తండ్రి మృతదేహం వద్ద అమాయకంగా చిన్నారులు, మృతుడు రామకృష్ణ (ఫైల్)
సాక్షి,పెద్ద తిప్పసముద్రం(అన్నమయ్య జిల్లా): ‘మంచంపైన నాన్నను పడుకోబెట్టారు.. అందరూ పూల దండలు వేస్తూ నాన్నకు నమస్కరిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్లంతా బోరున విలపిస్తున్నారు. అసలు ఏం జరిగింది నాన్నకు. అమ్మను అడుగుదామంటే అమ్మ ఎవరో కూడా గుర్తు లేదు. అసలు ఎక్కడుందో తెలియదు.. అమ్మ ప్రేమకు దూరమైన ఆ చిన్నారులు నాన్న శవం వద్ద నిలబడి బిక్క చూపులు చూస్తుంటే ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదురా దేవుడా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు’.
ఈ హృదయ విదారక సంఘటన మండలంలోని సంపతికోట పంచాయతీ ముంతపోగులవారిపల్లిలో జరిగింది. వివరాలిలా.. బూర్లపల్లి రామకృష్ణ (37), నాగరత్న దంపతులు. వీరికి మోహన్ (9), చరణ్ (7)లు సంతానం. కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. చిన్న కుమారుడు చరణ్‌కు ఆరు నెలల వయసు ఉన్నప్పుడే నాగరత్న భర్త, పిల్లలను వదిలి కర్నాటక రాష్ట్రం కంచార్లపల్లి వద్ద ఉన్న నందగామలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పిల్లలను తండ్రితో పాటు అవ్వా, తాతలైన నారెప్ప, వెంకటలక్ష్మిలు కంటికి రెప్పలా చూసుకునేవారు.
ఈ నేపథ్యంలో ఐదు నెలల క్రితం రామకృష్ణ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఆసుపత్రిలో చూపించారు. రెండు కిడ్నీలు పాడైనట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి మదనపల్లిలో డయాలసిస్ చేయించుకునేవాడు. మూడు నెలల క్రితం తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి గ్రామంలో పర్యటించినప్పుడు తన దయనీయ స్థితిని చెప్పుకోగా స్పందించిన ఎమ్మెల్యే నెలకు రూ.10 వేల పింఛన్‌ను మంజూరు చేయించారు. ఇంతలోనే పరిస్థితి విషమించి సోమవారం రాత్రి రామకృష్ణ మృతి చెందాడు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. అటు తల్లి ప్రేమకు నోచుకోక.. ఇటు నాన్న తోడు దూరమై అనాథలుగా మారిన ఆ చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment