
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ దూకుడును గురువారం మరింతగా పెంచింది. చందాదారుల సొమ్ము నిబంధనలకు విరుద్ధంగా మళ్లింపు, అక్రమ డిపాజిట్ల వ్యవహారాల్లో ఏ1 చెరుకూరి రామోజీ రావు, ఏ 2 చెరుకూరి శైలజాకిరణ్‌కు సహాయకారిగా వ్యవహరించిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏడుగురు కీలక అధికారుల విచారణ చేపట్టింది.
ఈ అధికారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏపీలోని చందాదారుల నిధుల అక్రమ మళ్లింపులో సాధనంలా వ్యవహరించారు. నిధుల మళ్లింపునకు చెక్‌పవర్ కలిగిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని వైస్ ప్రెసిడెంట్‌లు సీహెచ్ సాంబమూర్తి, రాజాజీ, పి.మల్లికార్జున రావు, ఫైనాన్స్ డైరెక్టర్ వెంకట స్వామి, ఫైనాన్స్ జనరల్ మేనేజర్ టి.హరగోపాల్, జనరల్ మేనేజర్లు ఎల్.శ్రీనివాసరావు, జె.శ్రీనివాసరావును విచారించి ముఖ్యమైన ఆధారాలను రాబట్టినట్టు సమాచారం. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం ప్రకారం సంబంధిత బ్రాంచి మేనేజర్ (ఫోర్‌మెన్)కు చెక్ పవర్ ఉండాలి.
కానీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో బ్రాంచి మేనేజర్లకు రూ.500 వరకు మాత్రమే చెక్ పవర్‌ను పరిమితం చేయడం గమనార్హం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్‌తో పాటు మరో 11 మందికి నిబంధనలకు విరుద్ధంగా చెక్ పవర్ కేటాయించి నిధుల అక్రమ బదిలీకి పాల్పడ్డారు. అందులో ప్రధాన భూమిక పోషించిన ఈ ఏడుగురిని విచారించి కీలక ఆధారాలు రాబట్టడంతో పాటు వారి స్టేట్‌మెంట్ సీఐడీ నమోదు చేసుకుంది.
ఇది కూడా చదవండి: మార్గదర్శి కేసులో ట్విస్ట్.. రామోజీకి బిగుస్తున్న ఉచ్చు!