సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో నిందితుడు నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా విధించిన షరతులకు అదనంగా ఎలాంటి షరతులు విధించాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎక్కడా బహిరంగ ర్యాలీలు నిర్వహించడం గానీ, అందులో పాల్గొనడం గానీ చేయరాదని చంద్రబాబును హైకోర్టు ఆదేశించింది. అలాగే బహిరంగ సభల్లో కూడా పాల్గొనరాదని స్పష్టం చేసింది.
అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదని కూడా ఆయన్ను ఆదేశించింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులకు అదనంగా తాజా షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కోర్టు షరతులను ఉల్లంఘించకుండా చంద్రబాబు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఇద్దరు డీఎస్పీలను అనుమతించాలన్న సీఐడీ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తెల్లాప్రగడ మల్లికార్జునరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సహేతుక ఆంక్షలే..
స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన చంద్రబాబుకు కంటి శస్త్రచికిత్స నిమిత్తం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విధించిన షరతులకు అదనంగా మరిన్ని షరతులు విధించాలని కోరుతూ సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబుకు కేవలం అరోగ్య పరిస్థితి ఆధారంగానే మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు తాజా ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పునరుద్ఘాటించారు. ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను కస్టోడియల్ బెయిల్‌తో సమానంగా పరిగణించడనికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చారు.
‘చంద్రబాబును చూడకుండా ప్రజలను నియంత్రిస్తూ ఈ కోర్టు ఆదేశాలు జారీ చేయజాలదు. మధ్యంతర బెయిల్ పిటిషన్‌లో చంద్రబాబు ఎక్కడా ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణకు అనుమతినివ్వాలని కోరలేదు. మెడికల్ బెయిల్‌కు అదనంగా బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణకు చంద్రబాబు అనుమతి కోరి ఉంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా ఈ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
మా ముందున్న ఆధారాలను పరిశీలించిన తరువాత రాజకీయ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకుండా చంద్రబాబును ఆదేశించేందుకు ఈ కోర్టు సుముఖత చూపుతోంది. ఇది చంద్రబాబు ప్రాథమిక హక్కులను హరించడం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇది కోర్టు విధిస్తున్న సహేతుక ఆంక్ష మాత్రమే. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో ఈ నెల 31న విధించిన షరతులకు అదనంగా ఈ షరతులు విధిస్తున్నాం’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment