సాక్షి, పెద్దతిప్పసముద్రం(చిత్తూరు) : ఓ వ్యక్తి నకిలీ ఫారెస్టు అధికారి అవతారమెత్తాడు. మాయమాటలతో ఓ వ్యక్తి నుంచి కొంత నగదు గుంజుకుని మోటార్ సైకిల్‌లో పరారయ్యాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రాథమిక విచారణలో అతడిపై జిల్లాలో 25 కేసులు నమోదైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తేలడంతో పోలీసులు పెద్ద చేపనే పట్టామని సంబరపడ్డారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సోమవారం తెలిపిన వివరాలు..పీలేరు మండలం తానా వడ్డిపల్లెకు చెందిన వెంకట్రమణ కుమారుడు వేమల విశ్వనాథ్ (28) చిన్నప్పటి నుంచి జులాయిగా తిరుగుతూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. 2004 నుంచి జిల్లాలో పలు చోట్ల జరిగిన దొంగతనాలు, హత్యలు, చీటింగ్, చోరీలు..ఇలా మొత్తం 25 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
పీలేర్ స్టేషన్‌లో ఇతనిపై కేడీ షీట్ కూడా తెరిచారు. ఓ కేసులో 20 రోజుల క్రితం జైలుశిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం మండలంలోని పులికల్లుకు వచ్చి తాను ములకలచెరువు మండలంలో ఫారెస్టు అధికారినని, సమీప పొలాల్లో కుక్కల దాడిలో ఓ జింక చనిపోయిందని తనకు ఫోన్ ద్వారా సమాచారం రావడంతో ఇక్కడకు వచ్చానని, ద్విచక్ర వాహనం ఇస్తే ఘటనా స్థలానికి వెళ్లి వస్తానని శ్రీకాంత్ అనే గ్రామస్తుడిని నమ్మించాడు. అటవీ అధికారే కదా? అని అపరిచితునికి బైక్ (ఏపీ 03 బిజె 5929 పల్సర్) ఇచ్చాడు. అతని సెల్ నంబర్ కూడా ఇచ్చాడు. గంట అనంతరం తిరిగి బైక్‌తో విశ్వనాథ్ వచ్చాడు. అనంతరం మాటా మాటా కలిపాడు. టమాట పంటకు ఉపయోగించే కట్టెలు తాము సీజ్ చేసి స్టేషన్‌లో నిల్వ ఉంచామని, నాలుగు ట్రాక్టర్ లోడుల కట్టెలు రూ.15 వేలకు ఇస్తామని నమ్మించాడు.
అనంతరం తమ ఉన్నతాధికారి నుంచి ఫోన్ వచ్చిందని బైక్‌లో వెళ్లి తీసుకువస్తానని నమ్మబలికి నగదు తీసుకున్నాడు. దీంతో పాటు అతడి ద్విచక్రవాహనంతో జంప్ అయ్యాడు. వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానించిన శ్రీకాంత్ ములకలచెరువు అటవీ శాఖ అధికారులను సంప్రదిస్తే అలాంటి వ్యక్తి ఇక్కడెవరూ పనిచేయడం లేదని చెప్పడంతో కంగుతిన్నాడు. తాను మోసపోయానని గ్రహించాడు. అనంతరం పీటీఎం ఎస్‌ఐకు ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ తక్షణం ఒక పోలీస్ బృందాన్ని రంగంలోకి దింపి నిందితుని కోసం ముమ్మరంగా గాలించాడు.
నిందితుడి సెల్ నంబర్ ఆధారంగా అతడు ఎక్కడున్నాడో గుర్తించి 24 గంటల్లోనే నిందితుడిని పీలేరు వద్ద అరెస్టు చేశారు. బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే బైక్ రూపురేఖలు కొంతవరకు మార్చేసినట్లు గుర్తించాఉ. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని తంబళ్లపల్లె కోర్టుకు హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు. ప్రధానంగా పీలేరుకు చెందిన ఓ వివాహితతో కొంతకాలం వివాహేతర సంబంధం కొనసాగించి, ఆ తర్వాత ఆమెను నుంచి నగలు, డబ్బు కాజేసి, వ్యూహం ప్రకారం భాకరాపేట అడవిలో ఆమెను హతమార్చిన కేసు ఇతడిపై నమోదై ఉంది. నిందితుడిని పట్టుకోవడంలో ఏఎస్‌ఐ వెంకటస్వామితో పాటు కృషి చేసిన సిబ్బంది వేణు, మునికుమార్ నాయక్, ఇబ్రహీంను ఎస్‌ఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment