
Time: 08:57 PM
ఐఎన్‌ఎస్ చోళ గెస్ట్‌హౌస్‌లో ప్రధాని బస
విశాఖ మారుతి జంక్షన్ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. 1.5 కిలోమీటర్ల మేర రోడ్‌షోలో ప్రధాని పాల్గొన్నారు. విశాఖ ఐఎన్‌ఎస్ చోళ గెస్ట్‌హౌస్‌కు ప్రధాని చేరుకున్నారు. రాత్రికి అక్కడ బస చేస్తారు.
Time: 08:13 PM
ప్రధానికి ఘన స్వాగతం
ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి విడదల రజిని స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని.. చోళ (నౌకా దళానికి చెందిన గెస్ట్ హౌస్)కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు(శనివారం) ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ నిర్వహంచనున్నారు. ప్రధాని మోదీ సభావేదికపై గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాత్రమే ఉంటారు. రేపటి సభలో 40 నిమిషాల పాటు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
Time: 08:06 PM
విశాఖ ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ చేరుకున్నారు.
Time: 07:21 PM
కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ
కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. ప్రధానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలకనున్నారు.
Time: 06:55 PM
విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కాసేపట్లో విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ రానున్నారు. ప్రధానికి సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు.
Time: 05:44 PM
విశాఖ బయల్దేరిన సీఎం వైఎస్ జగన్
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం బయల్దేరారు. ప్రధాని మోదీకి సీఎం స్వాగతం పలకనున్నారు. ఇవాళ, రేపు(శనివారం) పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.
సాక్షి, విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖకు రానున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధానితో కలిసి సీఎం పాల్గొననున్నారు. రూ.7,614 కోట్లతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.7,619 కోట్లతో పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు
ప్రధాని మోదీ పర్యటన సాగేదిలా..
11వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు మధురై విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 7.25 గంటలకు విశాఖ పాత విమానాశ్రయం ఐఎన్‌ఎస్ డేగకు చేరుకుంటారు. తర్వాత చోళ (నౌకా దళానికి చెందిన గెస్ట్ హౌస్)కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. 12వ తేదీ ఉదయం 10.10 గంటలకు చోళ నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌లో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం 9 అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొని తిరుగు ప్రయాణమవుతారు.
సీఎం జగన్ పర్యటన సాగేదిలా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం 6.35 గంటలకు విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగకు చేరుకుని, ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రికి పోర్ట్ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం ప్రధానికి వీడ్కోలు పలికి.. తిరిగి తాడేపల్లిలోని నివాసానికి బయలుదేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment