హామీలు సూపర్‌ సిక్స్‌.. అమలులో క్లీన్‌ బౌల్డ్‌ | Chandrababu Govt Super Six Failure In implementation | Sakshi
Sakshi News home page

హామీలు సూపర్‌ సిక్స్‌.. అమలులో క్లీన్‌ బౌల్డ్‌

Published Tue, Nov 12 2024 4:05 AM | Last Updated on Tue, Nov 12 2024 4:45 AM

Chandrababu Govt Super Six Failure In implementation

సూపర్‌ 6 హామీలకు బడ్జెట్‌లో మొండిచేయి

మహిళలకు ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదు 

రైతు భరోసాకు రూ.10 వేల కోట్లు కావాలంటే కేవలం రూ.వెయ్యి కోట్లే విదిల్చిన వైనం

తల్లికి వందనానికి పంగనామాలు 

ఉచిత బస్సుకు ఇంకా స్టార్టింగ్‌ ట్రబులే 

కోటి మందికి నిరుద్యోగ భృతి ఎగనామం 

‘గ్యాస్‌’ కోసం రూ.4 వేల కోట్లకు గాను రూ.895 కోట్లే 

అభివృద్ధి, సంక్షేమానికి తిలోదకాలు   

జాబ్‌ క్యాలెండర్‌ ఊసే లేదు.. స్వయం ఉపాధిపై స్పష్టత లేదు 

ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళలకిచ్చిన హామీలన్నీ నీటి మూటలే 

ఆశా భంగం.. పేదల గృహ నిర్మాణం  

మోత మోగించేలా విద్యుత్‌ చార్జీలు మాత్రం డబుల్‌  

మొత్తం బడ్జెట్‌ రూ.2.94 లక్షల కోట్లు

రెవెన్యూ వ్యయం రూ.2.35 లక్షల కోట్లు

మూల ధన వ్యయం రూ.32,712 కోట్లు 

అప్పుల చెల్లింపులకు రూ.24,498 కోట్లు

రుణాలు, అడ్వాన్స్‌లు రూ.1,298 కోట్లు 

రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు

ద్రవ్యలోటు రూ.68,742 కోట్లు

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తామనిగానీ.. నిర్దిష్ట కేటాయింపులుగానీ లేకుండానే సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీకి సమర్పించింది. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి బడ్జెట్‌లో ఎక్కడా ప్రతిబింబించకపోగా భారీగా పన్నుల మోత, అప్పుల వాతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపించాయి. సూపర్‌ సిక్స్‌ హామీలు డకౌట్‌ కావడంతో కూటమి సర్కారు తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోత సామెతను తలపిస్తోంది. 

గత ఆర్ధిక ఏడాది కంటే ఈదఫా పన్ను ఆదాయం ఏకంగా రూ.23,894 కోట్లు అదనంగా వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. అంటే పన్నుల రూపేణా ప్రజలపై మరింత భారం మోపనున్నారు. ఇందులో మద్యం ద్వారా అదనంగా రూ.10 వేల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. గత ఆర్ధిక ఏడాది మద్యం ద్వారా రూ.15,977 కోట్లు ఆదాయం రాగా ఈ ఆర్ధిక ఏడాది రూ.25,597 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. 

పన్నేతర ఆదాయం గత ఆర్థిక ఏడాది కన్నా రూ.3,000 కోట్లకు పైగా అదనంగా వస్తుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. భారీ అప్పులు చేసి ప్రజలపై రుణం భారం మోపడమే లక్ష్యంగా 2024–25 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ సోమవారం అసెంబ్లీకి సమర్పించారు. ఈ ఆర్థిక  ఏడాది ప్రజా రుణం ఏకంగా రూ.91,443 కోట్లుగా బడ్జెట్‌లో పేర్కొన్నారు.   




‘సూపర్‌’.. బాదుడే!  
సూపర్‌ సిక్స్‌లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు చొప్పున భృతి ఇస్తామని చెప్పినప్పటికీ బడ్జెట్‌లో అసలు ఆ విషయాన్నే ప్రస్తావించకుండా యువతను ఎప్పటిలాగానే చంద్రబాబు సర్కారు మోసం చేసింది. రైతులకు పెట్టుబడి సాయం కోసం అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా బడ్జెట్‌లో చెప్పకుండా తూతూ మంత్రంగా రూ.1,000 కోట్లు విదిలించి మసిబూసి మారేడుకాయ చేశారు. 

సూపర్‌ సిక్స్‌లో భాగంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్న హామీ గురించి బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించకుండా మహిళలను దగా చేశారు. స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని సూపర్‌ సిక్స్‌లో చెప్పిన హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది నిర్దిష్టంగా వెల్లడించకుండా వివిధ కార్పొరేషన్ల పేరుతో కొన్ని చోట్ల, జెండర్‌ బడ్జెట్‌లో కొన్ని చోట్ల కేటాయింపులు చేసినట్లు చూపించారు. 

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి పైసా కేటాయింపుల చేయకపోగా త్వరలో అమలు చేస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి కేశవ్‌ ముక్తాయించారు. మరోపక్క విద్యుత్‌ రంగానికి కేటాయింపుల్లో భారీగా కోత విధించారు. 2023–24లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.14,867.18 కోట్లు వ్యయం చేస్తే 2024–25లో సగానికిపైగా కోత విధించి కేవలం రూ.8,155.31 కోట్లను కేటాయించారు. 

అంటే వినియోగదారులపై విద్యుత్‌ చార్జీల భారం పడుతుందని చెప్పకనే కూటమి ప్రభుత్వం చెప్పింది. పేదల ఇళ్ల నిర్మాణాలకు అరకొర నిధుల కేటాయింపుతో సరిపుచ్చారు. 2023–24 లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.6,866 కోట్ల వ్యయం చేయగా 2024–25లో కూటమి ప్రభుత్వం కేవలం రూ.4,012 కోట్లు మాత్రమే కేటాయించింది. 

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ద్వారా భారీ ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. అంటే భూమి విలువలను పెంచడం ద్వారా ప్రజలపై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ రూపంలో ప్రజలపై అదనపు పన్నుల భారం వేయనున్నారు. 2023–24 లో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ శాఖకు రూ.9,542 కోట్లు ఆదాయం రాగా 2024–25లో రూ.13,500 కోట్ల ఆదాయం వస్తుందని బడ్టెట్‌లో పేర్కొన్నారు.  

జగన్‌ ఉండి ఉంటే నేరుగా లబ్ధిదారులకు ఇవి అందేవి 


ఆదాయం, అప్పులు భారీగా.. 
సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు బడ్జెట్‌లో ఆ మాటే గుర్తు లేన్నట్లు వ్యవహరించారు. ప్రభుత్వ రంగంలో పోర్టులు, వైద్య కళాశాలల నిర్మాణం గురించి అసలు ప్రస్తావనే చేయలేదు. మొత్తం మీద పన్నుల రూపంలో భారీ ఆదాయం, భారీ అప్పులతో 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ.32,712 కోట్లుగా పేర్కొన్నారు. ద్రవ్యలోటు రూ.68,742 కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు.

బాబు మేనిఫెస్టోలో హామీలు ఘనం... బడ్జెట్లో కేటాయింపులు శూన్యం
ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు సూపర్‌సిక్స్‌ హామీలతోపాటు మరికొన్ని హామీలు ఘనంగా ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్‌లోనే వాటి అమలుకు పైసా కేటాయించలేదు.

పూర్‌ టు రిచ్‌: పేదలకు సంపన్నులను చేసే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్‌షిప్‌ (పీ4) పథకాలు: అసలు ప్రస్తావనే లేదు.
సౌభాగ్యపథం: చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో రూ.10 లక్షల వరకు సబ్సిడీ: ఈ ఊసే లేదు.

యువత సంక్షేమం 
ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌: దీని గురించి ఎలాంటి ఊసేలేదు
ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు ప్రోత్సాహకాలు: చిల్లిగవ్వ ఇవ్వలేదు
పరీక్షలకు ప్రిపేర్‌ కావడానికి డిజిటల్‌ లైబ్రరీలు: ఈ ప్రస్తావనే లేదు

బీసీ డిక్లరేషన్‌
బీసీ సబ్‌ ప్లాన్‌ ద్వారా రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం: ఆ మేరకు కేటాయింపులు లేదు
దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు: చిన్న మాట కూడా లేదు
స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు వ్యయం: స్పష్టత లేదు.
రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ: కేటాయింపు లేదు
ఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25వేల వేతనం: ఊసే లేదు.
వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం: పైసా లేదు


మహిళా సంక్షేమం
పీ4 మోడల్‌లో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం: ఊసే లేదు.
అంగన్‌వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ: దీని ప్రస్తావన లేదు
ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు: దీని ప్రస్తావన లేదు
విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు: ఒక్క మాట లేదు
ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర హామీలు
ప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్‌: పట్టించుకోలేదులేదు
సీపీఎస్‌/జీపీఎస్‌ విధానాన్ని సమీక్షించి 
అమోదయోగ్యమైన పరిష్కారం: ఆ ప్రసక్తే లేదు

తక్కువ జీతాలు పొందే అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపు: ఊసే లేదు
వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు: సున్నా
కాపుల సంక్షేమానికి ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు: పైసా కేటాయించలేదు  
నూర్‌ బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు ద్వారా ఏటా రూ.100 కోట్లు: పైసా లేదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛన్‌ చొప్పున 20లక్షల మందికి ఏడాదికి రూ.9,600 కోట్లు కేటాయించాలి: ఊసే లేదు
ప్రతి ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్లు, ప్రతి హైవీ లైసెన్సు లారీ, టిప్పర్‌ డ్రైవర్‌కు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం: ఒక రూపాయి కేటాయించలేదు

వ్యవసాయం
ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు: పైసా కేటాయించలేదు 
రాయితీతో సోలార్‌ పంపు సెట్లు: దీని ప్రస్తావనే లేదు
డ్రిప్‌ ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ: ఆ ఊసే లేదు
సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు: లక్ష మంది రైతులు, కిసాన్‌ డ్రోన్లకు 
రూ.342 కోట్లు కావాలి. కానీ కేటాయించింది రూ.187.68 కోట్లు మాత్రమే 

పేదల గృహవసతి
పేదలందరికీ గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, 
గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు: బడ్జెట్‌లో ప్రస్తావన లేదు
ఇప్పటివరకు మంజూరై పట్టాలు పొందిన వారికి 
ప్రభుత్వం ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి: స్పష్టత ఇవ్వలేదు

సాగునీటి రంగం
గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార–నాగావళి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టుల శీఘ్రతర నిర్మాణం: ఆ మేరకు నిధుల కేటాయింపు లేదు
రాయలసీమ, ఉత్తరాంధ్ర పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి: బడ్జెట్‌లో పెద్దగా కేటాయింపులు లేవు. ఈ ప్రాంతాలకు తీవ్ర అన్యాయం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement