రాష్ట్రం నుంచి డ్రగ్స్ రవాణా అవుతున్నాయట!
సాక్షి, అమరావతి : తెలంగాణ ప్రభుత్వంతో చర్చల పేరుతో వీసమెత్తు ప్రయోజనాన్ని కూడా సాధించలేకపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లో ఆంధ్రా ప్రజల పరువు తీశారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం సంగతి అటుంచితే అసలు రాష్ట్రంలో పెద్దగా లేని డ్రగ్స్.. ఏపీలోనే ఉత్పత్తి అవుతున్నట్లు ఒప్పుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు బృందం తెలంగాణ రాష్ట్రంతో చర్చించేందుకు వెళ్లిన ఉద్ధేశం ఏమిటి? చివరికి ఏం సాధించారు? వంటి ప్రశ్నలు సాధారణ ప్రజలు నుంచి వస్తున్నాయి. ఒక్క విభజన సమస్య గురించి కూడా గట్టిగా మాట్లాడకుండా డ్రగ్స్ గురించి చర్చించడం, హైదరాబాద్‌లో ఉన్న డ్రగ్స్ దందా అంతటికీ ఏపీయే మూలమని స్వయంగా అంగీకరించడం విడ్డూరం. టీడీపీ రెండు రోజుల నుంచి రెండు రాష్ట్రాల మధ్య చర్చలు పేరుతో నానా హడావుడి చేసింది రాష్ట్రం పరువు తీసేందుకేనా అనే చర్చ మొదలైంది.
బాబు గురించి అంత బిల్డప్ ఇచ్చింది ఇందుకేనా?
విభజన సమస్యల పరిష్కారానికి చంద్రబాబు చొరవ తీసుకని తన శిష్యుడిగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చర్చలకు వెళుతున్నారని, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని టీడీపీ శ్రేణులు ఊదరగొట్టాయి. ఎల్లో మీడియా అయితే చంద్రబాబు దార్శనికత, సుదీర్ఘ అనుభవంతో రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారంటూ బీభత్సమైన బిల్డప్ ఇచ్చింది. కానీ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన నెలకొన్న ప్రధాన సమస్యల గురించి లోతుగా చర్చించలేదు.
హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్న డ్రగ్స్‌పై, అక్కడ డ్రగ్స్ సంస్కృతి పెరగడానికి ఏపీలో గంజాయి ఉత్పత్తి అవడమే కారణమని చర్చించడం విస్మయ పరుస్తోంది. స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉమ్మడి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఒప్పుకోవడం దారుణం అని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేరుగా ఏపీ పేరు చెప్పకుండా సరిహద్దు రాష్ట్రాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయని చెప్పగా, టీడీపీ మంత్రి అనగాని మాత్రం ఏపీలో డ్రగ్స్ ఉత్పత్తి అయి హైదరాబాద్‌కి వస్తున్నాయని.. తమ రాష్ట్రంలో 8వ తరగతి పిల్లల స్కూల్ బ్యాగులో గంజాయి దొరుకుతోందని చెప్పి రాష్ట్రం పరువును తెలంగాణ రాష్ట్ర బజారులో నిలబెట్టారు.
హైదరాబాద్ డ్రగ్ సంస్కృతికి ఏపీకి సంబంధం ఏమిటి?
హైదరాబాద్ డ్రగ్ కల్చర్‌కి, ఏపీలో అక్కడక్కడా దొరుకుతున్న గంజాయికి సంబంధమే లేదని అనేకసార్లు తేటతెల్లమైంది. హైదరాబాద్‌లో కొకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ విరివిగా దొరుకుతాయి. ఏపీలో వాటి జాడే లేదు. కొకైన్, హెరాయిన్ వంటి విదేశాల నుంచి దిగుమతయ్యే డ్రగ్స్ కూడా ఏపీ నుంచే వస్తున్నాయని స్వయంగా మంత్రి చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో గంజాయి పెరిగిందని ఎప్పటి నుంచో చేస్తున్న దుష్ప్రచారాన్నే పక్క రాష్ట్రంతో చర్చల్లో కూడా వల్లె వేయడం రాజకీయ స్వప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో గంజాయి ఉందని చెప్పడం.. పక్క రాష్ట్రంలోని వేదికపై అంగీకరించడం ఆత్మహత్యాసదృశంగా మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని మూసీలో కలిపేసిన చంద్రబాబు
చర్చల ద్వారా ఏపీకి సంబంధించి ఎటువంటి సానుకూలత సాధించలేకపోగా, మన గౌరవానికి భంగం కలిగించేలా చంద్రబాబు, ఆయన మంత్రుల బృందం వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఏపీలోని పోర్టులు, టీటీడీ ఆస్తుల్లో వాటా ఇవ్వాలని, పోలవరం విలీన గ్రామాలను తిరిగి ఇచ్చేయాలని తెలంగాణ పెట్టిన డిమాండ్లపైనా నోరు మెదపక పోవడం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినట్లేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రేవంత్‌రెడ్డి, చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తప్ప రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఈ చర్చలు జరిగినట్లు ఎక్కడా కనిపించలేదంటున్నారు. అందులోనూ రేవంత్ పైచేయి సాధించి ఏపీ నెత్తిన డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నారనే అపవాదు మోపారు. దీనికి అంగీకరించిన చంద్రబాబు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని హైదరాబాద్ మూసీ నదిలో కలిపేశారనే సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
గంజాయి దందాపై గత సర్కారు ఉక్కుపాదం
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించాలని అప్పటి సీఎం వైఎస్ జగన్ పోలీసు యంత్రాంగాన్ని విస్పష్టంగా ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను నెలకొల్పి విస్తృత అధికారాలు కల్పించారు. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ పరివర్తన్’ అనే కార్యక్రమం ద్వారా గంజాయి సాగు వల్ల అనర్థాలపై ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో విస్తృత అవగాహన కల్పించారు. ఆ తర్వాత శాటిలైట్ ఫొటోలతో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు పాంత్రాన్ని జీయో మ్యాపింగ్ చేశారు.
ప్రత్యేక యంత్రాలతో రెండు దశల్లో ఏకంగా 11,550 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఏకంగా 4.50 కోట్ల గంజాయి మొక్కలను తొలగించి దహనం చేశారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, ఇతర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. మొత్తం 4.50 లక్షల కేజీల గంజాయి, 131 లీటర్ల ద్రవ రూప గంజాయిని స్వాధీనం చేసుకుంది. 13,210 మందిని అరెస్ట్ చేయడంతోపాటు 2,950 వాహనాలను జప్తు చేసింది. గిరిజనులకు ప్రత్నామ్నాయం చూపింది.
రూ.144కోట్లతో ఆపరేషన్ నవోదయం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. వివిధ పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. కాగా, గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్ఛగా కొనసాగింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన టీడీపీ కీలక నేతలు నర్సీపట్నం కేంద్రంగా గంజాయిసిండికేట్‌ను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment