Andhra Pradesh: బలంగా బడి పునాదులు | Cm Jagan Conducts Review Meeting On Schools | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: బలంగా బడి పునాదులు

Published Fri, May 28 2021 4:38 AM | Last Updated on Fri, May 28 2021 8:09 AM

Cm Jagan Conducts Review Meeting On Schools - Sakshi

సాక్షి, అమరావతి: ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు గట్టి పునాదులు వేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పానికి అనుగుణంగా ప్రాథమిక విద్యలో విప్లవాత్మక మార్పులు తెస్తూ అధికారులు కీలక ప్రతిపాదనలు రూపొందించారు. అందులో భాగంగా ఫౌండేషన్‌ స్కూళ్లకు అంకురార్పణ జరగనుంది.

జనాభా తక్కువగా ఉండే చిన్న చిన్న ఆవాసాల్లో (హ్యామ్లెట్స్‌) పీపీ –1, పీపీ–2 (ప్రీ ప్రైమరీ) స్కూళ్లు మాత్రమే ఉంటాయి. మిగతా అన్ని చోట్ల ప్రీ ప్రైమరీ, ప్రిపరేటరీ, 1, 2 తరగతులతో ఫౌండేషన్‌ స్కూళ్లు ఉంటాయి. వీటిపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొన్ని సూచనలు చేయడంతో పాటు వ్యయం, విద్యారంగంపై చూపే ప్రభావాన్ని పూర్తిస్థాయిలో మదింపు జరిపి తదుపరి సమీక్షలో నివేదించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..

నా తపన, ఆరాటం అందుకే..
చిన్నారుల్లో ఆరేళ్ల లోపే 80 శాతం మేధో వికాసం జరుగుతుంది. బాల్యంలో మెదడు బాగా చురుగ్గా ఉంటుంది. పిల్లలకు 8 ఏళ్ల వయసు వచ్చే నాటికి ఫౌండేషన్‌ కోర్సు పూర్తవుతుంది. ఆంగ్ల భాషలో చిన్నారులు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. అందుకే ఈ ఆలోచన చేశాం. నిరుపేద విద్యార్థులకు కూడా అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలనేదే నా తపన, ఆరాటం. ఆ ఆలోచనల నుంచి ఆవిర్భవించినవే వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లు.. ఫౌండేషన్‌ స్కూళ్లు. అన్ని వసతులతో విద్యార్థులకు విద్యా బోధన నిర్వహించేలా ‘మన బడి నాడు – నేడు’ చేపట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేస్తున్నాం.

 పీపీ స్కూళ్లు – మ్యాపింగ్‌..
ఇక ఇప్పుడు ఏర్పాటు చేయదలచిన ఫౌండేషన్‌ స్కూళ్లు అన్నీ ఒక కిలోమీటర్‌ దూరం లోపే ఉండాలి. అన్ని హైస్కూళ్లు (3 తరగతి నుంచి 10 లేదా 12వ తరగతి) మూడు కిలోమీటర్ల దూరం లోపే ఉండాలి. వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లు పిల్లలకు చాలా దగ్గరగా అందుబాటులో ఉండాలి. ఆ విధంగా ఆ స్కూళ్ల మ్యాపింగ్‌ చేయాలి. టీచర్ల బోధనా సామర్థ్యాన్ని మరింత మెరుగ్గా వినియోగించుకునేలా విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌) చేయాలి.

తద్వారా పిల్లలకు అత్యుత్తమ విద్య అందించవచ్చు. కొత్త ప్రతిపాదనల ప్రభావంపై అధికారులు పూర్తిస్థాయిలో సమాలోచనలు జరిపి తదుపరి సమీక్షలో నివేదించాలి. ఒకవేళ వాటిని అమలు చేయాల్సిన పక్షంలో ముందుగా 3, 4, 5 తరగతులను  హైస్కూళ్లకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఖరారు అయిన తర్వాత ఫౌండేషన్‌ స్కూళ్లలో చేపట్టాల్సిన నాడు – నేడు కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.

డిజిటల్‌ టీచింగ్‌.. మెథడాలజీ
స్థానిక ప్రాథమిక పాఠశాలల్లో పీపీ – 1, పీపీ – 2, ప్రిపరేటరీ, 1, 2 తరగతులతో ఫౌండేషన్‌ స్కూళ్ల ఏర్పాటు తర్వాత డిజిటల్‌ బోధన(డిజిటల్‌ టీచింగ్‌)పై దృష్టి పెట్టండి. ఆ మేరకు డిజిటిల్‌ బోధనా పద్ధతులు (టీచింగ్‌ మెథడాలజీ) రూపొందించండి. మనం బ్లాక్‌ బోర్డు నుంచి గ్రీన్‌ బోర్డ్స్‌కు మారాం. ఇక ముందు డిజిటల్‌కు వెళ్లే పరిస్థితి వస్తుంది. డిజిటల్‌ బోర్డుల డ్యూరబులిటీ (దీర్ఘకాలం మన్నిక) ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. మనం ఏర్పాటు చేసే పరికరం నాణ్యంగా, ధృఢంగా (రోబస్ట్‌) ఉండాలి. మరమ్మతులకు అవకాశం తక్కువగా ఉండే డివైజ్‌లను గుర్తించండి. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీలన చేయండి. ఎన్ని స్కూళ్లలో, ఎన్ని క్లాస్‌రూమ్‌లలో ఏర్పాటు చేయగలం? ఎంత వ్యయం అవుతుంది? అన్నవాటిని సమీక్షించాలి.    

జూనియర్‌ కాలేజీలపై..
అధికారులు చేస్తున్న తాజా ప్రతిపాదనల వల్ల కాస్ట్‌ ఇంపాక్ట్, ఎడ్యుకేషన్‌ ఇంపాక్ట్‌పై పరిశీలన చేయండి. ప్రతి మండలానికీ ఒక జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేయాలనుకున్నాం. అలా కాకుండా ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లలోనే 11, 12 తరగతులను పెట్టడమా? లేక మండలానికి ఒక జూనియర్‌ కాలేజీని పెట్టాలా? అలాగే కొన్ని మండలాల్లో అవసరాల మేరకు రెండు జూనియర్‌ కాలేజీలు పెట్టాలా? అన్నదానిపై పూర్తి స్థాయి పరిశీలన చేయండి. దీనిపై తర్వాత తుది నిర్ణయం తీసుకుందాం. దీనివల్ల 11, 12 తరగతులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో మంచి విద్య అందించే అవకాశం ఉంటుంది. 

వైఎస్సార్‌ క్లినిక్స్‌కు సేవల బదలాయింపు..
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలు వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, అర్బన్‌ క్లినిక్స్‌కు బదలాయింపు జరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు, పౌష్టికాహారంపై అవగాహన, వ్యాధి నిరోధకత కోసం ఇచ్చే వ్యాక్సిన్లు, రిఫరల్‌ సర్వీసులన్నీ వాటికి బదలాయింపు అవుతాయి. తద్వారా సుశిక్షితులైన సిబ్బంది ద్వారా మెరుగైన ఆరోగ్య సేవలు అందుతాయి.

ఇవీ ప్రతిపాదనలు

  • ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు గట్టి పునాదులపై గత సమావేశంలో నిర్ణయించిన ప్రకారం పాఠశాల విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు పలు ప్రతిపాదనలు సమర్పించారు.
  •  టీచర్ల సేవలను సమర్థంగా వినియోగించుకోడం, ఉత్తమ విద్యాబోధన తదితర అంశాలే లక్ష్యాలుగా సరికొత్త ఆలోచనలు. ఇందులో భాగంగానే ఫౌండేషన్‌ స్కూళ్ల ఏర్పాటు. ఇప్పటి మాదిరిగానే యథావిధిగా ఆ స్కూళ్లలో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అమలు 
  • పీపీ –1, పీపీ –2, ప్రిపరేటరీ, 1వ తరగతి, 2వ తరగతికి ఫౌండేషన్‌ స్కూళ్లు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో దీనికి ఆనుకుని ఉన్న అంగన్‌వాడీ కేంద్రం విలీనం. తద్వారా ఫౌండేషన్‌ స్కూళ్లకు అంకురార్పణ. 
  • ఫౌండేషన్‌ స్కూళ్ల పరిధిలోకి వాటికి సమీపంలోని పీపీ –1, పీపీ –2లుగా మారుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు. పాఠ్యాంశాలు, సమగ్ర బోధనా పద్ధతులతో పాటు వాటిలో నైపుణ్యాల స్థాయి పెంపు. మల్టీలెవల్‌ లెర్నింగ్‌పై ఫౌండేషన్‌ స్కూళ్ల ద్వారా దృష్టి.
  • ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3, 4, 5 తరగతులు సమీపంలోని అప్పర్‌ ప్రైమరీ (యూపీ) స్కూళ్లు, హైస్కూళ్లకు బదలాయింపు. ఆ మేరకు యూపీ స్కూళ్లు, హైస్కూళ్లగా మార్పు. అవసరాలకు అనుగుణంగా తరగతి గదుల నిర్మాణం.
  • ఫౌండేషన్‌ స్కూళ్ల ఏర్పాటు ద్వారా అధ్యాపక స్రవంతిలోకి అంగన్‌వాడీ టీచర్లను తీసుకురావాలని ప్రతిపాదన. వారు సరైన నైపుణ్యాలు సంతరించుకునేలా శిక్షణ కార్యక్రమాలు. ప్రమోషన్ల ద్వారా ప్రైమరీ స్కూళ్లలో ఎస్‌జీటీలు (టీచర్లు)గా అవకాశం.
  • సమావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ గిరిజాశంకర్, పాఠశాల విద్య కమిషనర్‌ వాడ్రేపు చినవీరభద్రుడు, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లాతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement