అమ్మమ్మతో కలసి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన నరసింహమూర్తి
పెద్దతిప్పసముద్రం (చిత్తూరు జిల్లా): ఎప్పుడో 15 ఏళ్ల కింద మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇన్నేళ్లు అనాథాశ్రమంలో గడిపాడు. గతం గుర్తుకు రావడంతో ఇప్పుడు తిరిగి వచ్చాడు. దీంతో ఆ కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలోని టీ సదుం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మీ నరసమ్మకు కర్ణాటక రాష్ట్రం రాచ్చెరువు సమీపంలోని గడ్డంపల్లికి చెందిన సుబ్బయ్యతో 40 ఏళ్ళ క్రితం వివాహమైంది. వీరికి నరసింహమూర్తి, మంజునాథ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మీనరసమ్మ నిత్యం అనారోగ్యంతో బాధపడుతుండడం, పుట్టిన ఇద్దరు కుమారుల మానసిక స్థితి సక్రమంగా లేదన్న కారణంతో సుబ్బయ్య భార్య, పిల్లలను వదిలేసి మరో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వీరందరి ఆలనా, పాలన అవ్వ లక్ష్మిదేవమ్మ చూసుకునేది. అయితే పెద్ద మనవడు నరసింహమూర్తికి మతిస్థిమితం సక్రమంగా లేకపోవడంతో 13 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఇంటి నుంచి ఎటో వెళ్ళిపోయాడు.
ముందే వచ్చినా గందరగోళంతో మళ్లీ వెనక్కి..
కొన్నాళ్ల క్రితం ఆరోగ్యం కుదుటపడి గత సంఘటనలు గుర్తుకు రావడంతో ఎలాగోలా సొంతూరికి చేరుకున్నాడు. అయితే తను వెళ్లిపోయిన నాటికి ఊరి చివర లేని పెట్రోలు బంకు ఇప్పుడు కనిపించడంతో గందరగోళానికి గురై కర్నాటకలోని చింతామణికి చేరుకున్నాడు. అక్కడికి ఉపాధి కోసం తన ఊరి వారు కనిపించడంతో వారికి తన కథ వివరించాడు. వారు అతన్ని వారి ఇంటికి తీసుకువచ్చి నాలుగు రోజుల క్రితం వదిలిపెట్టారు. తప్పిపోయాడనుకున్న నరసింహమూర్తి ఇన్నేళ్లకు తిరిగిరావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆనందంతో తబ్బిబ్బయ్యారు. తాను ఇన్నాళ్లు కేరళలోని ఓ అనాథ శరణాలయంలో గడిపానని వివరించాడు. మంగళవారం నరసింహమూర్తి రేషన్ కార్డు, ఆధార్, ఓటరు కార్డు నమోదు చేయించేందుకు అమ్మమ్మ లక్ష్మిదేవమ్మతో కలసి ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment