శాంతిపురం–రామకుప్పం మండలాల సరిహద్దుల్లోని అమ్మవారిపేట రెవెన్యూలో అజిష్టా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ కోసం భూములు కేటాయించారు. కానీ నేల చదును, ఫెన్సింగ్ ఏర్పాటు పనులకే అది పరిమితమైంది
అమరావతి పేరిట రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపించిన బాబు తనను మూడు దశాబ్దాలుగా మోస్తున్న కుప్పం ప్రజలను అంతకు మించి కలలతీరాల్లో విహరింపజేశారు. రాజధానికి మించి ఇక్కడ అభివృద్ధి చేస్తామని, పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తామని ఆ ఐదేళ్లూ ఊదరగొట్టారు. కానీ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా వచ్చిన పాపాన పోలేదు. నిజంగా ఇంత దారుణంగా మాయ చేస్తారా అనిపిస్తుంది వాస్తవాలు చూస్తే!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: అమాయక కుప్పం ప్రజలను ఎన్నో విధాలుగా నమ్మించి మాయ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరిశ్రమల పేరిట ఎన్నో జిమ్మిక్కులు చేశారు. ప్రజాప్రతినిధిగా మూడు దశాబ్దాల కాలంలో లెక్కకు మించిన అబద్ధాల దడి కట్టారు. ఎన్నెన్నో పరిశ్రమలు వచ్చేస్తున్నాయని నమ్మబలికారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా 2016 ఆగస్టు 8వ తేదీ రాత్రి ఇక్కడే పారిశ్రామికవేత్తలతో బాబు సమావేశమయ్యారు. రూ.3వేల కోట్లతో వివిధ పరిశ్రమలు వచ్చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. బడా కంపెనీల పేర్లు చెప్పేసరికి కుప్పం ప్రజలు ఆశల పల్లకిలో ఊరేగారు.
అన్నీ కాకపోయినా కొన్నయినా వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా రాలేదంటే వాస్తవ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా కుప్పం నియోజకవర్గం నుంచి రోజూ వేలాది మంది కార్మికులు బెంగళూరుకి వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా మొత్తం మీద వలస కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కుప్పమే అంటే నమ్మశక్యం కాకపోయినా అక్షరాలా నిజం.
మాకేంటి.. అనే డిమాండ్‌తో కొన్ని వెనక్కి
వాస్తవానికి ఆయా చర్చల తర్వాత విరివిగా భూములు ఇస్తామని చెప్పడంతో కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ బాబుకి అత్యంత సన్నిహితులైన స్థానిక టీడీపీ నేతలు ఆయా కంపెనీల్లో మాకు వాటాలు ఇవ్వాలి.. మాకేం ప్రయోజనం కలిగిస్తారు.. అనే డిమాండ్లతో వచ్చే కంపెనీలు కూడా వెనక్కి వెళ్లాయనే వాదనలు ఉన్నాయి.
► బ్రిటానియా పరిశ్రమ కోసం ఆ సంస్థ ప్రతినిధులు శాంతిపురం మండలంలోని కర్లగట్ట కోతులగుట్ట, కుప్పం మండలంలోని గణేష్‌పురం, గుడుపల్లె మండలంలోని పొగురుపల్లె ప్రాంతాలలో స్థల పరిశీలన చేశారు. కానీ అక్కడితోనే ఆగిపోయి తర్వాత కన్నెత్తి చూడలేదు.
► వైష్ణవి మెగా ఫుడ్ పార్క్ కోసం శాంతిపురం మండలంలోని 121 పెద్దూరు వద్ద వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు కేటాయించారు. ఈ భూములు సాగు చేస్తున్న రైతులకు పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కోవడంపై స్థానికులు వ్యతిరేకించినా అధికార బలంతో వారి గొంతు నొక్కారు. కానీ ఇంత చేసినా పరిశ్రమ మాత్రం తీసుకురాలేకపోయారు. అనంతరం ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ రైతులే తమ భూములను ఎంచక్కా సాగు చేసుకుంటున్నారు.
పనులు దొరక్క బెంగళూరు పోతిమి..
నాకు భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. అదిచేసినాం, ఇది చేసినాం అంటారే గానీ.. మాకు ఇక్కడ ఏ పనులు దొరకలేదు. పుట్టినూరు, ఉండే ఇళ్లు వొదిలేసి బెంగళూరుకు వెళ్లిపోయినాము. పదేళ్లకుపైనే ఇక్కడే ఉండాము. ఆకు కూరలు, కూరగాయలు అమ్మి పిల్లోళ్లని సదివిస్తా ఉండాము. ఏదైనా పండగొచ్చినా, పెళ్లిళ్లు జరిగినా కుప్పంకు వచ్చిపోతాము. – బాబు, చీలేపల్లె, కుప్పం
ఉపాధి కోసం వలస వెళ్లడంతో పాడుబడిన బాబు నివాసం
ఉపాధి కల్పనకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చర్యలు
కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాలకు చెందిన సుమారు 20వేల మంది కార్మికులు పనుల కోసం నిత్యం బెంగళూరుకు వెళ్లాల్సిన దుస్థితి. దీంతో ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంది. కుప్పంలో అపారమైన రాతి సంపద, నైపుణ్యం కలిగిన రాతి కార్మికులు ఉండడంతో ఆ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలని భావించింది. వేలాది మందికి ఉపాధి సౌకర్యం కల్పించేలా గ్రానైట్ సర్వే స్టోన్ కటింగ్, పాలిషింగ్ యూనిట్‌ను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. కుప్పం పరిధిలోని దళవాయి కొత్తపల్లె సమీపంలో పల్లార్ల పల్లె వద్ద 4 ఎకరాల స్థలంలో యూనిట్ స్థాపనకు చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment