కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ముచ్చెమటలు
అక్రమ నిధులు పొందే పార్టీలపై ఈడీ కేసులకు కోర్టు గ్రీన్‌సిగ్నల్
సంబంధిత పార్టీ అధ్యక్షుడే అందుకు బాధ్యుడు.. ఢిల్లీ మద్యం కేసు తరహాలోనే ఏపీలో స్కిల్ స్కామ్
హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు.. పూర్తి ఆధారాలతో ఈడీకి ఇప్పటికే నివేదించిన ‘సిట్’
సాక్షి, అమరావతి: మద్యం కుంభకోణంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది! హవాలా మార్గంలో అక్రమ నిధులు పొందే రాజకీయ పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందుకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. మద్యం కుంభకోణం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధులు పొందినట్లు ఆధారాలున్నందున ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌పై ఈడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం సరైనదేనని పేర్కొంది.
ఈ కేసులో హవాలా మార్గంలో ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు చేరిన తరహాలోనే చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెండు కేసుల మధ్య చాలా సారూప్యతలు న్నాయి. ఇప్పటికే స్కిల్ కుంభకోణంపై షెల్ కంపెనీలను విచారిస్తున్న ఈడీ ఇక చంద్రబాబును కూడా బోనెక్కించే అవకాశాలున్నాయి.
‘ఆప్’ చేతికి రూ.50 కోట్లు
ఢిల్లీలో మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మళ్లించినట్లు ఈడీ నిర్థారించింది. 2022లో గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు హవాలా మార్గంలో రూ.50 కోట్లు చేరినట్లు ఆధారాలతో తేల్చింది. ఈ మేరకు గోవాలో ఆప్ వ్యవహారాలను పర్యవేక్షించిన ఓ అభ్యర్థి వాంగ్మూలం కూడా ఇవ్వడం గమనార్హం.
కేజ్రీవాలే బాధ్యత వహించాలి
మద్యం కుంభకోణంపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్ 70 ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ, పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కేజ్రీవాల్ దీనికి బాధ్యత వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 2(ఎఫ్) ప్రకారం రాజకీయ పార్టీ అంటే కొందరు వ్యక్తులతో కూడిన సంఘం. కంపెనీల చట్టం ప్రకారం ఓ కంపెనీ అంటే కొందరు వ్యక్తులతో కూడిన సముదాయం. రెండు వేర్వేరు చట్టాల ద్వారా నమోదైన రాజకీయ పార్టీ, కంపెనీల నిర్వచనం మాత్రం ఒకటే. కాబట్టి అక్రమ నిధులు పొందిన ఓ కంపెనీపై ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లుగానే అక్రమంగా నిధులు పొందిన రాజకీయ పార్టీపై కూడా అదే విధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు’ అని న్యాయమూర్తి ప్రకటించారు. ‘మద్యం కుంభకోణం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధులు పొందినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఆ పార్టీకి జాతీయ సమన్వయకర్త (అధ్యక్షుడు)గా ఉన్న కేజ్రీవాలే అందుకు బాధ్యత వహించాలి. ఆయనపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు. ఆయన అరెస్ట్ సరైనదే’ అని తీర్పులో పేర్కొన్నారు.
స్కిల్ స్కామ్‌లో టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు
– బాధ్యత వహించాల్సింది చంద్రబాబే
చంద్రబాబు హయాంలో స్కిల్ స్కామ్‌లో కొల్లగొట్టిన నిధులు హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లోకి చేరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జర్మనీలోని సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్టు అంటూ నిధులు కొల్లగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేసిన రూ.371 కోట్లలో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబు బంగ్లాకు చేర్చిన అవినీతి నెట్‌వర్క్ గుట్టును సిట్ బయట పెట్టింది. అందులో రూ.65.86 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లు పక్కా ఆధారాలతో గుర్తించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నాలుగు బ్యాంకుల్లో టీడీపీ పేరిట ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.65,86,47,510 మళ్లించారు.
జూబ్లీహిల్స్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో టీడీపీకి మూడు ఖాతాలున్నాయి. వాటిల్లో వరుసగా రూ.4,81,60,587, రూ.25,31,31,352, 2,26,28,500 చొప్పున జమ చేశారు. జూబ్లీ హిల్స్‌లోని యూనియన్ బ్యాంక్ ఖాతాలో రూ.33,47,27,071 డిపాజిట్ చేశారు. 2016 నవంబరు నుంచి 2017 జనవరి మధ్యలో రూ.500, రూ.వేయి నోట్లను కట్టల రూపంలో తరలించి ఈ అక్రమ నిధులను జమ చేశారు. విస్తుపోయే విషయం ఏమిటంటే.. ఆ నిధులు తమకు ఏ ఆదాయ మార్గాల ద్వారా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించకుండానే బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దును ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అనుమతించింది. ఆ సమయంలో టీడీపీ బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులను జమ చేశారు. భారీ డిపాజిట్లకు సంబంధించి ఆదాయ మార్గాలు వెల్లడించాల్సి ఉండగా టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.65.86 కోట్లు జమ కావడం గమనార్హం. నోట్ల డిపాజిట్ సమయంలో ‘పే–స్లిప్’లో ఆ నిధులు ఎలా వచ్చాయనే విషయాన్ని తప్పనిసరిగా పేర్కొనాలి.
ఇక బాబుపై ఈడీ కొరడా!
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి సిట్ పూర్తి ఆధారాలను ఈడీకి అందచేసింది. షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో నిధుల తరలింపుపై కేసు నమోదు చేసిన ఈడీ ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఇప్పటికే సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్‌చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్‌తోపాటు నలుగురిని అరెస్ట్ చేసింది. డిజైన్‌టెక్ కంపెనీకి చెందిన రూ.31.32 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది.
ఈ కేసులో ఆ కంపెనీ ఆస్తులను జప్తు చేయడం సరైన చర్యేనని ఏపీ హైకోర్టు కూడా సమర్థించింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లో చేరిన అక్రమ నిధులపై ఈడీ దృష్టి సారించాల్సి ఉంది. తాజా తీర్పు ప్రకారం రాజకీయ పార్టీ ఖాతాలో చేరే అక్రమ నిధులకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలి. అంటే టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబే నిందితుడు అన్నది సుస్పష్టం. ఈ క్రమంలో ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని పలువురు న్యాయ నిపుణులతోపాటు సిట్ కూడా ఈడీ దృష్టికి తీసుకెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment