
సాక్షి, అమరావతి: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) తదితర అత్యున్నత స్థాయి పోస్టులకు అర్హుల ఎంపికకు సంబంధించిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 10వ తేదీన జరగనుంది. ఈ పరీక్షను జూలై 27వ తేదీన నిర్వహించాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మూడు నెలల పాటు వాయిదా వేసి అక్టోబర్ 10న నిర్వహిస్తోంది. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సీశాట్‌గా ఉదయం, మధ్యాహ్నం ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్ 10వ తేదీ వరకు అభ్యర్థులు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, తిరుపతి పట్టణాల్లో 68 సెంటర్లలో ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. ప్రతి ఒక్క అభ్యర్థి కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు వివిధ పరిశీలన ప్రక్రియలు నిర్వహించాల్సి ఉన్నందున నిర్ణీత సమయానికి పది నిమిషాల ముందే పరీక్ష కేంద్రం ప్రధాన ప్రవేశ ద్వారాన్ని మూసివేయనున్నారు. బ్యాగులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి ఇతర వస్తువులు వేటినీ లోపలకు అనుమతించరు.
కోవిడ్ కారణంగా పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేకపోతున్న కారణంగా వయోపరిమితి దాటిపోయే అభ్యర్థుల విషయంలో సుప్రీంకోర్టు సూచనల మేరకు యూపీఎస్సీ వారికి ఈ సారి పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పరీక్షల ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో 400 మార్కులకు ఉంటుంది. పేపర్, పెన్ను (ఆఫ్‌లైన్ మోడ్)లతో ఈ పరీక్షలు జరుగుతాయి. నెగిటివ్ మార్కుల విధానాన్ని అమలు చేస్తారు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.66 మార్కు కోతపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment