చరిత్రలో తొలిసారిగా.. దేవాలయానికి ప్రభుత్వ నిధులు | CM Jagan Laid Foundation Stone For Developmental Works Vijayawada | Sakshi
Sakshi News home page

చరిత్రలో తొలిసారిగా.. దేవాలయానికి ప్రభుత్వ నిధులు

Published Fri, Jan 8 2021 10:27 AM | Last Updated on Fri, Jan 8 2021 10:28 AM

CM Jagan Laid Foundation Stone For Developmental Works Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా ఒక దేవాలయం అభివృద్ధి పనుల కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి భారీ ఎత్తున నిధులు విడుదల చేస్తోంది. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సమయంలో ఆలయం అభివృద్ధి పనులకు రూ.70 కోట్లు నిధులు ఇస్తామని ప్రకటించిన సీఎం జగన్‌ ఆ మాటను నిలబెట్టుకుంటూ రూ.70 కోట్లతో దుర్గ గుడివద్ద చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. 

సీజీఎఫ్‌ కాదు.. ఖజానా నుంచే
రాష్ట్రంలో ఇప్పటివరకు చిన్న ఆలయం మొదలు పెద్ద దేవాలయాల వరకు ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా సొంత నిధులు (భక్తులిచ్చే కానుకలు)తోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏమాత్రం ఆదాయం లేని ఆలయాలు శిధిలావస్థకు చేరితే జీర్ణోద్ధారణకు దేవదాయ శాఖ సీజీఎఫ్‌ (కామన్‌ గుడ్‌ ఫండ్‌) నిధుల నుంచి ఖర్చు చేస్తున్నారు. అధిక ఆదాయం సమకూరే ఆలయాల నుంచి దేవదాయ శాఖ ఏటా నిర్ణీత మొత్తంలో సేకరించే మొత్తాన్ని సీజీఎఫ్‌గా వ్యవహరిస్తారు. శిధిలావస్థకు చేరిన ఆలయాల పునఃనిర్మాణానికి ఈ నిధులు మంజూరు చేస్తుంది. అది కూడా ఇప్పటివరకు గరిష్టంగా రూ.ఐదు కోట్లకు మించి సీజీఎఫ్‌ నిధులు ఒక ఆలయానికి ఇచ్చిన ఉదంతాలు లేవని దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.70 కోట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించడం దేవదాయ శాఖ చరిత్రలో అపూర్వ ఘటనగా పేర్కొంటున్నారు. చదవండి: (మత విద్వేషాలకు భారీ కుట్ర)

నాడు ఆలయాల నిధులు కైంకర్యం..
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్‌ ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుండగా దీన్ని మభ్యపెడుతూ దేవదాయ శాఖ నిధులను మళ్లిస్తున్నారంటూ టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దుర్గ గుడి వద్ద అభివృద్ధి కార్యక్రమాల కోసం అమ్మవారి పేరిట ఉన్న బ్యాంకు డిపాజిట్లలో దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేసి ఆలయం చుట్టు పక్కల భూములను కొనుగోలు చేశారు. ఈ భూముల కొనుగోలు ప్రక్రియలో స్థానిక టీడీపీ నేతలు భారీగా లబ్ధి పొందగా అమ్మవారి ఆలయ నిధులు పూర్తిగా అడుగంటాయి. శ్రీశైలం దేవాలయం విషయంలోనూ బాబు ఇలాగే వ్యవహరించారు. ఆలయం వద్ద ఉన్న నిధుల కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా అభివృద్ధి పనులకు మంజూరు చేసి చివరకు అన్నదానం నిధులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టేందుకు గత సర్కారు పెద్దలు ప్రయత్నించారు. చదవండి: (మధ్యతరగతి ప్రజలకూ సొంతిల్లు)

దేవాలయాలపై దాడుల్ని సహించం
గుడులను కూలగొట్టినప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ–బీజేపీనే: మంత్రి బొత్స

సాక్షి, విజయవాడ: దేవాలయాలపై దాడుల్ని ప్రభుత్వం సహించదని, ఏ ఒక్క మతాన్ని నిర్లక్ష్యం చేయబోమని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో తొమ్మిది దేవాలయాల పునఃనిర్మాణం, దుర్గగుడి అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో కలసి ఆయన గురువారం పరిశీలించారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైనా పట్టించుకోకుండా గత సర్కారు దేవాలయాలను కూలగొట్టిందని బొత్స మండిపడ్డారు.

సుమారు రూ.1.79 కోట్లతో దేవాలయాలను పునఃనిర్మిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వమూ దుర్గగుడి అభివృద్ధికి డబ్బులు ఇవ్వలేదని, తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్‌ రూ.70 కోట్లు ఇస్తున్నారని చెప్పారు. గతంలో గుడులను కూల్చివేసినప్పుడు టీడీపీ, బీజేపీ కలసి అధికారంలో ఉన్నాయని, జనసేన మద్దతు ఇచ్చిందని తెలిపారు. నాడు దేవదాయశాఖ మంత్రిగా బీజేపీకి చెందిన వారే ఉన్నారని గుర్తు చేశారు. రామతీర్థం ఘటనపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే దీనిపై ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు.

పుష్కరాల పేరుతో దేవాలయాలను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టిన చంద్రబాబుకు వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దేవాలయాలను పునఃనిర్మిస్తామని తాము గతంలోనే చెప్పామని, ప్లైఓవర్‌ నిర్మాణం కారణంగా కొంత జాప్యం జరిగిందని వివరించారు. వందేళ్ల చరిత్ర ఉన్న దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి దేవాలయాన్ని, భక్తులు ఎంతో పవిత్రంగా భావించే సీతమ్మవారి పాదాలను, గోశాలలో గోపాలకృష్ణుడి దేవాలయాలను గత సర్కారు కూలగొట్టిందని, వీటిని పునఃనిర్మిస్తున్నామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement