మాట్లాడుతున్న మంత్రి చెరుకువాడ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాల అమలుకు అధిక ప్రాధాన్యతివ్వాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు అధికారులను ఆదేశించారు. 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లు (గృహ నిర్మాణం), గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లతో మంగళవారం విజయవాడలోని గృహనిర్మాణ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ తొలి దశలో నిర్మిస్తోన్న ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన పనులను తక్షణం మొదలు పెట్టాలని ఆదేశించారు. ఆప్షన్–? ఎంచుకున్న లబ్ధిదారుల గృహాల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని సూచించారు.
కాలనీలలో అంతర్గత రహదారుల నిర్మాణం, ఇళ్లు నిర్మించుకోవడానికి నీటి వసతి కల్పించాలని సూచించారు. 25 మంది లబ్ధిదారుల చొప్పున గ్రూపులు ఏర్పాటు చేసి, ఇళ్ల నిర్మాణాలకు స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్‌లకు అప్పగించాలన్నారు. లేఅవుట్‌లకు 20 కిలో మీటర్ల లోపు ఇసుక రీచ్‌లు ఉండే విధంగా చూడాలని చెప్పారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఉచితంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందని, ఈ నెల 21 నుంచి సీఎం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దొరబాబు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, సీఎం అదనపు కార్యదర్శి ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment