Pedda thippa samudram
-
ఆవు కంటికి క్యాన్సర్... శస్త్ర చికిత్స చేసిన వైద్యులు
పెద్దతిప్పసముద్రం: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని కందుకూరుకు చెందిన బుడ్డాబాబు అనే రైతుకు చెందిన పాడి ఆవు కంటికి క్యాన్సర్ సోకడంతో పశువైద్య నిపుణులు గురువారం శస్త్రచికిత్స చేశారు. తన ఆవుకు మూడు నెలల కిందట కంటి భాగంలో గాయం కావడంతో స్థానిక పశు వైద్యశాలలో బుడ్డా బాబు పరీక్షలు చేయించాడు. కంటికి గ్రోత్ క్యాన్సర్ సోకినట్లు డాక్టర్ రమేష్ నిర్ధారించారు. ఆ తర్వాత ఆవు కంట్లోని గాయం గడ్డలా మారి చూపు పూర్తిగా మందగించింది. క్యాన్సర్ మెదడుకు సోకకుండా ఉండేందుకు డాక్టర్ రమేష్ ప్రత్యేక చొరవ తీసుకుని పెద్దమండ్యం మండలంలో పని చేసే వెటర్నరీ డాక్టర్ విక్రంరెడ్డి, మదనపల్లిలో పని చేస్తున్న ట్రైనీ డాక్టర్ లోకేష్‌లతో కలిసి ఆవుకు శస్త్ర చికిత్స నిర్వహించి కంటిలోని క్యాన్సర్ కణజాలాన్ని తొలగించారు. -
హృదయ విదారకం.. చెదిరిన కల.. అనాథలుగా ఇలా!
సాక్షి,పెద్ద తిప్పసముద్రం(అన్నమయ్య జిల్లా): ‘మంచంపైన నాన్నను పడుకోబెట్టారు.. అందరూ పూల దండలు వేస్తూ నాన్నకు నమస్కరిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్లంతా బోరున విలపిస్తున్నారు. అసలు ఏం జరిగింది నాన్నకు. అమ్మను అడుగుదామంటే అమ్మ ఎవరో కూడా గుర్తు లేదు. అసలు ఎక్కడుందో తెలియదు.. అమ్మ ప్రేమకు దూరమైన ఆ చిన్నారులు నాన్న శవం వద్ద నిలబడి బిక్క చూపులు చూస్తుంటే ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదురా దేవుడా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు’. ఈ హృదయ విదారక సంఘటన మండలంలోని సంపతికోట పంచాయతీ ముంతపోగులవారిపల్లిలో జరిగింది. వివరాలిలా.. బూర్లపల్లి రామకృష్ణ (37), నాగరత్న దంపతులు. వీరికి మోహన్ (9), చరణ్ (7)లు సంతానం. కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. చిన్న కుమారుడు చరణ్‌కు ఆరు నెలల వయసు ఉన్నప్పుడే నాగరత్న భర్త, పిల్లలను వదిలి కర్నాటక రాష్ట్రం కంచార్లపల్లి వద్ద ఉన్న నందగామలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పిల్లలను తండ్రితో పాటు అవ్వా, తాతలైన నారెప్ప, వెంకటలక్ష్మిలు కంటికి రెప్పలా చూసుకునేవారు. ఈ నేపథ్యంలో ఐదు నెలల క్రితం రామకృష్ణ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఆసుపత్రిలో చూపించారు. రెండు కిడ్నీలు పాడైనట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి మదనపల్లిలో డయాలసిస్ చేయించుకునేవాడు. మూడు నెలల క్రితం తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి గ్రామంలో పర్యటించినప్పుడు తన దయనీయ స్థితిని చెప్పుకోగా స్పందించిన ఎమ్మెల్యే నెలకు రూ.10 వేల పింఛన్‌ను మంజూరు చేయించారు. ఇంతలోనే పరిస్థితి విషమించి సోమవారం రాత్రి రామకృష్ణ మృతి చెందాడు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. అటు తల్లి ప్రేమకు నోచుకోక.. ఇటు నాన్న తోడు దూరమై అనాథలుగా మారిన ఆ చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
చిన్న దొంగ అనుకుంటే.. పెద్ద ‘చేప’ దొరికింది
సాక్షి, పెద్దతిప్పసముద్రం(చిత్తూరు) : ఓ వ్యక్తి నకిలీ ఫారెస్టు అధికారి అవతారమెత్తాడు. మాయమాటలతో ఓ వ్యక్తి నుంచి కొంత నగదు గుంజుకుని మోటార్ సైకిల్లో పరారయ్యాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రాథమిక విచారణలో అతడిపై జిల్లాలో 25 కేసులు నమోదైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తేలడంతో పోలీసులు పెద్ద చేపనే పట్టామని సంబరపడ్డారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు సోమవారం తెలిపిన వివరాలు..పీలేరు మండలం తానా వడ్డిపల్లెకు చెందిన వెంకట్రమణ కుమారుడు వేమల విశ్వనాథ్ (28) చిన్నప్పటి నుంచి జులాయిగా తిరుగుతూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. 2004 నుంచి జిల్లాలో పలు చోట్ల జరిగిన దొంగతనాలు, హత్యలు, చీటింగ్, చోరీలు..ఇలా మొత్తం 25 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పీలేర్ స్టేషన్లో ఇతనిపై కేడీ షీట్ కూడా తెరిచారు. ఓ కేసులో 20 రోజుల క్రితం జైలుశిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం మండలంలోని పులికల్లుకు వచ్చి తాను ములకలచెరువు మండలంలో ఫారెస్టు అధికారినని, సమీప పొలాల్లో కుక్కల దాడిలో ఓ జింక చనిపోయిందని తనకు ఫోన్ ద్వారా సమాచారం రావడంతో ఇక్కడకు వచ్చానని, ద్విచక్ర వాహనం ఇస్తే ఘటనా స్థలానికి వెళ్లి వస్తానని శ్రీకాంత్ అనే గ్రామస్తుడిని నమ్మించాడు. అటవీ అధికారే కదా? అని అపరిచితునికి బైక్ (ఏపీ 03 బిజె 5929 పల్సర్) ఇచ్చాడు. అతని సెల్ నంబర్ కూడా ఇచ్చాడు. గంట అనంతరం తిరిగి బైక్‌తో విశ్వనాథ్ వచ్చాడు. అనంతరం మాటా మాటా కలిపాడు. టమాట పంటకు ఉపయోగించే కట్టెలు తాము సీజ్ చేసి స్టేషన్లో నిల్వ ఉంచామని, నాలుగు ట్రాక్టర్ లోడుల కట్టెలు రూ.15 వేలకు ఇస్తామని నమ్మించాడు. అనంతరం తమ ఉన్నతాధికారి నుంచి ఫోన్ వచ్చిందని బైక్‌లో వెళ్లి తీసుకువస్తానని నమ్మబలికి నగదు తీసుకున్నాడు. దీంతో పాటు అతడి ద్విచక్రవాహనంతో జంప్ అయ్యాడు. వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానించిన శ్రీకాంత్ ములకలచెరువు అటవీ శాఖ అధికారులను సంప్రదిస్తే అలాంటి వ్యక్తి ఇక్కడెవరూ పనిచేయడం లేదని చెప్పడంతో కంగుతిన్నాడు. తాను మోసపోయానని గ్రహించాడు. అనంతరం పీటీఎం ఎస్ఐకు ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ తక్షణం ఒక పోలీస్ బృందాన్ని రంగంలోకి దింపి నిందితుని కోసం ముమ్మరంగా గాలించాడు. నిందితుడి సెల్ నంబర్ ఆధారంగా అతడు ఎక్కడున్నాడో గుర్తించి 24 గంటల్లోనే నిందితుడిని పీలేరు వద్ద అరెస్టు చేశారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే బైక్ రూపురేఖలు కొంతవరకు మార్చేసినట్లు గుర్తించాఉ. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని తంబళ్లపల్లె కోర్టుకు హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు. ప్రధానంగా పీలేరుకు చెందిన ఓ వివాహితతో కొంతకాలం వివాహేతర సంబంధం కొనసాగించి, ఆ తర్వాత ఆమెను నుంచి నగలు, డబ్బు కాజేసి, వ్యూహం ప్రకారం భాకరాపేట అడవిలో ఆమెను హతమార్చిన కేసు ఇతడిపై నమోదై ఉంది. నిందితుడిని పట్టుకోవడంలో ఏఎస్ఐ వెంకటస్వామితో పాటు కృషి చేసిన సిబ్బంది వేణు, మునికుమార్ నాయక్, ఇబ్రహీంను ఎస్ఐ అభినందించారు. -
గతం గుర్తుకు రావడంతో 15 ఏళ్ల అనంతరం..
పెద్దతిప్పసముద్రం (చిత్తూరు జిల్లా): ఎప్పుడో 15 ఏళ్ల కింద మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇన్నేళ్లు అనాథాశ్రమంలో గడిపాడు. గతం గుర్తుకు రావడంతో ఇప్పుడు తిరిగి వచ్చాడు. దీంతో ఆ కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలోని టీ సదుం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మీ నరసమ్మకు కర్ణాటక రాష్ట్రం రాచ్చెరువు సమీపంలోని గడ్డంపల్లికి చెందిన సుబ్బయ్యతో 40 ఏళ్ళ క్రితం వివాహమైంది. వీరికి నరసింహమూర్తి, మంజునాథ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మీనరసమ్మ నిత్యం అనారోగ్యంతో బాధపడుతుండడం, పుట్టిన ఇద్దరు కుమారుల మానసిక స్థితి సక్రమంగా లేదన్న కారణంతో సుబ్బయ్య భార్య, పిల్లలను వదిలేసి మరో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వీరందరి ఆలనా, పాలన అవ్వ లక్ష్మిదేవమ్మ చూసుకునేది. అయితే పెద్ద మనవడు నరసింహమూర్తికి మతిస్థిమితం సక్రమంగా లేకపోవడంతో 13 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఇంటి నుంచి ఎటో వెళ్ళిపోయాడు. ముందే వచ్చినా గందరగోళంతో మళ్లీ వెనక్కి.. కొన్నాళ్ల క్రితం ఆరోగ్యం కుదుటపడి గత సంఘటనలు గుర్తుకు రావడంతో ఎలాగోలా సొంతూరికి చేరుకున్నాడు. అయితే తను వెళ్లిపోయిన నాటికి ఊరి చివర లేని పెట్రోలు బంకు ఇప్పుడు కనిపించడంతో గందరగోళానికి గురై కర్నాటకలోని చింతామణికి చేరుకున్నాడు. అక్కడికి ఉపాధి కోసం తన ఊరి వారు కనిపించడంతో వారికి తన కథ వివరించాడు. వారు అతన్ని వారి ఇంటికి తీసుకువచ్చి నాలుగు రోజుల క్రితం వదిలిపెట్టారు. తప్పిపోయాడనుకున్న నరసింహమూర్తి ఇన్నేళ్లకు తిరిగిరావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆనందంతో తబ్బిబ్బయ్యారు. తాను ఇన్నాళ్లు కేరళలోని ఓ అనాథ శరణాలయంలో గడిపానని వివరించాడు. మంగళవారం నరసింహమూర్తి రేషన్ కార్డు, ఆధార్, ఓటరు కార్డు నమోదు చేయించేందుకు అమ్మమ్మ లక్ష్మిదేవమ్మతో కలసి ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చాడు. -
టీడీపీ నేతల దాడి.. వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
చిత్తూరు: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతల దౌర్జన్యం తారాస్థాయికి చేరింది. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసేందుకు టీడీపీ నేతలు ఏమాత్రం వెనకాడటం లేదు. తంబళ్లపల్లి నియోజవర్గం పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుంలో టీడీపీ నేతల రాళ్ల దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకరు మృతిచెందారు. మృతుడు వెంకటరమణారెడ్డిగా గుర్తించారు. పోలింగ్ బూత్‌లో ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీ నేతలను అడ్డుకోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యుదాఘాతానికి రైతు బలి
పెద్దతిప్ప సముద్రం (చిత్తూరు) : వ్యవసాయ బావి వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ఫ్యూజ్ వేయడానికి ప్రయత్నించిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం బూచిపల్లి వద్ద సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహా రెడ్డి(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం పొలం వద్ద కరెంట్ సరఫరా నిలిచి పోవడంతో..ఫ్యూజ్ వేయడానికి ప్రయత్నిస్తూ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీగంధం దుంగలు పట్టివేత
పెద్దతిప్పసముద్రం (చిత్తూరు) : కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న శ్రీగంధం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం గుండ్లపల్లి సమీపంలో శుక్రవారం పోలీసులు వాహన సోదాలు ప్రారంభించారు. అదే సమయంలో ఒక ద్విచక్ర వాహనంలో దాచి ఉంచిన 28 కిలోల శ్రీగంధం దుంగలను గుర్తించారు. వాహనంతోపాటు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ హృషికేశ్ తెలిపారు.