళా వెంకట్రావు సొంత నియోజకవర్గం ఎచ్చర్లలో మాత్రం ఎదురీదుతున్నారు. కలిశెట్టి అప్పలనాయుడు, చౌదరి బాబ్జి వర్గాలు ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కళా వెంకటరావును ఓడించడమే లక్ష్యంగా వారు పని చేస్తున్నారు.

అశోక్‌ను వ్యతిరేకిస్తున్న కీలక నేతలు 
► విజయనగరం జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆధిపత్యాన్ని పలువురు నేతలు సవాల్‌ చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, చీపురుపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున జిల్లాలో తన వర్గాన్ని పెంచుకుంటూ అశోక్‌ను వ్యతిరేకిస్తున్నారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు కూడా అశోక్‌ గజపతికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. 

► విజయనగరంలో మీసాల గీత అశోక్‌తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నారు. ఈ పంచాయితీ చంద్రబాబు వద్దకు వెళ్లినా సర్దుబాటు కాలేదు. ఈసారి విజయనగరం ఎమ్మెల్యే సీటు అశోక్‌ కుటుంబానికి కాకుండా బీసీ వర్గానికి ఇవ్వాలని వీరంతా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. అశోక్‌ కబంధ హస్తాల నుంచి టీడీపీని విడిపించాలని, ఆయనకు బానిసత్వం చేయలేమని ఈ గ్రూపు చెబుతోంది. 

► నెల్లిమర్లలో మాజీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడికి ఇతర నేతలతో సఖ్యత లేదు. నియోజకవర్గ ఇంచార్జ్‌ బాధ్యత నుంచి నారాయణస్వామి నాయుడును తప్పించి బంగార్రాజును నియమించడంతో విభేదాలు మరింత ముదిరాయి. నారాయణస్వామి వర్గం బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. జనాదరణ లేకపోయినా నియోజకవర్గ టీడీపీ నేతలు నాలుగు వర్గాలుగా విడిపోయి రాజకీయాలు చేస్తున్నారు. 

► చీపురుపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను అక్కడ పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల పలువురు నేతలు లోకేశ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్‌ స్థానికులైన తమలో ఎవరో ఒకరికి ఇవ్వాలని నాగార్జున నాన్‌ లోకల్‌ అని కుండబద్దలు కొట్టారు.
 
విశాఖలో తోడల్లుడికి లోకేశ్‌ ఎసరు  
► విశాఖపట్నంలో తోడల్లుడు భరత్‌కు.. లోకేశ్‌ ఎసరు పెడుతున్నట్లు టీడీపీ నేతలే వాపోతున్నారు. భరత్‌ను రాజకీయంగా ఎదగనివ్వకూడదని లోకేశ్‌.. ఆయనకు వ్యతిరేకంగా మొదటి నుంచీ పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో భరత్‌కు ఎంపీ సీటు ఇచ్చినా నేతలు, క్యాడర్‌ పని చేయకుండా అడ్డుపడ్డారని స్థానిక నేతలు చెబుతున్నారు. 

► మళ్లీ ఎంపీగా పోటీ చేయాలని భరత్‌ పట్టు పడుతుంటే లోకేశ్‌ అడ్డు తగిలి కొద్దిరోజులు విశాఖ సౌత్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి ఇచ్చారు. ఇప్పుడు అది కూడా లేదు. అయితే ఎంపీ లేకపోతే భీమిలి సీటు ఇవ్వాలని భరత్‌ అడుగుతున్నా లోకేశ్‌ ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో తోడళ్లుళ్ల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. 

అయ్యన్న వర్సెస్‌ గంటా
► విశాఖ జిల్లాలో చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య ఆది నుంచి విభేదాలే. ఇటీవలే గంటాకు వ్యతిరేకంగా అయ్యన్న చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. ‘గంటా శ్రీనివాసరావు ఎవడు? లక్ష మందిలో ఆడొకడు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బొక్కలో దాక్కుని.. ఇప్పుడు బయటకు వస్తున్నాడు. ఎవడి చంక నాకడానికి వస్తాడు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

► ఇన్నాళ్లూ పార్టీతో అంటీముట్టనట్లు ఉన్న గంటా ఇప్పుడు యాక్టివ్‌ అవుతుండడాన్ని జీర్ణించుకోలేని అయ్యన్న ఆయనపై కాలు దువ్వుతూ తనదైన అసభ్య భాషతో బహిరంగంగానే తిట్టడం చర్చనీయాంశమైంది. దీంతో గంటా.. ఆయ్యన్నకు వ్యతిరేకంగా ఆయన నియోజకవర్గం నర్సీపట్నంలో కుంపటి పెట్టేందుకు రెడీ అయ్యారు. నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ముత్యాల పాప, ఎర్రా పాత్రుడు వంటి నేతలు అయ్యన్నకు వ్యతిరేకంగా స్వరం పెంచడం వెనుక గంటా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

► మరోవైపు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, అయ్యన్నపాత్రుడి మధ్యా విభేదాలున్నాయి. గంటాపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలను బండారు కొడుకు అప్పలనాయుడు ట్విటర్‌లో తప్పుపట్టారు. పార్టీ ప్రయోజనాలు కాదని సొంత ఎజెండాతో పని చేయడం ఎంత వరకు సబబని అయ్యన్నను ప్రశ్నించారు. అలాగే బండారు సత్యనారాయణమూర్తికి, మరో నేత గండి బాబ్జికి పొసగడం లేదు. పెందుర్తి సీటు కోసం ఇద్దరు తగవులాడుకుంటున్నారు.

ధ్యాసంతా పొత్తుల పైనే!
ఏ ఎన్నికలోనూ పొత్తు లేకుండా ఎన్నికలు ఎదుర్కోవడం టీడీపీ చరిత్రలోనే లేదు. 20 ఏళ్లు అధికారం చెలాయించిన పార్టీ దుస్థితి ఇది. పొత్తు లేకపోతే ఇక అంతేననే భయంతో ఒక్క స్థానంలో కూడా గెలవని పార్టీతో పొత్తు కోసం తహతహలాడుతుంటడం ఆ పార్టీ దయనీయ స్థితిని తెలియజేస్తోంది. జనం రారని మైదానాల్లో సభలు నిర్వహించలేని దైన్యం.

ఇరుకు రోడ్లపై సభలతో తండ్రీ కొడుకులు ఉనికిపాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకుగాను 60కి పైగా స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లే లేరు. నాయకులు ముఖం చాటేయడంతో కొత్త వారిని ప్రోత్సహిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది.

పిలిచి పార్టీ పదవులు ఇస్తామన్నా టీడీపీ నాయకులు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో కొంత మందికి నెలవారీ జీతాలిచ్చి అనుబంధ సంఘాల అధ్యక్షులుగా నియమించుకున్నారు. వారే ఇప్పుడు మీడియా సమావేశాల్లో ఊదరగొడుతున్నారు. కొమ్మారెడ్డి పట్టాభి లాంటి నేతలు ఈ కోవకు చెందినవారే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement