తిరుమల: తిరుమల నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఓ చిరుత పులి బాలుడిపై దాడి చేసింది. తన తాతతో కలిసి అక‍్కడే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది.
వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరుగులు తీశారు. టార్చ్‌లు వేస్తూ, రాళ్లు విసరడంతో 7వ మైలు కంట్రోల్ రూం వద్ద చిరుత బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది. చిరుత దాడి నుంచి బాబును అక్కడి భద్రతా సిబ్బంది రక్షించినట్టు సమాచారం.
గాయాల పాలైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని ప్రాంతాల్లో చిరుత దంతపు గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన బాలుడు కర్నూలు జిల్లా ఆదోని వాసి కౌషిక్(3)గా గుర్తింపు.
జరిగిన విషయం తెలియడంతో టిటిడి ఈవో ధర్మారెడ్డి బాలుడిని పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ధర్మారెడ్డి సూచించారు.
చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతామన్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. స్విమ్స్‌కు చెందిన న్యూరో స్పెషలిస్ట్లు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారని ధర్మారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment